క్యాటర్​పిల్లర్ అనే యాప్​లో పెట్టుబడుల పేరిట మోసం

క్యాటర్​పిల్లర్ అనే యాప్​లో పెట్టుబడుల పేరిట మోసం

మహబూబ్​నగర్​, వెలుగు : పెట్టిన పెట్టుబడికి వంద రెట్లు లాభాలు వస్తాయని ఆశపడి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 400 మంది సుమారు రూ.50 కోట్లు పోగొట్టుకున్నారు. క్యాటర్​పిల్లర్ అనే యాప్​లో డబ్బులు డిపాజిట్ ​చేయగా ఇప్పుడు అది మూతపడడంతో బోరుమంటున్నారు. ఒక్కొక్కరుగా పోలీస్​స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. 

అధిక మొత్తం ఆశచూపి..

కొందరు మోసగాళ్లు మూడేండ్ల కింద క్యాటర్​పిల్లర్ (క్యాట్)​ యాప్​ ప్రారంభించారు. ఈ యాప్​ద్వారా డోజర్లు, హిటాచీలు, రోడ్​ రోలర్లు అద్దెకు తీసుకొని పనులు చేస్తామని, ఇందుకు సహకారం కావాలని దసరా, దీపావళి సందర్భాల్లో  పేద, మధ్య తరగతి, ఉద్యోగులు, చిరు వ్యాపారులను అట్రాక్ట్​చేశారు. యాప్​లో డబ్బులు డిపాజిట్​ చేసిన వారికి మూడింతల లాభం వస్తుందని బోల్తా కొట్టించారు. రూ.600 నుంచి రూ.10 లక్షల వరకు ఇన్వెస్ట్​ చేయొచ్చని, రూ.600 కడితే ప్రతి రోజూ రూ.18, రూ.వెయ్యికి రూ.32, రూ.12 వేలకు రూ.360, రూ.10 లక్షలకు రూ.30 వేలు ఇస్తామని నమ్మించారు. వేరేవాళ్లను చేర్పిస్తే ఎక్స్​ట్రా అమౌంట్​ కూడా పే చేస్తామని నమ్మించారు. ఈ మాటలు నమ్మిన చాలామంది యాప్​ నిర్వాహకులు పంపించిన లింక్ ల ద్వారా యాప్ ​డౌన్​లోడ్​ చేసుకున్నారు. యూజర్​ ఐడీ, పాస్​వర్డ్​ క్రియేట్​ చేసుకుని పెట్టుబడులు పెట్టారు. మొదట్లో ప్రతిరోజూ అందరికీ డబ్బులు అకౌంట్లలో జమ చేయడంతో నమ్మారు. ఈ విషయాన్ని బంధువులు, దోస్తులకు చెప్పి మరీ చేర్పించారు. కొందరు అధిక లాభాలకు ఆశపడి పెట్టుబడి పెట్టేందుకు బంగారం, బైక్​లు తాకట్టు పెట్టారు. ఇలా ఇప్పటి వరకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.50 కోట్ల వరకు పెట్టారు. ఈ నెల 8వ తేదీన యాప్ పని చేయడం మానేసింది. దీంతో సోమవారం వనపర్తి, నాగర్​కర్నూల్​ జిల్లాలకు చెందిన బాధితులు పాలమూరులోని టూ టౌన్​ పోలీస్​స్టేషన్​కు వచ్చారు. అయితే, ఎక్కడి వారు అక్కడి పీఎస్​లలోనే కంప్లయింట్​ ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం రాత్రి వరకు టూటౌన్​ పోలీస్ స్టేషన్​లోనే 20 మంది ఫిర్యాదు చేశారు.  

యాప్​ సంస్థపై కేసు నమోదు చేశాం

క్యాటర్​పిల్లర్​అనేది ఆన్​లైన్ ​రెంటల్​ యాప్​అని, ఉమ్మడి పాలమూరు జిల్లాలో 400 మంది వరకు ఇందులో డబ్బులు ఇన్వెస్ట్​చేసి మోసపోయినట్లుగా తెలుస్తోందని టూటౌన్​ సీఐ ప్రవీణ్​కుమార్​ చెప్పారు. సురేందర్​అనే వ్యక్తి ఇచ్చిన కంప్లయింట్​ మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సురేందర్​ రెండు నెలల కింద తన ఫ్రెండ్​ పంపిన లింక్​తో యాప్​  డౌన్​లోడ్​ చేసుకున్నాడన్నారు. రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టి మోసపోయాడన్నారు. ఈయనకు వచ్చిన లింక్​ను ఫ్యామిలీ మెంబర్స్​కు, ఫ్రెండ్స్​కు పంపించాడన్నారు. లక్ష వరకు జరిగిన లావాదేవీలన్ని వేర్వేరు యూపీఐ ఐడీల ద్వారా జరిగాయని తెలిపారు. ఈ యాప్​ సంస్థపై కేసులు పెట్టామని, ఎంత మొత్తం మోసం చేశారనేది విచారణలో తేలుతుందన్నారు.