
- దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
- వచ్చే నెల 28న బయో ఏసియా సదస్సు సందర్భంగా ప్రారంభం
- డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండేతో సీఎం రేవంత్ భేటీ
హైదరాబాద్, వెలుగు : స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. డబ్ల్యూఈఎఫ్ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (సీ4ఐఆర్) హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది. బయో ఏషియా- 2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ సెంటర్ ప్రారంభం కానుంది. దావోస్ లో జరుగుతున్న సదస్సులో డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర బృందం మంగళవారం చర్చలు జరిపింది.
అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. డబ్ల్యూఈఎఫ్ దృక్పథం, లక్ష్యాలు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డబ్ల్యూఈఎఫ్, తెలంగాణ ప్రభుత్వం మధ్య అద్భుతమైన సమన్వయం కుదిరిందని చెప్పారు. ప్రజల జీవితాలు బాగు చేయాలన్న ఆలోచనలతో డబ్ల్యూఈఎఫ్ పని చేస్తోందని కొనియాడారు. డబ్ల్యూఈఎఫ్ భాగస్వామ్యంతో ప్రజారోగ్యంలో కొత్త విధానాలు అందుబాటులోకి తీసుకొస్తామని, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు.
హెల్త్ టెక్ హబ్‌గా తెలంగాణ..
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. డబ్ల్యూఈఎఫ్ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (సీ4ఐఆర్) హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది. హెల్త్ టెక్ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ‘‘హెల్త్ టెక్, లైఫ్ సైన్సెస్ రంగాలకు భవిష్యత్తులో నాయకత్వం వహించే అవకాశాలెన్నో మన దేశానికి ఉన్నాయి. అందులో తెలంగాణ ముందంజలో ఉంది. ప్రపంచంలోనే మొదటి ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా సీ4ఐఆర్ ఏర్పాటుతో తెలంగాణ మరింత కీలకంగా మారనుంది.
ఇది ప్రభుత్వ రంగంతో పాటు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ మధ్య సమన్వయం కుదుర్చడానికి.. హెల్త్ కేర్ విభాగంలో ఉద్యోగాల కల్పనకు మద్దతుగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు. డబ్ల్యూఈఎఫ్ సెంటర్ ఫర్ హెల్త్ అండ్ హెల్త్ కేర్ హెడ్, ఎగ్జ్క్యూటివ్కమిటీ మెంబర్ డాక్టర్ శ్యామ్ బిషెన్ మాట్లాడుతూ.. ‘‘ఫోరమ్ అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న డిజిటల్ హెల్త్‌కేర్ ట్రాన్స్ ఫర్మేషన్ లక్ష్యం నెరవేరుతుందనే విశ్వాసముంది. దీంతో రోగులకు మెరుగైన సేవలు అందుతాయనే నమ్మకముంది’’ అని అన్నారు.
డబ్ల్యూఈఎఫ్ సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (సీ4ఐఆర్) నెట్‌వర్క్ ఐదు ఖండాల్లో ఉంది. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న సెంటర్ ప్రపంచంలో 19వది. హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ థీమ్ తో ఉన్నమొదటి కేంద్రం హైదరాబాద్ లోనే ప్రారంభం కానుంది. ఇది లాభాపేక్ష లేని సంస్థ. దీనికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ పాలసీల రూపకల్పన, వాటి అమలుకు నాయకత్వం వహిస్తుంది. హైదరాబాద్‌లో సీ4ఐఆర్ ప్రారంభంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.
ఇథియోపియా డిప్యూటీ పీఎంతో భేటీ..
ఇథియోపియా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెమెక్ హసెంటోతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్‌మ్యాప్‌పై చర్చించారు. అలాగే నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్తోనూ సమావేశమయ్యారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్సెంటర్ల ఏర్పాటు, ఉద్యోగాల కల్పనపై చర్చించారు.
తెలంగాణ పెవిలియన్..
డబ్ల్యూఈఎఫ్ సదస్సులో ‘ఇన్వెస్ట్ ఇన్తెలంగాణ’ పేరుతో ఏర్పాటు చేసిన పెవిలియన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక్కడ ‘ప్రపంచంలోనే అపారమైన అవకాశాలున్న తెలంగాణ’, ‘పెట్టుబడులకు దేశంలోనే మొట్టమొదటి గమ్యస్థానం తెలంగాణ’, ‘భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు.. మీ కోసమే తెలంగాణ’ అంటూ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. ‘‘సంప్రదాయ మేళవింపుతో ఆవిష్కరణలు.. జీవవైద్య రంగానికి డేటా సైన్స్జోడీ.. ప్రతిభను ప్రతిబింబించే సాంకేతికత.. పరిశ్రమల నుంచి సమగ్రత.. స్థిరత్వం నుంచి ఆర్థిక వృద్ధి సిద్ధిస్తుంది” అంటూ తెలంగాణకు ఉన్న అనుకూలతలను పేర్కొన్నారు. ‘వేర్ట్రెడిషన్ మీట్స్ఇన్నోవేషన్’ ట్యాగ్‌లైన్‌తో ఈ ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటేలా రూపొందించిన ఈ వేదిక అందరినీ ఆకర్షిస్తోంది.