గగన్‌యాన్ మిషన్: త్వరలోనే అంతరిక్షంలోకి మహిళా రోబోట్ వ్యోమగామి

గగన్‌యాన్ మిషన్: త్వరలోనే అంతరిక్షంలోకి మహిళా రోబోట్ వ్యోమగామి

భారతదేశ తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్ యాన్ మిషన్ కు సంబంధించి కేంద్ర శాస్త్ర,సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవలే ఓ కీలక ప్రకటన చేశారు. రెండో దశ ట్రయల్ రన్ లో భాగంగా మహిళా రోబోట్ వ్యోమిత్రను స్పేస్ లోకి ఈ ఏడాది చివరి నాటికి లేదా 2024ఆరంభంలో ఉంటుందని తెలిపారు. తాజాగా సైన్స్ & హ్యామనాయిడ్ (మానవ సహిత) మిషన్‌కు ముందు భారతదేశం వ్యోమిత్ర అనే మహిళా రోబోట్ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపనున్నట్లు మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.

ఇస్రో ప్రతిష్టాత్మక గగన్‌యాన్ ప్రాజెక్ట్ మానవ అంతరిక్షయానంలో భారతదేశ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉందని జితేంద్ర సింగ్ అన్నారు. మనుషులతో కూడిన మిషన్‌కు ముందు, 'వ్యోమిత్ర' అనే మహిళా రోబోట్ వ్యోమగామి, వచ్చే ఏడాదికి షెడ్యూల్ చేయబడిందని చెప్పారు. దాంతో పాటు డీప్ సీ మిషన్ ప్రాజెక్ట్ వచ్చే మూడు సంవత్సరాలలో సాకారం అవుతుందని భావిస్తున్నామన్నారు. ఇది లోతైన సముద్ర వనరులను అన్వేషించడమే కాకుండా... బాహ్య అంతరిక్షంలో సముద్రపు లోతులలో కూడా పరిశోధిస్తుందని తెలిపారు.

భారత అంతరిక్ష రంగం వేగవంతమైన అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని సింగ్ ప్రకటించారు. దేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ, ప్రస్తుతం 8 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉందని, 2040 నాటికి ఇది 40 బిలియన్ల డాలర్లకు చేరుతుందని అంచనా వేశారు. భారతదేశంలో అంతరిక్ష స్టార్టప్‌ల సంఖ్య విపరీతంగా పెరగడానికి ప్రధాన మంత్రి మోదీ సంస్కరణలను మంత్రి ప్రశంసించారు. 2014లో కేవలం ఒక స్టార్టప్ ఉండేదని.., దేశం ఇప్పుడు 190 స్పేస్ స్టార్టప్‌లను కలిగి ఉందని చెప్పారు. కొన్ని ఇప్పటికే లాభదాయక సంస్థలుగా అభివృద్ధి చెందాయన్నారు. అంతరిక్ష రంగంలో వ్యవస్థాపక కార్యకలాపాలలో ఈ పెరుగుదల ఆవిష్కరణ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని వివరించారు.