ఫారిన్‌‌ కంపెనీల్లో షేర్స్‌‌ కొంటామని మోసం

ఫారిన్‌‌ కంపెనీల్లో షేర్స్‌‌ కొంటామని మోసం

రూ.318 కోట్లు వసూలు చేసిన కంపెనీలు
రెండు కంపెనీలకు చెందిన రూ.59.37 కోట్ల ఆస్తులను అటాచ్‌‌ చేసిన ఈడీ

హైదరాబాద్‌‌, వెలుగు: ఫారిన్‌‌ కంపెనీల్లో షేర్స్‌‌ కొనుగోలు చేస్తామని మోసాలకు పాల్పడిన కంపెనీలపై ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌ (ఈడీ) సోదాలు చేసింది. ఈ నేపథ్యంలో ఫార్‌‌మ్యాక్స్‌‌ ఇండియా లిమిటెడ్‌‌, ఇండియా ఫోకస్ కార్డినల్ ఫండ్ కంపెనీలకు చెందిన రూ.59.37 కోట్లు విలువ చేసే ఆస్తులను ఈడీ శుక్రవారం అటాచ్‌‌ చేసింది. ఫార్‌‌మ్యాక్స్‌‌ కంపెనీ డైరెక్టర్లు మోర్తాల శ్రీనివాస్‌‌రెడ్డి, మోర్తాల మల్లారెడ్డిలతో పాటు ఎన్‌‌ఆర్‌‌‌‌ఐ అరుణ్‌‌ పంచారియా ఫారిన్‌‌ కంపెనీల్లో షేర్ల కొనుగోలు పేరిట మోసానికి ప్లాన్ చేశాడు. లండన్‌‌కు చెందిన పాన్‌‌ ఏషియా అడ్వైజర్స్‌‌ లిమిటెడ్‌‌ (ప్రస్తుతం గ్లోబల్‌‌ ఫైనాన్స్‌‌ అండ్‌‌ క్యాపిటల్‌‌ లిమిటెడ్‌‌), ఇండియా ఫోకస్‌‌ కార్డినల్‌‌ ఫండ్‌‌ అండ్‌‌ వింటేజ్‌‌ ఎఫ్‌‌జెడ్‌‌ఈ (ప్రస్తుతం అల్ట్రా ఇంటర్నేషనల్‌‌ ఎఫ్‌‌జెడ్‌‌ఈ)లకు చెందిన సంజయ్‌‌ అగర్వాల్‌‌, జలజ్‌‌ బాత్ర కంపెనీల్లో జీడీఆర్‌‌(గ్లోబల్‌‌ డిపాజిటరీ రిసిప్ట్స్‌‌) విధానంలో షేర్లు కొనుగోలు చేసేలా స్కెచ్ వేశారు. దీని ద్వారా ఇండియాకు చెందిన పలువురు బిజినెస్‌‌ మ్యాన్‌‌ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు సేకరించారు. ఇలా 2010 జూన్‌‌, ఆగస్టు నెలల్లో మొత్తం రూ.318 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారు. పలువురి నుంచి రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదులు అందడంతో కేసులు నమోదు చేశారు. జలజ్‌‌బత్రా, అరుణ్‌‌ పంచారియా, సంజయ్‌‌ అగర్వాల్‌‌, ముఖేశ్‌‌ చౌధరియాలను గతంలోనే అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్‌‌ కేసు దర్యాప్తులో భాగంగా అరుణ్‌‌ పంచారియా, సంజయ్‌‌ అగర్వాల్‌‌ ఆస్తుల వివరాలు ఈడీ సేకరించింది. ఈ కేసులో రూ.వందల కోట్ల మనీలాండరింగ్‌‌ జరిగినట్టు ఈడీకి సమాచారం అందింది. దీంతో పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌‌ఐఆర్‌‌ ఆధారంగా మనీ లాండరింగ్‌‌ యాక్ట్‌‌ కింద ఈడీ ఎఫ్‌‌ఐఆర్‌‌ నమోదు చేసి దర్యాప్తు చేసింది.