
- కలెక్టర్ తేజస్ నందలాల్ పవార
సూర్యాపేట, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఉచితంగా ప్రభుత్వం అందజేస్తోందని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎస్పీ కె.నర్సింహతో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ వానాకాలం ప్రారంభమైనందున ఇసుక సరఫరాకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మైనింగ్ శాఖ సహాయంతో ఇసుక బజారులను ఏర్పాటు చేసేందుకు ఆర్డీవోలు, తహసీల్దార్లు స్థలాలను గుర్తించాలని చెప్పారు.
నాగారం, -పెరబోయినగూడెం అప్రోచ్ రోడ్డుకు ప్రతిపాదనలు పంపాలని పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లను ఆదేశించారు. జిల్లాలో చేపడుతున్న జానపహాడ్, బెట్టె తండా, ముత్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్లకు, మున్నేరు వాగు రక్షణ గోడకు ఇసుక అనుమతి ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. జిల్లాలో ఎక్కడైనా ఇసుక అక్రమంగా డంపు చేస్తే సీజ్ చేయాలని చెప్పారు. ఇసుక రీచ్ లలో ఆధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి సూర్యాపేట జిల్లాలోకి ఇసుక రవాణాకు అనుమతి లేదన్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబు, డీఎఫ్ వో సతీశ్ కుమార్, డీఆర్డీవో పీడీ అప్పారావు, ఆర్డీవో వేణుమాధవ్, డీపీ యాదగిరి, ట్రాన్స్ ఫోర్ట్ అధికారి జయప్రకాశ్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.