డబ్బు కోసమే మహిళ హత్య.. నవంబర్ 2న గద్వాలలో హత్యకు గురైన మహిళ

డబ్బు కోసమే మహిళ హత్య.. నవంబర్ 2న గద్వాలలో హత్యకు గురైన మహిళ
  • నిందితుడిని అరెస్ట్‌‌ చేసిన పోలీసులు

గద్వాల, వెలుగు : గద్వాల పట్టణంలో ఈ నెల 2న జరిగిన మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. డబ్బుల కోసమే ఓ వ్యక్తి మహిళను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ధరూర్‌‌ మండలం గార్లపాడు గ్రామానికి చెందిన రాంరెడ్డి ఆన్‌‌లైన్‌‌ బెట్టింగ్‌‌, గేమ్స్‌‌కు అలవాటు పడి అప్పుల పాలయ్యాడు. గద్వాల పట్టణంలోని షేరెల్లి వీధికి చెందిన లక్ష్మి వడ్డీ వ్యాపారం చేస్తుండడంతో ఆమె దగ్గర డబ్బులు తీసుకొని అప్పులు తీర్చేయాలని నిర్ణయించుకున్నాడు. 

ఈ క్రమంలోనే 2వ తేదీన ఉదయం 11 గంటలకు స్కూటీపై లక్ష్మి ఇంటికి వచ్చి అప్పుగా డబ్బులు కావాలని అడిగాడు. ఆమె లేవని చెప్పడంతో ఆగ్రహానికి గురైన రాంరెడ్డి లక్ష్మి మెడలో ఉన్న పుస్తెల తాడును లాక్కున్న తర్వాత గొంతు నులిమి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాతి రోజు ఉదయం శంషాబాద్‌‌కు వెళ్లిన రాంరెడ్డి తన మిత్రుడు ఉమేశ్‌‌కు చెందిన గోల్డ్‌‌ షాప్‌‌లో పుస్తెలతాడును కరిగించి బిస్కెట్‌‌ రూపంలోకి మార్చాడు. 

తర్వాత దానిని హైదరాబాద్‌‌లోని ఉప్పరగూడలో అమ్మగా.. రూ. 4 లక్షలు రావడంతో వాటితో అప్పులు తీర్చేసి, మిగతా డబ్బును తనవద్దే పెట్టుకున్నాడు. లక్ష్మి భర్త మల్లికార్జున్‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు హత్య జరిగిన రోజున సీసీ కెమెరాలను పరిశీలించి.. రాంరెడ్డిని నిందితుడిగా గుర్తించారు. మంగళవారం ఉదయం రాంరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. 

నిందితుడి నుంచి రూ. 2.35 లక్షలు, స్కూటీ, ఐఫోన్‌‌ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. నిందితుడిని పట్టుకున్న ఎస్సైలు కళ్యాణ్‌‌కుమార్‌‌, సతీశ్‌‌రెడ్డి, శ్రీకాంత్, నందికర్, శ్రీహరి, కానిస్టేబుళ్లు చంద్రయ్య, కిరణ్, రామకృష్ణ, వీరేశ్‌‌ను ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ మొగులయ్య, సీఐ శ్రీను పాల్గొన్నారు.