అశోక్ నగర్ నుంచి సిటీ సెంట్రల్ లైబ్రరీ వరకు.. నిరుద్యోగుల సక్సెస్​ ర్యాలీ

అశోక్ నగర్ నుంచి సిటీ సెంట్రల్ లైబ్రరీ వరకు..   నిరుద్యోగుల సక్సెస్​ ర్యాలీ
  • బీఆర్ఎస్​ను ఓడించడంలో నిరుద్యోగులదే కీలక పాత్ర: కోదండరాం  
  • ఆకాంక్షలను కాంగ్రెస్ సర్కార్ నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడి   

ముషీరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో నిరుద్యోగులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్​లోని అశోక్ నగర్ చౌరస్తా నుంచి జవహర్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, వివేక్ నగర్ మీదుగా చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వరకు వందలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు ర్యాలీ తీశారు. దీనికి టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం హాజరై మాట్లాడుతూ.. ఎన్నికల్లో నిరుద్యోగ సమస్య ప్రధాన అంశంగా మారడం దేశంలోనే అరుదు అని అన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానని చెప్పారు. 

బుధవారం సాయంత్రం అశోక్ నగర్ చౌరస్తా నుంచి జవహర్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, వివేక్ నగర్ మీదుగా చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వరకు వందలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, పోటీ పరీక్షల నిపుణుడు, కాంగ్రెస్ నేత రియాజ్, అశోక్, రఘు, మహిపాల్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్క నిరుద్యోగి తమ ఓటు వేయడమే కాకుండా తమ కుటుంబ సభ్యులతోనూ ఓటు వేయించారన్నారని అన్నారు. 

ప్రతి గ్రామంలో ప్రజలతో, ఊరు పెద్దలతో మాట్లాడి నిరుద్యోగ సమస్యను వారికి వివరించారన్నారు. అందుకే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపని బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారన్నారు. బీఆర్ఎస్ సర్కారు దిగిపోయిన సందర్భంగా వేలాది మంది నిరుద్యోగులు సంబరాలు జరుపుకొంటూ ర్యాలీలో పాల్గొన్నారని కోదండరాం చెప్పారు. కొత్తగా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. ర్యాలీలో గద్దర్ పాటలతో డీజే పెట్టి నిరుద్యోగులు డ్యాన్స్ లు చేస్తూ పాల్గొన్నారు.