- రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
సిద్దిపేట రూరల్, వెలుగు: పండ్ల తోటలు, కూరగాయల సాగుతో రైతులకు అధిక లాభాలు వస్తాయని, రైతుల మేలు కోసం వీటి సాగును ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట వైశ్య సంక్షేమ సంఘం భవనంలో వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళాను ఆయన ప్రారంభించారు.
అనంతరం వ్యవసాయ, అనుబంధ రంగాల స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ రైతుల కష్టాలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పత్తి, వరితో పాటు మార్కెట్లో మంచి ధరలు వచ్చే సంప్రదాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. అనంతరం అభ్యుదయ రైతులను సన్మానించారు. కార్యక్రమంలో సిద్దిపేట కలెక్టర్ హైమావతి, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
