రోడ్డుపై వెళ్తున్న మహిళల చేతిలోని  రూ. 2 లక్షలు చోరీ

రోడ్డుపై వెళ్తున్న మహిళల చేతిలోని  రూ. 2 లక్షలు చోరీ

గంటలో నిందితులను పట్టుకున్న పోలీసులు 
స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: రోడ్డుపై వెళుతున్న మహిళల చేతిలోని నగదును బైక్​పై వచ్చిన దుండగులు లాక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గంటలో నిందితులను పట్టుకున్నారు. ఏసీపీ వైభవ్​గైక్వాడ్​తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్ మండలం కొత్తపల్లికి చెందిన స్త్రీ నిధి మహిళా సంఘం సభ్యులు పులిగిల్ల స్వప్న, పులిగిల్ల రాధిక, ముక్కెర సమ్మక్కకు బ్యాంకు లింకేజీ రుణం మంజూరైంది. స్టేషన్​ఘన్​పూర్​లోని ఎస్బీఐకు శుక్రవారం మధ్యాహ్నం 1.05 గంటలకు వెళ్లారు. మహిళా సంఘం ఖాతా నుంచి రూ. 2.7 లక్షలు డ్రా చేశారు. పులిగిల్ల స్వప్న తన చేతిలోని ప్లాస్టిక్​ క్యారీబ్యాగ్​లో రూ. 2 లక్షలు, ముక్కెర సమ్మక్క రూ. 70 వేలు తన బ్యాగ్​లో పెట్టుకున్నారు. బ్యాంకులో ఆధార్​కార్డు అప్​డేషన్​కోసం వచ్చిన నమిలిగొండకు చెందిన గాదె సూర్యవంశీ(18), గాదె విష్ణు(18) మహిళల చేతిలోని డబ్బును గమనించారు. మధ్యాహ్నం 1.35 గంటలకు ముగ్గురు మహిళలు బ్యాంకు బయటకు వచ్చారు. రోడ్డుపై కొంతదూరం వెళ్లేసరికి స్కూటీపై వేగంగా ఎదురువచ్చిన ఇద్దరు యువకులు స్వప్న చేతిలోని బ్యాగ్​లాక్కుని పారిపోయారు. వెంటనే మహిళలు 100కు డయల్​చేశారు. సమాచారమందుకున్న సీఐ ఎడవెల్లి శ్రీనివాస్​రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్​ సిబ్బంది సీసీ పుటేజీలు పరిశీలించారు. నమిలిగొండ గ్రామంలో ఇద్దరు నిందితులను పట్టుకుని వారి నుంచి రూ. 2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. చోరీ జరిగినట్లు మధ్యాహ్నం 2 గంటలకు మహిళలు ఫిర్యాదు చేశారు. గంటలోనే నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సీఐ శ్రీనివాస్​రెడ్డి, ఎస్సైలు రమేశ్​నాయక్​, శ్రీనివాస్, మహేందర్, క్రైమ్​పార్టీ కానిస్టేబుళ్లు రవిప్రసాద్, కుమార్, కానిస్టేబుళ్లను ఏసీపీ అభినందించారు.