FASTag కొత్త రూల్స్.. యూపీఐ పేమెంట్లపై పెనాల్టీ తగ్గించిన కేంద్ర ప్రభుత్వం..

FASTag కొత్త రూల్స్.. యూపీఐ పేమెంట్లపై పెనాల్టీ తగ్గించిన కేంద్ర ప్రభుత్వం..

FASTag Penalty Relief: భారతదేశంలో జాతీయ రహదారులపై టోల్ వసూళ్లలో నగదు లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త చర్యను చేపట్టింది. ఇప్పటివరకు FASTag లేని వాహనాలకు లేదా పనిచేయని FASTag ఉన్న వాహనాలకు టోల్ ప్లాజాల వద్ద డబుల్ టోల్ ఛార్జీలు చెల్లించాల్సి వచ్చేది. అయితే నవంబర్ 15 నుంచి అమలులోకి తీసుకొస్తు్న్న కొత్త నిబంధనల ప్రకారం FASTag లేని లేదా పనిచేయని వాహనదారులు యూపీఐ పేమెంట్స్ చేస్తే వాస్తవ రుసుముకు 1.25 రెట్లు చెల్లించాల్సి ఉంటుంది. క్యాష్ రూపంలో పే చేసేవారికి గతంలో మాదిరిగా 2 రెట్లు అంటే డబుల్ పేమెంట్ అలాగే కొనసాగనుంది. 

ఉదాహరణకు వాహనదారుడు సరైన లేదా పనిచేస్తున్న FASTag లేకుండా రహదారి ప్రయాణంలో టోల్ ఫీ చెల్లించాలనుకుంటే రూ.100 ఉన్న టోల్ చార్జీలను క్యాష్ రూపంలో చెల్లిస్తే రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఇదే టోల్ చార్జీలను యూపీఐ పేమెంట్ చేస్తే రూ.125 కడితే సరిపోతుంది. అంటే ఇక్కడ యూపీఐ పేమెంట్స్ ద్వారా చెల్లింపులకు పెనాల్టీల విషయంలో ఊరటను అందించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే ఏదైనా సాంకేతిక కారణం వల్ల టోల్ ప్లాజా వద్ద ఫాస్ట్‌టాగ్ నుంచి డబ్బు కట్ కాకపోతే ఉచితంగా వాహనదారులు పాసాన్ అవ్వొచ్చని వెల్లడైంది. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా FASTag వినియోగం 98 శాతానికి చేరుకుంది. దీని వలన 2022 నాటికి ప్రతి వాహనం టోల్ ప్లాజాలో వేచివుండే సమయం సగటుగా 47 సెకన్లకు తగ్గింది. రవాణా శాఖ అంచనాల ప్రకారం టోల్ సేకరణలో అవినీతి, డబ్బు చేతులు మారటం వంటి కారణాలతో ప్రతి సంవత్సరం దాదాపు రూ.10వేల కోట్ల వరకు ఆదాయ నష్టాలు జరుగున్నట్లు గుర్తించబడింది. అందుకే క్యాష్ పేమెంట్స్ డిస్కరేజ్ చేయాలని కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. 

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టం అమలుపై పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కొత్త నిబంధన ద్వారా నగదు లావాదేవీలను తగ్గించి, టోల్ వసూళ్లలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.