బార్డర్ లిక్కర్​ షాపులకు భారీగా అప్లికేషన్లు

బార్డర్ లిక్కర్​ షాపులకు భారీగా అప్లికేషన్లు
  • ఒక్కో షాపు కోసం 100కు పైగా టెండర్లు

ఖమ్మం, వెలుగు:  ఏపీ బోర్డర్ లో ఉన్న మండలాల్లో వైన్స్​ షాపుల టెండర్లకు అప్లికేషన్లు వెల్లువెత్తాయి. సరిహద్దు వెంట ఉన్న షాపులు దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. 2019తో పోలిస్తే ఆయా జిల్లాల్లో వైన్ షాపుల సంఖ్య పెరిగినప్పటికీ, షాపుల కోసం అప్లికేషన్లు కూడా పెరగడం విశేషం. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో అత్యధిక అప్లికేషన్లు బార్డర్ షాపులకే వచ్చినట్టు ఎక్సైజ్​ ఆఫీసర్లు చెబుతున్నారు.  ఏపీలో మద్యం రేట్లు ఎక్కువగా ఉండడం, బ్రాండెడ్ మద్యం లభించకపోవడంతో రెండేళ్లుగా ఆ రాష్ట్ర బోర్డర్​ వెంట ఉన్న  వైన్ షాపుల పంట పండుతోంది. ఇక్కడి నుంచి లిక్కర్​ను సీక్రెట్​గా ఏపీకి తీసుకెళ్లి అమ్మేవాళ్లు ఎక్కువ కావడం, చుట్టుపక్కల గ్రామాల్లో బెల్టు షాపులకు వెళ్లి తాగేవాళ్ల సంఖ్య పెరగడంతో బార్డర్ షాపుల్లో ఎక్సైజ్ ఆఫీసర్ల టార్గెట్ కు మించి బిజినెస్​ జరుగుతోంది. దీంతో బార్డర్ ​వెంట వైన్​ షాపులను దక్కించుకునేందుకు పోటీపడ్డారు. ఈసారి తెలంగాణ సర్కారు.. పక్క రాష్ట్రాల వ్యాపారులు కూడా జనరల్ కేటగిరీలో షాపులకు అప్లై చేసుకునేలా రూల్స్​మార్చడంతో ఏపీ వ్యాపారులు పెద్దసంఖ్యలో వచ్చి టెండర్లు వేశారు.
 
పెద్దసంఖ్యలో అప్లికేషన్లు.. 
ఖమ్మం జిల్లాలో 122 షాపులకు 6,214 అప్లికేషన్లు వచ్చాయి. 124.28 కోట్ల ఆదాయం కేవలం అప్లికేషన్ల ద్వారానే వచ్చింది.  2019లో 89 షాపులకు 4,303 అప్లికేషన్లు రాగా రూ. 86 కోట్ల ఆదాయం వచ్చింది. ముఖ్యంగా ఏపీ సరిహద్దున ఉండే నేలకొండపల్లి, మధిర, సత్తుపల్లి ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలోని షాపులకు భారీగా అప్లికేషన్లు వచ్చాయి. ఎర్రుపాలెం మండలంలోని మరో సరిహద్దు గ్రామం రాజుపాలెం షాపు కోసం 117 టెండర్లు పడ్డాయి. ఆ తర్వాత అత్యధికంగా ఎర్రుపాలెంలోని ఓ షాపు కోసం 116 అప్లికేషన్లు వచ్చినట్టు ఎక్సైజ్ ఆఫీసర్లు ప్రకటించారు. ఈసారి బెల్టుషాపుల నిర్వాహకులు పెద్దసంఖ్యలో అప్లికేషన్లు వేసినట్లు తెలిసింది.  8 నుంచి10 మంది సిండికేట్​గా మారి అప్లికేషన్లు వేయడం విశేషం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 88 మద్యం షాపులకు ఏకంగా 3,718 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో ఏపీకి సరిహద్దుగా ఉండే అశ్వారావుపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 షాపులు ఉండగా అక్కడ 680 దరఖాస్తులు అందాయి. అశ్వారావుపేట బార్డర్ లో ఉన్న ఒకటో నెంబర్ షాపుకు అత్యధికంగా 86 అప్లికేషన్లు వచ్చినట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. ఏపీ బార్డర్​లోనే ఉన్న  సూర్యాపేట జిల్లాలోనూ 99 వైన్స్ షాపులకు ఏకంగా  2,950 అప్లికేషన్లు వచ్చాయి.  కోదాడ మండలంలోని షాపులకు 888 టెండర్లు పడ్డాయి. ఈ మండలంలోని నల్లబండ గూడెం వైన్స్ షాప్ కు అత్యధికంగా 83 అప్లికేషన్లు వచ్చాయి. నల్గొండ జిల్లాలో 155 షాపులకు ఏకంగా 4,079 టెండర్లు వేశారు.  నాగర్​కర్నూల్ లో 67 షాపులకు ఏకంగా 1,482 అప్లికేషన్లు వచ్చాయి. కర్నూల్​ను ఆనుకొని ఉండే జోగులాంబ గద్వాల జిల్లాలోని 36 షాపులకు 975 దరఖాస్తులు రావడం విశేషం.

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో గతంలో మూడు వైన్ షాపులు ఉండగా , ఈసారి ఏపీ బార్డర్​లోని వల్లభి గ్రామంలో కొత్త షాపు ఏర్పాటుచేశారు. అందరూ ఊహించినట్లే ఈ షాపు కోసం ఏకంగా118 అప్లికేషన్లు వచ్చాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం జిల్లాలో లిక్కర్​ షాపుల కోసం 6 వేలకు పైగా అప్లికేషన్లు రాగా, అందులో అత్యధికంగా అప్లికేషన్లు వచ్చిన షాపుగా వల్లభి నిలిచింది. ఈసారి రూల్స్​సడలించడంతో ఏపీకి చెందిన వ్యాపారులు కూడా పోటాపోటీగా అప్లికేషన్లు వేయడం వల్లే బార్డర్​ జిల్లా ఖమ్మం టాప్​లో నిలిచినట్లు తెలుస్తోంది.