
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ ఫేవరెట్, రెండో సీడ్ అరినా సబలెంకా సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. అన్‌సీడెడ్ ప్లేయర్ కరోలినా ముచోవా ఆమెకు చెక్ పెట్టి ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం హోరాహోరీగా సాగిన విమెన్స్ సింగిల్స్ సెమీస్‌లో 43వ ర్యాంకర్ ముచోవా(చెక్ రిపబ్లిక్) 7–6 (7/5), 6–7 (5/7), 7–5తో ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్ సబలెంకా (బెలారస్)పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 3 గంటల 13 నిమిషాల మారథాన్ పోరులో టై బ్రేక్స్‌కు దారి తీసిన తొలి రెండు సెట్స్‌లో అరినా, ముచోవా చెరోటి నెగ్గారు. మూడోసెట్‌లో ఓ దశలో 5–2తో నిలిచిన సబలెంకా సులువుగా గెలిచేలా కనిపించింది.
ఈ దశలో అద్భుతంగా పుంజుకున్న ముచోవా సబలెంకాను ఓడించింది. దాంతో ఫ్రెంచ్ ఓపెన్ విమెన్స్‌లో ఫైనల్ చేరిన ఫోర్త్ లోయెస్ట్ ర్యాంకర్‌గా నిలిచింది. ఇక్కడ వరుసగా ఐదో ఏడాది అన్‌సీడెడ్ ప్లేయర్ ఫైనల్‌కు రావడం విశేషం. కాగా, బుధవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–1, 6–2, 3–6, 6–3తో ఆరో సీడ్ హోల్డర్ రూనె (డెన్మార్క్)ను ఓడించి సెమీస్ చేరాడు.