ట్రాన్స్ జెండర్లకు ఉపాధి రెండు నెలలపాటు ఉచితంగా కుట్టు శిక్షణ 

ట్రాన్స్ జెండర్లకు ఉపాధి రెండు నెలలపాటు ఉచితంగా కుట్టు శిక్షణ 
  • ప్రస్తుతం 35 మందికి కొనసాగుతున్న శిక్షణ
  • రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్ట్ గా సూర్యాపేట జిల్లా ఎంపిక

సూర్యాపేట, వెలుగు : సమాజంలో ట్రాన్స్‌‌‌‌ జెండర్లు ఎన్నో అవమానాలు పడుతున్నారు. సరైన జీవనోపాధి లేక ఇబ్బందికర జీవనం సాగిస్తున్నారు. కాంగ్రెస్‌‌‌‌ అధికారంలోకి వచ్చాక ట్రాన్స్‌‌‌‌ జెండర్లకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర రాజధానిలో ట్రాఫిక్‌‌‌‌ విధుల నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. ఇటీవల సూర్యాపేట కలెక్టరేట్‌‌‌‌లో కలెక్టర్‌‌‌‌ తేజస్ నందలాల్ పవార్‌‌‌‌ నిర్వహించిన మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమశాఖ సమావేశానికి ట్రాన్స్‌‌‌‌ జెండర్లను ఆహ్వానించారు.

తమకు ఏదైనా ఉపాధి కల్పించాలని, భిక్షాటన చేయడం ఇబ్బందిగా ఉందని కలెక్టర్‌‌‌‌ ను కోరారు. దీంతో కలెక్టర్‌‌‌‌ మహిళా సాధికారిత కేంద్రం ద్వారా ట్రాన్స్‌‌‌‌ జెండర్లకు కుట్టు మిషన్​లో శిక్షణ ఇప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు అవసరమైన నిధులను డీఎంఎఫ్ టీ నుంచి మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త వ్యవసాయ మార్కెట్‌‌‌‌ సమీపంలో మహిళా సాధికారిత ఆధ్వర్యంలో ట్రాన్స్‌‌‌‌ జెండర్లకు కుట్టు మిషన్​లో శిక్షణ కల్పిస్తున్నారు. 

ట్రాన్స్ జెండర్లకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం..

ఉచిత కుట్టు మిషన్ శిక్షణతో ట్రాన్స్‌‌‌‌ జెండర్ల జీవితాల్లో ప్రభుత్వం కొత్త వెలుగులు నింపనుంది. సమాజంలో వారు గౌరవం బతికేలా శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం 35 మంది కుట్టు మిషన్​లో శిక్షణ తీసుకుంటున్నారు. శిక్షణ అనంతరం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఆర్థికసాయం కూడా చేయనుంది. 

35 మంది హాజరు..

సూర్యాపేటలో ట్రాన్స్‌‌‌‌ జెండర్లకు అందిస్తున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణకు ప్రస్తుతం 35 మంది హాజరవుతున్నారు. ఈ శిక్షణ రెండు నెలలపాటు కొనసాగనుంది. ప్రతిరోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శిక్షణ కొనసాగుతోంది. ముఖ్యంగా జాకెట్లు, లంగాలు, పంజాబీ డ్రెస్‌‌‌‌లతోపాటు ఇతర దుస్తులకు సంబంధించిన కటింగ్‌‌‌‌ చేసి కుట్టే విధానాన్ని నేర్పిస్తున్నారు. ఈ శిక్షణ కోసం డీఎంఎఫ్టీ ఫండ్స్ నుంచి కలెక్టర్ రూ.10 లక్షలు కేటాయించారు. శిక్షణ పూర్తయిన వారికి ప్రత్యేకంగా రుణాలు మంజూరు చేయించి వారితో సొంతంగా వ్యాపారం చేయించాలని ప్రణాళికలు రూపొందించారు. దీంతో వారు నివసించే ప్రాంతాల్లో అయినా, ఇతరచోట్ల అయినా కుట్టు మిషన్‌‌‌‌ ద్వారా బట్టలు కుట్టి ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయి. 

పైలెట్‌‌‌‌ప్రాజెక్ట్‌‌‌‌ గా కుట్టు శిక్షణ..

రాష్ట్రంలోనే తొలిసారి ట్రాన్స్‌‌‌‌ జెండర్లకు సూర్యాపేటలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ఏర్పాటు చేశారు. ట్రాన్స్‌‌‌‌ జెండర్ల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం నుంచి చేపట్టిన కార్యక్రమాలు ఇప్పటివరకు లేవు. కేవలం హైదరాబాద్‌‌‌‌లో మాత్రమే వారిని ట్రాఫిక్‌‌‌‌ విధుల్లోకి తీసుకున్నారు. సమాజానికి స్ఫూర్తి కలిగించేలా ట్రాన్స్‌‌‌‌ జెండర్లకు జీవనోపాధి అందించేందుకు ఒక విప్లవాత్మకమైన మార్పు కోసం సూర్యాపేటలో కుట్టు మిషన్ శిక్షణను ప్రారంభించారు. 

సామాజిక గౌరవం కోసం శిక్షణ 

ట్రాన్స్‌‌‌‌ జెండర్లకు సమాజంలో గౌరవంగా బతికేందుకు కలెక్టర్‌‌‌‌ తేజస్‌‌‌‌ నందలాల్‌‌‌‌ పవార్‌‌‌‌ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. ఈ శిక్షణతో వారు స్వయం ఉపాధి పొందనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ట్రాన్స్‌‌‌‌ జెండర్లకు ఎక్కడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఉచిత కుట్టు శిక్షణను ట్రాన్స్‌‌‌‌ జెండర్లు సద్వినియోగం చేసుకోవాలి.  నరసింహరావు, సంక్షేమాధికారి, సూర్యాపేట జిల్లా