గోడౌన్లకు ఫుల్ డిమాండ్

గోడౌన్లకు ఫుల్ డిమాండ్

న్యూఢిల్లీ: నగరాల్లో చిన్న గోడౌన్లకు డిమాండ్ మరింత పెరుగుతుందని తాజా స్టడీలో తేలింది. దేశమంతటా ఆన్లైన్ షాపింగ్ పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. కరోనా భయంతో జనం బయటికి వెళడ్లం లేదు. షాపులకు వెళ్లి కొనేకంటే ఆన్లైన్ ద్వారా వస్తువులను ఇంటికి తెప్పించుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. త్వరగా డెలివరీ చేసే కంపెనీలకు ఎక్కువ ఆర్డ‌ర్లు వస్తున్నాయి. అందుకే అన్ని ఆన్లైన్ షాపింగ్ కంపెనీలు కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన రోజే డెలివరీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇంత త్వరగా డెలివరీ ఇవ్వాలంటే అన్ని నగరాల్లో గోడౌన్లు, అందులో ప్రొడక్టులు రెడీగా ఉండాలి. నగరాల లోపల ఐదు వేల నుంచి పది వేల చదరపు అడుగులు ఉన్న గోడౌన్లకు డిమాండ్ ఎక్కువ ఉండొచ్చని ప్రాపర్టీ కన్సల్టెంట్ కాలియర్స్ పేర్కొంది.

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్లైన్ షాపింగ్ కంపెనీలన్నీ నగరాల్లో గో డౌన్లను ఏర్పాటు చేసుకోవడాన్ని మొదలు పెట్టాయి. గతంలో డిస్ట్రిబ్యూషన్ హబ్స్ ఉపయోగించు కున్న వాటిని కంపెనీలు గోడౌన్లుగా మార్చుతాయని ఈ రిపోర్టు పేర్కొంది. ముఖ్యంగా ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో గోడౌన్లకు డిమాండ్ ఎక్కువ ఉంటుందని అంచనా వేసింది. కొరియర్ కంపెనీలు, సర్వీసు సెంటర్లు కూడా గోడౌన్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. కరోనా వల్ల షాపింగ్ మాల్స్ మూతబడటంతో ఆన్లైన్ షాపింగ్ ఆర్డ‌ర్లు పెరిగాయని మరో ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్ చైర్మన్ అనుజ్ పురి అన్నారు. దీంతో చాలా కంపెనీలు, షాపులు ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ ఆర్డ‌ర్ల‌ను పెంచుకునే పనిలో పడ్డాయని వివరించారు. ప్రస్తుతం చాలా కంపెనీలు నగర శివారలో్ల గోడౌన్లు ఏర్పాటు చేశాయి. దీనివల్ల ప్రొడక్టును డెలివరీ ఇవ్వడానికి సమయం పడుతోంది. రవాణా ఖర్చులూ ఎక్కువ అవుతున్నాయి. నగరంలోపలే గోడౌన్ ఉంటే మరింత త్వరగా, తక్కువ ఖర్చుతో డెలివరీ చేయవచ్చు కాబట్టి ఇన్–సిటీ గోడౌన్లు మరిన్ని ఏర్పాటు అవుతాయని కాలియర్స్ రిపోర్టు వివరించింది.