2014 నుంచి 2020 వరకు రాష్ట్రంలో 6121 మంది రైతుల ఆత్మహత్య

2014 నుంచి 2020 వరకు రాష్ట్రంలో 6121 మంది రైతుల ఆత్మహత్య
  • స్టేట్​ పోలీస్​ డిపార్ట్​మెంట్​ లెక్కలు ఇవీ
  • అయినా.. ఆత్మహత్యలే లేవంటున్న సీఎం కేసీఆర్​
  • రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో ప్లేస్.. ఎన్​సీఆర్బీ రిపోర్ట్​లో వెల్లడి​​
  • 2022లో వెయ్యి మందికిపైగా సూసైడ్​ చేసుకున్నారన్న రైతు స్వరాజ్య వేదిక
  • నిరుడు 23 వేల కుటుంబాలకు రైతు బీమా ఇచ్చినట్టు స్టేట్​ స్టాటిస్టికల్​ రిపోర్ట్.. అందులో రైతుల మరణానికి కారణాలు చెప్పని సర్కారు
  • ఈ నెలలోనే 11 మంది రైతుల బలవన్మరణం

హైదరాబాద్, వెలుగు: అప్పుసప్పు చేసి ఎవుసం చేస్తే లాగోడి పైసలు కూడా ఎల్లక కొందరు.. చెడగొట్టు వానలకు నిండా మునిగి ఇంకొందరు.. మార్కెట్లో పంటకు సరైన రేటు రాక మరికొందరు.. ఇట్లా రాష్ట్రంలో రోజూ ఎక్కడో ఓ చోట రైతులు ప్రాణాలు కోల్పోతున్నరు. బలవన్మరణాలకు పాల్పడుతున్నరు. రాష్ట్ర పోలీస్​ డిపార్ట్​మెంట్​ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 2014 నుంచి 2020 వరకు 6,121 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నరు. నేషనల్ క్రైమ్​ రికార్డ్స్​బ్యూరో (ఎన్​సీఆర్బీ) రిపోర్ట్​ ప్రకారం.. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. 2022లో రాష్ట్రంలో వెయ్యి మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఇటీవల రైతు స్వరాజ్య వేదిక ప్రకటించింది. ఈ నెలలో ఇప్పటివరకు 11 మంది అన్నదాతలు సూసైడ్​ చేసుకున్నరు. కానీ, సీఎం కేసీఆర్​ మాత్రం ‘‘రాష్ట్రంలో బిల్కుల్​ రైతుల ఆత్మహత్యలే లేవు. తలెత్తుకొని తిరుగుతున్నరు. మేం ఎంతో ప్రయాసపడి, వాళ్లకు వెన్నంటి నిలిచి, కొన్ని ప్రయోజనాలు ఇచ్చి ఆత్మహత్యలు లేకుండా చేసినం” అని చెప్తున్నరు. 

రైతు ఆత్మహత్యల వివరాల కోసం దాఖలైన ఆర్టీఐ అప్లికేషన్​కు ఇటీవల రాష్ట్ర పోలీస్​ డిపార్ట్​మెంట్​ స్పందించి.. లెక్కలు వెల్లడించింది. 2014 నుంచి 2020 వరకు ఏ ఏ జిల్లాలో ఎంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో వివరించింది. ఏడేండ్లలో   6,121 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడినట్టు అందులో తెలిపింది. 2015లో 1,400 మంది సూసైడ్​ చేసుకున్నట్లు వెల్లడించింది. నేషనల్ క్రైమ్​ రికార్డ్స్​బ్యూరో (ఎన్​సీఆర్బీ)  ప్రకారం 2015లో రాష్ట్రంలో  1,358 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2016లో ఆత్మహత్యలు తగ్గినా.. ఆ తర్వాత వరుసగా రెండేండ్లు అంటే 2017, 2018లో మళ్లీ  పెరిగాయి. 2014 నుంచి 2021 వరకు  5,956 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని పేర్కొంది. 

రాష్ట్ర స్టాటిస్టికల్​ రిపోర్ట్​లో బీమా లెక్కలు చెప్పి..!

మూడు రోజుల క్రితం రాష్ట్ర సర్కారు విడుదల చేసిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్​స్ట్రాక్ట్​లో రైతుబీమాకు సంబంధించిన లెక్కలను వెల్లడించింది. 2018 నుంచి 2021 వరకు 88,620 క్లెయిములను సెటిల్​ చేశామని, రూ.4,431 కోట్ల మొత్తాన్ని రైతుల కుటుంబాలకు అందించామని ప్రభుత్వం పేర్కొంది. 2020–2021 ఏడాదికి సంబంధించి 23,436 క్లెయిములను సెటిల్​ చేయగా.. రూ.1,171.8 కోట్లు చెల్లించినట్టు తెలిపింది. 2022 నవంబర్​ 11 నాటికి 3,583 క్లెయిములకు గానూ రూ.179.15 కోట్లు ఇచ్చినట్టు వివరించింది. అయితే, రైతులు ఏ కారణంతో చనిపోయారన్న విషయాన్ని మాత్రం ఆ స్టాటిస్టికల్​ రిపోర్ట్​లో పేర్కొనలేదు. ఏటా ఎంత మంది రైతులు చనిపోతున్నారన్న లెక్కలు తీస్తున్న సర్కారు.. మరణానికి కారణాలనూ వివరిస్తున్నది. కానీ, ఆత్మహత్యల లెక్కలను మాత్రం దాస్తున్నది. ఎవరికీ తెలియకుండా ‘అదర్స్​’ అనే కేటగిరీలో పెడుతున్నదన్న విమర్శలు ఉన్నాయి. 

24 గంటల కరెంట్​ ఉట్టిమాటేనా..?

భూములు గుంజుకుంటున్నారని, ధరణిలో తప్పులున్నాయని, 24 గంటల కరెంటు రావట్లేదని, వడ్లు కొంటలేరని.. రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. సర్కారు గొప్పగా చెప్పుకుంటున్న 24 గంటల కరెంటు.. పది గంటలు కూడా ఇస్తలేరని, త్రీఫేజ్​ కరెంట్​ అర్ధరాత్రుళ్లు ఇస్తున్నారని రైతులు ధర్నాలకు దిగుతున్నారు. ఒక్క రైతు బంధు ఇచ్చి మిగతా అన్ని పథకాలను సర్కారు బంద్​ పెట్టిందన్న విమర్శలు ఉన్నాయి. వరదలొస్తే పంట నష్టం అంచనాలనూ సర్కారు తీయడం లేదు. రుణమాఫీని పూర్తిగా అమలు చేయలేదు.