తెలంగాణ ఏం మారలే... దొర ఫక్తు రాజకీయం చేస్తండు

తెలంగాణ ఏం మారలే... దొర ఫక్తు రాజకీయం చేస్తండు
  •     తెలంగాణ ఏం మారలే
  •     ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలే
  •     దొర ఫక్తు రాజకీయం చేస్తండు
  •     ప్రజలు ఆలోచించాల్సిన 
  •     సమయం వచ్చింది
  •     ప్రజా గాయకుడు గద్దర్

వేములవాడ, వెలుగు :  తెలంగాణ వచ్చినప్పటికీ పేదల బతుకులు ఏమీ మారలేదని, పరిణాత్మక మార్పు తప్ప గుణాత్మక మార్పు రాలేదని,  ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చినా ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చలేకపోయిందని, ఇక ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్నూరు కాపు సత్రంలో నిరుపేద కళాకారుల సంక్షేమ సేవా సంస్థను శుక్రవారం గద్దర్ ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం నడిచిందని, కానీ ఆ ఆశయాలు నెరవేరలేదన్నారు. నీళ్లు తెచ్చినా, అవి ఎవరి భూముల్లోకి  వచ్చాయో అందరికీ తెలుసన్నారు. అప్పుడు మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పులపాలైందన్నారు.

ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి 10 వేల మంది పోటీపడ్తున్నారంటే రాష్ట్రంలో నిరుద్యోగం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. తెలంగాణ రాగానే తాను ఫక్తు రాజకీయం చేస్తానని చెప్పిన దొర, అలాగే చేస్తున్నాడన్నారు. ‘తెలంగాణ వస్తే  భూమి వస్తది, కొలువు వస్తది, రైతుల ఆత్మహత్యలు ఉండయి అని పాటలు పాడివన్ కదా..మరి తెలంగాణ వచ్చింది. అవన్నీ ఎవ్వి అని జనం నన్ను అడుగుతున్నరు. వాళ్లకు సమాధానం చెప్పలేకపోతున్న’ అని గద్దర్​ అన్నారు. రైతులు వడ్ల కుప్పల మీద పడి చనిపోతున్నారన్నారు. కళాకారులను సైతం ప్రజలే కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.  

హైదరాబాద్ లో సినీకళాకారులను ఎలా గుర్తిస్తున్నారో, అలాగే గ్రామీణ  కళాకారులకు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేములవాడ నృత్యా కళాకరుల సంఘం అధ్యక్షుడు యేళ్లే పోశెట్టి, వ్యవస్థాపక అధ్యక్షుడు మారం ప్రవీణ్​, మానువాడ లక్ష్మీనారాయణ, సోమినేని బాలు, మారం పల్లి రవీందర్, ఓరుగంటి శేఖర్, పొలాస నరేందర్​, కూరగాయల కొమురయ్య, తిరుమల్​ గౌడ్​, మారం కూమర్​, బొజ్జ కనుకయ్య పాల్గొన్నారు.