బంక్ల వద్ద క్యూల తో డెలివరీలు స్లో... డెలివరీ బాయ్స్ కు తగ్గిపోతున్న రేటింగ్స్

బంక్ల వద్ద క్యూల తో డెలివరీలు స్లో... డెలివరీ బాయ్స్ కు తగ్గిపోతున్న రేటింగ్స్
  •     గంటలకొద్దీ పనిచేసినా ఆదాయం అంతంతే..

హైదరాబాద్ సిటీ, వెలుగు: పెట్రోల్, డీజిల్ కొరతపై అపోహలతో బంకుల వద్ద పెరిగిన రద్దీ కారణంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఫుడ్ డెలివరీలు ఆలస్యమవుతున్నాయి. బంకుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌‌‌‌లైన్ డెలివరీ సేవలపై ప్రభావం పడుతోంది. ఇప్పటివరకు 15 నిమిషాల్లో అందే ఆర్డర్లు ప్రస్తుతం 30 నుంచి 45 నిమిషాలు పడుతున్నాయి. పెట్రోల్ కోసం క్యూలు, ట్రాఫిక్ రద్దీతో డెలివరీ బాయ్స్ సమయం వృథా అవుతోంది. దీంతో రోజుకు పూర్తి చేసే ఆర్డర్ల సంఖ్య తగ్గి ఆదాయంపై ప్రభావం పడుతోంది. 

సాధారణంగా 15 నుంచి 25 ఆర్డర్లు పూర్తి చేసే డెలివరీ బాయ్స్​ ఇప్పుడు 10 నుంచి 18 ఆర్డర్లకే 
పరిమితమవుతున్నారు. ఆలస్యాల కారణంగా కస్టమర్ ఫిర్యాదులు, రేటింగ్ తగ్గడం, ఇన్సెంటివ్‌‌‌‌లు కోల్పోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఆదాయం తగ్గడంతో చాలామంది ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తోంది.

క్విక్ కామర్స్‌‌‌‌కూ దెబ్బ..

జెప్టో, బ్లింకిట్ వంటి క్విక్ కామర్స్ సంస్థల సేవలూ దెబ్బతిన్నాయి. స్పీడ్​ డెలివరీలపై ఆధారపడి వ్యాపారం చేస్తున్న ఈ కంపెనీలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నాయి. బంకుల వద్ద రద్దీ కారణంగా డెలివరీలు ఆలస్యం కావడంతో కొందరు కస్టమర్లు ఆర్డర్లు రద్దు చేసుకుంటున్నారు.

పెట్రోల్​ పోసుకోవడానికి 3 గంటల టైమ్..

నేను రోజూ రూ.300 పెట్రోల్ పోసుకుంటా. పెట్రోల్ బంకుల వద్ద భారీగా రద్దీ ఉండడంతో రెండు మూడు గంటలకు పైగా టైం పడుతోంది. దీనికి తోడు ట్రాఫిక్ జాంతో మరింత టైమ్​ వేస్ట్​ అవుతోంది. దీంతో  ఎక్కువ డెలివరీలు చేయలేకపోతున్నాం.
-  రమేశ్, ఫుడ్ డెలివరీ బాయ్