
- బ్యాంకు స్టేట్‌మెంట్ తో తేల్చిన ఉన్నతాధికారులు
రాయికోడ్, వెలుగు : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం చర్ల రాయిపల్లి, సింగీతం పంచాయతీల కార్మికుల జీతాలు కార్యదర్శి స్వాహా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. చర్ల రాయిపల్లికి చెందిన ముగ్గురికి.. గత ఏప్రిల్ నుంచి జూన్, సింగీతంకు చెందిన ఆరుగురు సిబ్బందికి గత ఫిబ్రవరి నుంచి జూన్ వరకు జీతాలు రాలేదు. వారు జీతాల కోసం ఎదురు చూస్తుండగా.. పెండింగ్ వేతనాలను జులై తొలివారంలోనే ప్రభుత్వం ఖాతాల్లో జమ చేసింది. అయితే.. చర్లరాయిపల్లి కార్యదర్శి రేఖా మెటర్నరీ లీవ్ లో ఉండగా.. ఇన్ చార్జ్ గా సింగీతం పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్ కు అదనపు బాధ్యతలు చేపట్టారు.
ఇదే అదనుగా తీసుకుని కార్యదర్శి అనిల్ కుమార్ ఆయా గ్రామాల స్పెషలాఫీసర్ల సంతకాలను చెక్కులపై పెట్టించుకుని.. కార్మికుల ఖాతాల్లో జమ చేయకుండా తన సొంత ఖర్చులకు వాడుకుని దాచిపెట్టాడు. కాగా.. మండలంలోని ఇతర పంచాయతీల కార్మికులు తమకు జీతాలు పడ్డాయని చెప్పుకుంటుండగా.. తమకెందుకు రాలేదని చర్లరాయిపల్లి, సింగీతం పంచాయతీల సిబ్బంది అనుమానిస్తూ కార్యదర్శి అనిల్ కుమార్ ను అడగడంతో సమాధానం చెప్పకుండా తప్పించుకున్నాడు. దీంతో ఎంపీడీఓ మహ్మద్ షరీఫ్ కు తమకు జీతాలు అందని పరిస్థితిపై కార్మికులు చెప్పుకున్నారు.
కార్మికుల వేతనాల్లో అవకతవకలు జరిగి ఉండొచ్చని ఎంపీడీఓ షరీఫ్ జిల్లా అధికారులకు నివేదిక అందించారు. దీంతో జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా ఆదేశాలతో డీఎల్ పీఓ అమృత గురువారం చర్లరాయిపల్లి, సింగీతం పంచాయతీల కార్మికులతో మాట్లాడి జీతాలు పడని విషయమై అడిగి తెలుసుకున్నారు. దీంతో కార్యదర్శి అనిల్ కుమార్ పై అనుమానం వ్యక్తం చేశారు. రెండు పంచాయతీలకు చెందిన బ్యాంకు అకౌంట్ల స్టేట్ మెంట్లు తీయించారు. అందులో కార్యదర్శి అనిల్ కుమార్ గత నెల10న జహీరాబాద్ లోని కెనరా బ్యాంక్ బ్రాంచ్ లో రూ. 3.70 లక్షలు డ్రా చేసినట్టు తేలింది. కార్యదర్శి అనిల్ కు ఫోన్ చేసి ఆఫీసుకు రావాలని డీఎల్ పీఓ చెప్పడంతో ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి.. తన తల్లి, భార్యను పంపించాడు. దీంతో కార్యదర్శి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నివేదికను జిల్లా అధికారులకు అందిస్తానని డీఎల్పీవో తెలిపారు.