నల్గొండ జిల్లాలో చోరీలు చేస్తున్న నలుగురు అరెస్ట్ .. బైక్, 4 ఫోన్లు స్వాధీనం

నల్గొండ జిల్లాలో చోరీలు చేస్తున్న నలుగురు అరెస్ట్ .. బైక్, 4  ఫోన్లు స్వాధీనం
  • ఒకరు జైల్లో.. మరో ఇద్దరు పరార్​
  • 20 తులాల బంగారు, 1,800 గ్రాముల వెండి ఆభరణాలు, 

నల్గొండ అర్బన్, వెలుగు: సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో ఇండ్లలో చోరీలు చేస్తున్న నలుగురిని నల్గొండ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం యరసానిగూడెంకు చెందిన ఉబ్బని యోగేశ్వర్ తుర్కయంజాల్ లో నివాసం ఉంటూ కారు డ్రైవింగ్ చేసేవాడు. ఇతనికి నల్గొండకు చెందిన వల్లూరి యువరాజ్, ఏపీలోని వెస్ట్ గోదావరి నర్సాపూర్ కు చెందిన బాలెం రాజేశ్, హైదరాబాద్ బాలాపూర్ కు చెందిన దస్తర్ బండి షఫీ, మరో ముగ్గురు తలారి మనోజ్, సాయికుమార్, శ్రీకాంత్ పరిచయమయ్యారు. అందరూ మద్యానికి బానిసై, జల్సాల కోసం ఏడాదిగా రాచకొండ, వరంగల్, సైబరాబాద్ కమిషనరేట్ ల పరిధిలో, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో రాత్రిళ్లు తాళం వేసిన ఇండ్లలో దొంగతనాలు చేస్తున్నారు. 

వీరిపై పోలీస్​స్టేషన్లలో 23 కేసులున్నాయి. నిందితుల్లో మనోజ్​గంజాయి కేసులో నల్గొండ జైల్లో ఉన్నాడు. మిగతావారు మంగళవారం సాయంత్రం నల్గొండ టూ టౌన్ పోలీసులకు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ లాడ్జిలో ఉన్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లి యోగేశ్వర్, యువరాజ్, రాజేశ్,  షఫీని అరెస్ట్ చేశారు. సాయికుమార్, శ్రీకాంత్ పరారయ్యారు. రాజేశ్, షఫీ గతంలో ఎల్బీనగర్, సరూర్ నగర్, కూకట్ పల్లి, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో బైక్​లు చోరీ చేసి, చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చారు. 

చోరీ చేసిన సొత్తుతో హైదరాబాద్ వెళ్లి ఎంజాయ్​చేసేవారు. నిందితుల వద్ద నుంచి 20 తులాల బంగారు,1,800 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక వెండి చెంబు, పళ్లెం, బైక్, 2 ల్యాప్ టాప్ లు, 4 సెల్ ఫోన్లు, మౌస్, స్పీకర్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకున్న నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవరావు, ఎస్సై సైదులు, రూరల్ ఎస్సై సైదాబాబు, సిబ్బంది రాజు, బాలకోటి, శంకర్ ను అభినందించారు.