సెక్యూరిటీ గార్డు నుండి 400 కోట్ల పారిశ్రామికవేత్తగా ఎదిగి బీహార్ రాజకీయాల్లోకి అడుగు.. ఎవరు ఈ నీరజ్ సింగ్..

సెక్యూరిటీ గార్డు నుండి 400 కోట్ల పారిశ్రామికవేత్తగా ఎదిగి బీహార్ రాజకీయాల్లోకి అడుగు.. ఎవరు ఈ నీరజ్ సింగ్..

జీవితం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో  చెప్పలేం.. కొందరికి అదృష్టం కిలిసొస్తే... మరికొందరికి ప్రారంభించిన పని జీవితంలో ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది.. చిన్నప్పుడు ఏవేవో కలలు కంటుంటారు కానీ, పెద్దయ్యాక పరిస్థితులు మనల్ని తప్పక చేసేలా చేస్తుంది. కానీ ప్రతి మనిషికో రోజు వస్తుంది అన్నట్టు...  ఉత్తర్ ప్రదేశ్ చెందిన నీరజ్ సింగ్ జీవితంలో కూడా అదే జరిగింది.  

ఒకప్పుడు సైకిల్ కొనాలని కలలు కన్న నీరజ్ సింగ్ నేడు రూ.400 కోట్ల టర్నోవర్‌తో వ్యాపార సామ్రాజ్యాన్నే నడిపిస్తున్నాడు. 18 ఏళ్లు నిండకముందే ఇల్లు వదిలి వెళ్లిపోయిన 38 ఏళ్ల నీరజ్ సింగ్ ఢిల్లీ వీధుల్లో సెక్యూరిటీ గార్డుగా కెరీర్‌ ప్రారంభించాడు. నేడు, ఆయన బీహార్‌లోని షియోహార్ జిల్లాకు చెందిన అత్యంత సక్సెస్ ఫుల్ పారిశ్రామికవేత్తల్లో ఒకరు.

మధురపూర్ గ్రామంలో జన్మించిన నీరజ్ 2000 సంవత్సరంలో టెన్త్ పూర్తి చేసి ఉద్యోగం కోసం జార్ఖండ్ కు వెళ్లాడు. అయితే, చిన్న వయస్సు కారణంగా అతనికి ఉద్యోగం దొరక్క ఇంటికి తిరిగి వచ్చాడు, అక్కడ కుటుంబాన్ని పోషించడానికి పెట్రోల్, డీజిల్ అమ్మడం ప్రారంభించాడు. కానీ కుటుంబ బాధ్యతలు త్వరలోనే అతన్ని మళ్ళీ బయటకు వెళ్లేలా చేసింది. అదే అతని జీవితంలో ఒక మలుపుగా మారింది.

Also Read : హిందీ సినిమాలను.. తమిళనాడులో బ్యాన్ చేయాలని.. స్టాలిన్ సర్కార్ నిర్ణయం !

2003లో నీరజ్ ఢిల్లీకి వచ్చాక  తక్కువ జీతానికి డబుల్ షిఫ్టు పనిచేస్తూ సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగంలో చేరాడు. ఒక సంవత్సరం తర్వాత  అతను పూణేకు వెళ్లి అక్కడ మెల్లిగా ఆఫీస్ బాయ్ నుండి HR అసిస్టెంట్‌గా ఎదిగాడు. కానీ అమ్మమ్మ మరణంతో అతను మళ్ళి  సొంతూరికి వచ్చి 2010లో మోతీహరిలోని ఒక మైక్రోఫైనాన్స్ కంపెనీలో చేరి నెలకు రూ.3,300 సంపాస్తూ, అక్కడే అతను మార్కెట్ డైనమిక్స్ & వ్యాపార అవకాశాలు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసాడు.

మోతీహారీలో పనిచేస్తున్నప్పుడు నీరజ్ కు ధాన్యాల వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. అతని బంధువుకి భూమి కొనడానికి సహాయం చేయడంతో అతనికి బహుమతిగా రూ.25 వేలు వచ్చాయి, అతను ఆ డబ్బు ఉపయోగించి ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు, అదే  అతని జీవితాన్ని మార్చివేసింది. అతని ధాన్యం వ్యాపారం తక్కువ టైంలోనే 20 నుండి 30 కోట్ల టర్నోవర్‌కు పెరిగి,  అతని వ్యవస్థాపక ప్రయాణానికి పునాది వేసింది.

ఇలా మెల్లిమెల్లిగా  నీరజ్ తన వ్యాపారాలను టైల్స్, ఫైబర్ బ్లాక్స్, ఫ్లై-యాష్ ఇటుకలు, రోడ్డు నిర్మాణం, పిండి మిల్లులు, ఇటుక తయారీలోకి విస్తరించాడు. అతని కంపెనీ ఉషా ఇండస్ట్రీస్ ఇప్పుడు 2వేల  మందికి పైగా ఉద్యోగం కల్పిస్తుంది, ఈ కంపెనీ ఉత్పత్తులను వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులలో ఉపయోగిస్తున్నారు. 2025లో అతను షియోహార్-మోతీహారీ రోడ్డులో సొంత పెట్రోల్ పంపును కూడా ప్రారంభించాడు, రోడ్డు పక్కన పెట్రోల్ డీజిల్ అమ్మడంతో ప్రారంభమైన అతని ప్రయాణానికి గుర్తుగా ఈ పని చేశాడు.

నీరజ్ సింగ్ ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టారు. ఆయన షియోహార్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 'జాన్ సూరాజ్' అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రాజ్‌పుత్ కమ్యూనిటీకి చెందిన నీరజ్ సింగ్‌ను 'పోరాటం ద్వారా విజయానికి' చిహ్నంగా పరిగణిస్తారు. నీరజ్ సింగ్ ముజఫర్‌పూర్‌లోని బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్, ఎల్.ఎల్.బి. పట్టా పొందారు. గత దశాబ్దంలో విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి అండ్ సామాజిక సంక్షేమంలో ఆయన చేసిన దాతృత్వ కృషికి ప్రసిద్ధి చెందారు.