మేడిగడ్డ బ్యారేజీలో నాలుగు గేట్లు కట్​ చేయాల్సిందే!

మేడిగడ్డ బ్యారేజీలో నాలుగు గేట్లు కట్​ చేయాల్సిందే!

 

  • మేడిగడ్డలో మరో రెండు గేట్లనూ తొలగించాలంటున్న అధికారులు
  •     ఇప్పటికే 20, 21 గేట్లను తీసేయాలన్న ఎన్​డీఎస్ఏ కమిటీ
  •     19, 22 గేట్లను కూడా తీసేయాలంటున్న అధికారులు
  •     రాఫ్ట్ కింద బొయ్యారంలో గ్రౌటింగ్​తో పాటు ఇసుకను నింపాలని నిర్ణయం
  •     పది వేల క్యూబిక్​ మీటర్ల ఇసుక పడుతుందని అంచనా

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీలో కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. నిన్న మొన్నటిదాకా రెండు గేట్లను పూర్తిగా తొలగించాలన్న అధికారులు.. ఇప్పుడు నాలుగు గేట్లను తొలగించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. బ్యారేజీలోని ఏడో బ్లాక్​లో పెద్ద కయ్య ఏర్పడడం, పిల్లర్ కింద భారీ బొయ్యారం బయటపడడంతో 20, 21 గేట్లకు ఆనుకుని ఉన్న మరో రెండు గేట్లనూ తీసేయాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. తొలుత తొలగించాలన్న రెండు గేట్లనూ పైకెత్తేందుకు ఏర్పాట్లు చేస్తే బాగుంటుందన్న అధికారులు.. ఇప్పుడు అక్కడ ఏర్పడిన కొత్త సమస్యతో వాటికి ఆనుకుని ఉన్న రెండు గేట్లు సహా నాలుగింటిని పూర్తిగా కట్​ చేసి తొలగించాలని అంటున్నారు. గేట్లను తొలగించడం ఆలస్యమైతే బ్యారేజీపై భారం పడుతుందన్న ఆందోళన నెలకొన్న నేపథ్యంలో.. గేట్ల తొలగింపు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తొలుత బొయ్యారం బయటపడిన పిల్లర్లు 20, 21 దగ్గరున్న 20వ నంబర్​ గేట్​ను తొలగించే పనులను మొదలుపెట్టారు. ఆర్క్ గౌజింగ్ పద్ధతి ద్వారా గేట్​ను సిబ్బంది కట్​ చేస్తున్నారు. బ్యారేజీలోని అన్ని గేట్లతో పాటు ఏడో బ్లాక్​లోని 12 నుంచి 14వ నంబర్ వరకు గేట్లను ఎత్తారు. శుక్రవారం 15వ నంబర్ గేటునూ ఎత్తారు. అయితే, 16 నుంచి  22వ నంబర్ వరకు గేట్లను ఎత్తాల్సి ఉంది. అయితే ఇప్పటికే బాగా డ్యామేజ్ అయిన 20, 21వ నంబర్ గేట్లకు అటూ ఇటు ఉన్న 19, 22వ నంబర్ గేట్లనూ పూర్తిగా తొలగించాల్సి ఉంటుందని చెప్తున్నారు.

ఎన్​డీఎస్ఏ కమిటీ సిఫార్సుల అమలు కష్టమే..

బ్యారేజీల వద్ద చేపట్టాల్సిన పనులపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) చేసిన సిఫార్సులను అమలు చేయడం కష్టమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వానాకాలం ప్రారంభమయ్యేందుకు రెండు వారాల టైం మాత్రమే ఉండడం, ఏడో బ్లాక్​ కింది బొయ్యారం మరింత పెద్దదిగా మారడం వంటి పరిణామాలతో ఎన్​డీఎస్ఏ సిఫార్సులను ఆ రెండు వారాల్లో పనులు చేయడం కష్ట సాధ్యమంటున్నారు. శనివారం జలసౌధలో సమావేశమైన ఎన్​డీఎస్ఏ సిఫార్సుల అమలు కమిటీ.. పలు పనుల ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఎన్​డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన పనుల్లో లేని పనులను అధికారులు సూచిస్తున్నారు. గ్రౌటింగ్​ను ఎన్​డీఎస్​ఏ నిపుణులు సూచించలేదని, దానిని తాము చేపట్టేందుకు అనుమతి తీసుకుంటున్నామని చెప్తున్నారు. బొక్క పడిన రాఫ్ట్​ కింద భారీ మొత్తంలో ఇసుక నింపాల్సి ఉంటుందని చెబుతున్నారు. అందుకు దాదాపు 10 వేల క్యూబిక్​ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని తేల్చి చెబుతున్నారు. ఆ ఇసుకను నది నుంచే తీసుకుని ఫిల్​ చేయాలని నిర్ణయించారు. ఇసుకతో పాటు కాంక్రీట్​ మిశ్రమాన్నీ అందులో నింపాలని అంటున్నారు. ఇసుకను డ్రెడ్జింగ్ మెషీన్లతో బొరియల్లోకి ప్రెజర్ ద్వారా పంపించే ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని అధికారులు ఎల్ అండ్​ టీ సంస్థ ప్రతినిధులకు సూచించినా.. సంస్థ తిరస్కరించినట్టు తెలిసింది. తమ వద్ద సమర్థవంతమైన మెషీన్లున్నాయని, వాటితోనే ప్రెజర్ గ్రౌటింగ్ చేస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పినట్టు తెలిసింది. వాటితో పాటు పలు చోట్ల సిమెంట్, బెంటనైట్​తో జాయింట్లను అతికించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నట్టు సమాచారం. పిల్లర్లపై భారం పడకుండా ఉండాలంటే ఈ పని చేయాలని సూచిస్తున్నారు. 

ముందుకు కదలని నవయుగ

సుందిళ్ల బ్యారేజీ వద్ద నవయుగ సంస్థ పనులను లేట్​ చేస్తున్నట్టు తెలిసింది. సుందిళ్ల బ్యారేజీని నవయుగ సంస్థనే నిర్మించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మేడిగడ్డ వద్ద ఎల్ అండ్ టీ, అన్నారం వద్ద అఫ్కాన్స్ సంస్థలు రిపేర్లను ప్రారంభించాయి. కానీ, సుందిళ్ల వద్ద నవయుగ మాత్రం మెషినరీ, వర్క్​ఫోర్స్ తరలింపులో తీవ్రమైన జాప్యం చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీనిపై ఆ సంస్థ ప్రతినిధులను పిలిపించి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ విషయంపై సీఎం సీరియస్​గా ఉన్నారని, వెంటనే పనులను ప్రారంభించాల్సిందిగా సంస్థకు స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే వారికి ఫండ్స్ ప్రాబ్లమ్ ఉందని, పెండింగ్ బిల్లులను క్లియర్ చేయించాలని సంస్థ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారని తెలుస్తున్నది. ఇటు పనులనూ వేగవంతం చేస్తామని సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చినట్టు సమాచారం.

సీడబ్ల్యూపీఆర్ ఎస్ రిపోర్ట్ రెడీ!

ఎన్​డీఎస్ఏ సూచించిన పనులతో పాటే జియోఫిజికల్, జియోటెక్నికల్ టెస్టులను చేయిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే మూడు బ్యారేజీలను పరిశీలించిన సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్​, పవర్ రీసెర్చ్ స్టేషన్) నిపుణులు.. దాని మీద ఓ రిపోర్ట్​ను కూడా సిద్ధం చేసినట్టు తెలిసింది. దానిని సంబంధిత అధికారులు పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి నివేదించనున్నట్టు సమాచారం. సీడబ్ల్యూపీఆర్ఎస్​కు చెందిన డ్యామ్ సేఫ్టీ ఎక్స్​పర్ట్ విజయ్ టి.దేశాయ్, సెంట్రల్​ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయెల్ రీసెర్చ్ (సీఐఎంఎఫ్​ఆర్) చీఫ్​ సైంటిస్ట్ డాక్టర్ మోరే రాములు, రాష్ట్ర ఐ అండ్​ సీఏడీ రిటైర్డ్ సీఈ, హైడ్రో మెకానికల్ ఎక్స్​పర్ట్ కె.సత్యనారాయణ, సీడీవో రిటైర్డ్ ఎస్ఈ, డిజైన్ ఎక్స్​పర్ట్ టి.రాజశేఖర్​లతో రిపోర్ట్​ను తయారు చేయించినట్టు తెలుస్తున్నది. ఈఎన్​సీ జనరల్ అనిల్ కుమార్​తో పాటు స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్, మేడిగడ్డ బ్యారేజీ అధికారులు, ఓ అండ్ ఎం ఈఎన్​సీ అధికారులు, సీడీవో అధికారుల సమక్షంలో బ్యారేజీల ఇన్​స్పెక్షన్ రిపోర్టులను రెడీ చేస్తున్నట్టు సమాచారం.