
- అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల తిప్పలు
- పేరుకుపోయిన దొడ్డు వడ్లు,
- తూకం వేయాలన్నా, లారీ పెట్టాలన్నా చేతులు తడపాల్సిందే
గద్వాల, వెలుగు: అకాల వర్షాలతో వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిల్లర్ల కొర్రీలతో కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్న వడ్ల కొనుగోళ్లతో పాటు దొడ్డు వడ్లను కొనకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర తూకం వేయాలన్నా, లారీలు పెట్టాలన్నా చేతులు తడపాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర హమాలీలు, లారీ డ్రైవర్ తో మొదలుకొని రైస్ మిల్లు ఓనర్ వరకు దోపిడీకి పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
తూకం వేయాలంటే రూ. 1000, లారీ పెట్టాలంటే రూ. 500, మిల్లుకు చేరాలంటే కేజీన్నర ధాన్యం తరుగు, సంచులు ఇవ్వాలంటే నిర్వాహకులకు కొంత డబ్బు ముట్టజెప్పాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది పైరవీ చేసిన వాళ్ల వడ్లు మాత్రమే కొని మిగతా వారి వడ్లు కొనడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఇంకా ఆరు వేల టన్నుల దొడ్డు వడ్లు కేంద్రాల్లోనే..
సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పడంతో రైతులు పెద్ద ఎత్తున సన్న వడ్లను సాగు చేశారు. కొందరు రైతులు దొడ్డువడ్లను కూడా సాగు చేశారు. ఈ సీజన్ లో 10 వేల టన్నుల దొడ్డు వడ్లు వస్తాయని అంచనా వేసి గద్వాల మండలం లత్తి పురం, ఇటిక్యాల మండలం కొండేరు, ధరూర్ మండలంలోని ఒక సెంటర్ లో వడ్ల కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు కేవలం 4 వేల టన్నుల దొడ్డు వడ్లను మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా 6 వేల టన్నుల వడ్లను కొనుగోలు కేంద్రాల దగ్గర కొనుగోలు చేయాల్సి ఉంది.
దొడ్డు వడ్లను బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపించాల్సి ఉన్నది. అక్కడికి పంపించిన వారు రోజుల తరబడి లారీలను దింపుకోకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద దొడ్డు వడ్ల రైతులు పడిగాపులు కాస్తున్నారు కొందరి వడ్లను తూకాలు వేసిన రైస్ మిల్లులకు సకాలంలో తరలించకపోవడంతో వడ్లు మొలకెత్తుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 74 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటివరకు 84 వేల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేశారు. ఈ సీజన్‌లో మొదట లక్ష 75 వేల మెట్రిక్ టన్నులు వడ్లు దిగుబడి వస్తాయని అంచనా వేశారు. ఆ తర్వాత వాటిని 1,38 లక్షల మెట్రిక్ టన్నులకు కుదించారు. ఇప్పటికీ 85 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు.
కలెక్టరేట్‌కు వడ్ల ట్రాక్టర్‌తో వచ్చి నిరసన..
గట్టు మండలం తప్పెట్ల మూర్సు గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే రైతు బుధవారం తన వడ్లను కొనుగోలు చేసి తూకం వేసినప్పటికీ మిల్లర్లు దింపుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వడ్ల ట్రాక్టర్ తో కలెక్టరేట్ ను ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల గద్వాల మండల పరిధిలోని అనంతపురం గ్రామానికి చెందిన రైతులు తూకాలు పెట్టడం లేదని, కేంద్రానికి తెచ్చిన ధాన్యం మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటీవల కలెక్టర్ కు కంప్లైంట్ చేశారు. చాలా కొనుగోలు కేంద్రాల్లో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
వారంలో కొనుగోళ్లు కంప్లీట్ చేస్తాం
వారం రోజుల్లో వడ్ల కొనుగోళ్లను కంప్లీట్ చేస్తాం. కొనుగోలు కేంద్రాల దగ్గర వడ్లు తడవకుండా చర్యలు తీసుకుంటున్నాం. రైతుల నుంచి డబ్బు వసూలు చేస్తే సహించేది లేదు. టార్గెట్ మీద దిగుబడి ఈసారి వచ్చే ఛాన్స్ లేదు. ఇంకా 15 వేల మెట్రిక్ టన్నుల వడ్లు వచ్చే ఛాన్స్ ఉన్నది.
లక్ష్మీనారాయణ,అడిషనల్ కలెక్టర్, గద్వాల.