మిల్లెట్స్​తో మస్తు బెనిఫిట్స్

మిల్లెట్స్​తో మస్తు బెనిఫిట్స్

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆహార, వ్యవసాయ సంస్థ, 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించింది. అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం  ఆహార భద్రత, పోషకాహారానికి మూలంగా మిల్లెట్స్  ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మిల్లెట్స్ ఉత్పత్తిని పెంచడం, స్థిరమైన ఆహార వ్యవస్థకు దోహదపడే దాని సామర్ధ్యాన్ని బహిర్గతం చేయడంపై దృష్టి సారిస్తుంది.  చిన్న కారు రైతులు, స్థానిక ప్రజలు, మహిళల జీవనోపాధిని మెరుగుపరుస్తుంది. మిల్లెట్స్ చాలా వరకు భారతదేశంలోనే పండుతాయి. ప్రపంచంలోని మిల్లెట్స్ ఉత్పత్తిలో దాదాపు 40 శాతం పైగా భారతదేశం ఉత్పత్తి చేస్తుంది.  బహుళ ప్రయోజనాలు ఉన్న మిల్లెట్స్ ను మనం అల్పాహారంగా, మధ్యాహ్న భోజనంగా, రాత్రి భోజనంగా తీసుకుంటాం.

ఇవి తేలికగా జీర్ణమవడమే కాకుండా అతి తక్కువ  గ్లైసిమిక్ సూచికను కలిగి ఉంటాయి. మిల్లెట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్​ అధిక మొత్తంలో ఉంటాయి.  ఇవి క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. గ్లూటెన్​ తక్కువగా ఉండటం, సులభంగా జీర్ణం కావడం వల్ల ఉదరకుహర వ్యాధులతో బాధపడే వారికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.  మధుమేహ వ్యాధి గలవారికి కూడా ఇవి ప్రయోజనకారిగా ఉంటాయి.  అందువల్ల మిల్లెట్స్ సమతుల్య ఆహారం. మిల్లెట్స్ ను ప్రధాన మిల్లెట్స్, చిన్న మిల్లెట్స్ అని రెండు గ్రూపులుగా వర్గీకరిస్తారు. ప్రధాన మిల్లెట్స్ లో పిరల్ మిల్లెట్స్ (సజ్జలు), గ్రేట్ మిల్లెట్స్, సోర్గం(జొన్నలు),  ఫింగర్ మిల్లెట్(రాగులు) అని, చిన్న మిల్లెట్స్​లో ఫాక్స్ టైల్ మిల్లెట్స్(కొర్రలు), లిటిల్ మిల్లెట్స్(సామలు), ప్రోసోమిల్లెట్స్(వరిగలు), బార్న్ యార్డ్ మిల్లెట్స్,  కోడో మిల్లెట్స్ అని ఉన్నాయి.

ఎన్నో ప్రయోజనాలు

గ్రేట్ మిల్లెట్స్- సోర్గం  (జొన్నలు): మనం ఆహారంలో జొన్నలను(రొట్టె లేదా గట్క రూపంలో) ప్రధానంగా తీసుకుంటాం. ఇవి చెడు కొలెస్ట్రాల్​ను నియంత్రిస్తాయి.  జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.  
ఫింగర్ మిల్లెట్స్(రాగులు): అధిక కాల్షియంను కలిగి ఉంటాయి. మిల్లెట్స్ అన్నిటిలో కంటే వీటిలో అధిక మినరల్స్ ఉంటాయి.  అందువల్ల ఇవి రక్తహీనత రాకుండా నివారిస్తాయి. వీటిని ప్రధానంగా బరువు  తగ్గించేందుకు ఉపయోగపడుతాయి. 


ఫాక్స్ టైల్  మిల్లెట్స్ (కొర్రలు): కొర్రలలో రెట్టింపు ప్రోటీన్ లు ఉంటాయి.  స్థూలకాయం, కీళ్ల నొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు, పార్కిన్సన్స్ మొదలైన వ్యాధులను నయం చేయడంలో కొర్రలు బాగా సహాయపడతాయి. 


ప్రోసోమిల్లెట్స్(వరిగలు): ఫైబర్(14.6),​ ప్రోటీన్లు(12.5%) విరివిగా ఉంటాయి.  కొలెస్ట్రాల్ ను తగ్గించడమే కాకుండా గుండె జబ్బుల ప్రమాదం నుంచి కాపాడుతాయి. వీటిలో ఎముకలకు అవసరమైన కాల్షియం అధిక మొత్తంలో లభిస్తుంది.

 
కోడోమిల్లెట్స్(అరికలు):
విటమిన్-–బి ముఖ్యంగా నియాసిన్, పిరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా కాల్షియం,  ఐరన్,  మెగ్నీషియం, జింక్ అధిక మొత్తంలో లభిస్తాయి.  నాడీ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. మధుమేహ వ్యాధి నియంత్రణకూ అరికలు బాగా దోహదపడతాయి

.   
బార్న్​యార్డ్ మిల్లెట్స్(ఊదలు/కొడిసామ):   పీచు పదార్థాలు, ఐరన్ మూలాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి.  వీటిలో గ్లూటెన్ ఉండదు కాబట్టి కొలెస్ట్రాల్ సమస్యలు, కాలేయ సంబంధిత,  మూత్రపిండాల వ్యాధులను నియంత్రించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.


లిటిల్ మిల్లెట్(సామలు): లిటిల్ మిల్లెట్ లో ఐరన్, ఫాస్పరస్ కంటెంట్ అధికంగా ఉంటుంది. మధుమేహం, జీర్ణకోశ వ్యాధులతో బాధపడే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.  పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు,  గర్భధారణ సమస్యల  నివారణలో సామలు బాగా ఉపయోగపడతాయి.


బ్రౌన్ టాప్ మిల్లెట్స్(అండుకొర్ర): వీటిలో కెరటినాయిడ్స్, పాలీ ఫినోల్స్ వంటి యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి. అందువల్ల ఇవి కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇలా ప్రతి మిల్లెట్​ ఆరోగ్యానికి ఏదో రకంగా మేలు చేసే గుణాలను కలిగి ఉంది. బలమైన సమాజం నిర్మాణంలో తృణధన్యాలు ఎంతో ఉపయోగపడుతాయి. 

కాలానుగుణంగా ఆహారం- ఆరోగ్యం

గత శతాబ్దం నుంచి  విపరీతంగా పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను  తీర్చడానికి హరిత విప్లవం వచ్చింది. అధిక దిగుబడినిచ్చే గోధుమలు, వరి రకాలను ప్రవేశపెట్టడం ద్వారా మెరుగైన ఉత్పాదకతకు మార్గాన్ని అది సుగమం చేసింది.  ఇది కొంతవరకు ఆహార లభ్యతను నిర్ధారించింది. ఫలితంగా ఇతర తృణధాన్యాల ఉత్పత్తిలో వేగంగా  క్షీణతను ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం వేగంగా మారుతున్న వాతావరణ ప్రతికూల పరిణామాలు, ఉష్ణోగ్రతలో మార్పులు వ్యవసాయ రంగంపై తీవ్రమైన ప్రభావాలను చూపిస్తున్నాయి.

ఉదాహరణకు పెరుగుతున్న కరువు ప్రభావిత నేలలు, పోషకాలు లేని నేలలు, అకాల వర్షపాతం మొదలైనవి ప్రపంచవ్యాప్తంగా దిగుబడి, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అందువల్ల మారుతున్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి, అననుకూల వాతావరణ పరిస్థితులను తట్టుకోగల ప్రత్యామ్నాయాలు మిల్లెట్స్. మిల్లెట్స్  కరువు, ఉష్ణోగ్రత, లవణీయత వంటి పరిస్థితులను తట్టుకోగలవు.  పోషకాలు లేని/ సారవంతం కాని నేలలో కూడా వీటిని పండించవచ్చు. ఇవి అకర్బన ఎరువులు,  పురుగుమందుల అవసరం లేకుండా, కీటక తెగులు రాకుండా నిరోధకతను కలిగి ఉంటాయి.  మిల్లెట్స్ అవసరమైన పోషకాలను కలిగిన ప్రత్యామ్నాయాలు.  ప్రజా వ్యవస్థ ద్వారా మిల్లెట్స్ ను సేకరించడం,  పంపిణీ చేయడం జరగాలి. ప్రజలలో అవగాహన కలిగించాలి. రైతులకు మిల్లెట్స్ దిగుబడి పెంచడానికి అవసరమైన విధానాలను తెలియజేయాలి. ఈ 2023, అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం  ద్వారా గ్లోబల్ స్థాయిలో మిల్లెట్స్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం, అవగాహన కల్పించడం  చేస్తూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించడానికి పునాదులు వేయాలి. 

- డా. చిందం రవీందర్, సోషల్​ ఎనలిస్ట్​