
- యూకేతో ఇండియా వాణిజ్య ఒప్పందం..ఈవీలు, స్కాచ్ విస్కీ చీప్
- యూకే నుంచి కొనే 90 శాతం ప్రొడక్ట్‌లపై తగ్గనున్న సుంకాలు
- మన ఎగుమతుల్లో 99 % ప్రొడక్ట్‌లపై జీరో టారిఫ్
- ఇరు దేశాల మధ్య రూ.10.32 లక్షల కోట్లకు చేరనున్న వాణిజ్యం
న్యూఢిల్లీ: ఇండియా, యూకే మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్‌టీఏ) కుదరడంతో ఈ దేశానికి మన ఎగుమతులు భారీగా పెరగనున్నాయి. ఒప్పందంలో భాగంగా ఇండియా ప్రొడక్ట్‌లపై ఇంపోర్ట్ డ్యూటీ జీరోకి తగ్గుతుంది. దీంతో ఇంజనీరింగ్ గూడ్స్, రసాయనాలు, ఫుడ్ ప్రాసెసింగ్, మెడిసిన్స్ , సాఫ్ట్‌వేర్ సేవలు వంటి వివిధ రకాల ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఎఫ్‌టీఏతో ఇరు దేశాల మధ్య జరిగే వ్యాపారం ప్రస్తుతం ఉన్న ఏడాదికి 54 బిలియన్ డాలర్ల (రూ.4.64 లక్షల కోట్ల) నుంచి 2030 నాటికి ఏడాదికి 120 బిలియన్ డాలర్ల (రూ.10.32 లక్షల కోట్ల) కు చేరుకుంటుందని అంచనా.
ఇండియాలో వీటి రేట్లు తగ్గనున్నాయి..
ఒప్పందంలో భాగంగా యూకే నుంచి దిగుమతి చేసుకుంటున్న 90 శాతం ప్రొడక్ట్‌లపై సుంకాలను ఇండియా తగ్గించనుంది. ఈ దేశం నుంచి వచ్చే స్కాచ్ విస్కీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, కాస్మొటిక్స్ వంటి ప్రొడక్ట్‌ల రేట్లు దిగిరానున్నాయి.
వీటిపై తగ్గనున్న టారిఫ్..
స్కాచ్ విస్కీ: దిగుమతి సుంకం 150 శాతం నుంచి వెంటనే 75శాతానికి, 10 ఏళ్లలో 40 శాతానికి తగ్గుతుంది.
ఎలక్ట్రిక్ వాహనాలు: కోటా ఆధారంగా టారిఫ్‌ను 110 శాతం నుంచి 10 శాతానికి భారత ప్రభుత్వం తగ్గించనుంది. కోటా అంటే పరిమితి సంఖ్యలో చేసుకునే ఈవీల దిగుమతులపై టారిఫ్ తగ్గుతుంది. ఈ కోటాను మించి దిగుమతి చేసుకునే వాటిపై ఎప్పటిలానే టారిఫ్ పడుతుంది. కాస్మొటిక్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, సాల్మన్ చేపలు, మాంసం, సాఫ్ట్ డ్రింక్స్, వైద్య పరికరాలు చౌకగా లభిస్తాయి. వీటిపైన సగటు టారిఫ్ 15 శాతం నుంచి 3 శాతానికి తగ్గనుంది. దీంతో యూకే ప్రీమియం బ్రాండ్లు భారత వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి.
భారత ఎగుమతులకు జీరో టారిఫ్
యూకేకు జరిపే భారత ఎగుమతులలో 99 శాతం ప్రొడక్ట్‌లపై ఎటువంటి టారిఫ్ ఉండదు. ముఖ్యంగా ఇంజనీరింగ్ గూడ్స్, రసాయనాలు, పెట్రోకెమికల్స్ వంటి సెక్టార్లలోని చాలా ప్రొడక్ట్‌లపై ఎటువంటి టారిఫ్ పడదు.
ఇంజనీరింగ్ గూడ్స్: ఇంజనీరింగ్ గూడ్స్ సెక్టార్‌లోని 1,659 టారిఫ్ లైన్‌ల (ఉత్పత్తి కేటగిరిల) పై సుంకాలను యూకే ప్రభుత్వం సున్నాకు తగ్గించింది. 2024–25లో ఈ దేశానికి జరిపిన ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు 11.7 శాతం వృద్ధి చెందాయి. జీరో టారిఫ్ ఉంటే మన ఎగుమతులు మరింత పెరుగుతాయని అంచనా.
రసాయనాలు, పెట్రోకెమికల్స్: ఈ సెక్టార్లలోని1,206 టారిఫ్ లైన్‌లపై జీరో టారిఫ్‌ను యూకే ఆఫర్ చేసింది. ఈ దేశానికి జరిపే రసాయనాలు, పెట్రోకెమికల్స్ ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30–40శాతం పెరిగి 750 మిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది.
మెడిసిన్స్: జనరిక్ మెడిసిన్స్‌పై యూకే ప్రభుత్వం జీరో టారిఫ్ రేటు ఆఫర్ చేసింది.
ఆహార ప్రాసెసింగ్, వ్యవసాయం: బ్రిటన్ ఏడాదికి 50 బిలియన్ డాలర్ల విలువైన ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. ఇన్‌స్టంట్ కాఫీ, టీ, స్పైసెస్ వంటి సెగ్మెంట్లలో జర్మనీ, స్పెయిన్‌తో సమానంగా ఇండియా పోటీపడడానికి వీలుంటుంది. అంతేకాకుండా డెయిరీ, కూరగాయల ఎగుమతులను పెంచొచ్చు.
ఎలక్ట్రానిక్స్: స్మార్ట్‌ఫోన్‌లు, ఇన్వర్టర్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌పై సుంకం పడదు. రత్నాలు, ఆభరణాలు: యూకేకు 941 మిలియన్ డాలర్ల విలువైన రత్నాలు, నగలు ఎగుమతి అవుతున్నాయి. ఇందులో నగల వాటానే 400 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇంకో 2–3 ఏళ్లలో ఈ నెంబర్ రెట్టింపు అవుతుందని అంచనా.
సాఫ్ట్‌వేర్, ఐటీ సేవలు: ఈ సెక్టార్ నుంచి 2024–25లో 32 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ఇవి 15–20శాతం పెరుగుతాయని అంచనా. 60 వేల మంది భారత టెక్ ప్రొఫెషనల్స్ యూకే వెళ్లి రావడం ఈజీ అవుతుంది.
మెరైన్ ఎగుమతులు: చేపలు, రొయ్యలు వంటి మెరైన్ ఉత్పత్తుల ఎగుమతులపై 20శాతం వరకు ఉన్న సుంకాన్ని సున్నాకి తగ్గించారు.
యూకేకు దక్కే ప్రయోజనాలు..
యూకే భారత్‌లో సెన్సిటివ్ కాని ప్రభుత్వ టెండర్ల కోసం అప్లయ్ చేసుకోవచ్చు. వీటి విలువ రూ.2 కోట్ల పైన ఉండాలి. దీర్ఘకాలంలో ఇండియాకు యూకే ఎగుమతులు 60శాతం పెరుగుతాయని అంచనా. కాగా, ఈ ఒప్పందం భారత్‌లో కేబినెట్ ఆమోదం, యూకే పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది.
సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలు..
ఎఫ్‌టీఏలో సోషల్ సెక్యూరిటీ ఒప్పందం ఉంది. దీనిలో భాగంగా యూకేలో మూడేళ్ల వరకు పనిచేసే భారత ప్రొఫెషనల్స్ బ్రిటిష్ సోషల్ సెక్యూరిటీ సిస్టమ్‌లో చెల్లింపులు జరపాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల సంవత్సరానికి రూ.4 వేల కోట్లు ఆదా అవుతాయి. డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ కింద 75 వేల భారత ప్రొఫెషనల్స్ ఈ మినహాయింపు పొందుతారు. 1,800 మంది భారత చెఫ్‌లు, యోగా ఇన్‌స్ట్రక్టర్లు, శాస్త్రీయ సంగీతకారులు టెంపరరీగా యూకేలో సేవలు అందించేందుకు అనుమతిచ్చారు.