గామి మూవీ మార్చి 8న విడుదల

గామి మూవీ మార్చి 8న విడుదల

విశ్వక్‌‌‌‌ సేన్ హీరోగా  విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ శబరీష్ నిర్మించిన చిత్రం ‘గామి’. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ చెప్పిన విశేషాలు. 

‘‘ఈ నగరానికి ఏమైంది’ రిలీజ్‌‌‌‌కు ముందు మొదలైన చిత్రమిది. విద్యాధర్ చెప్పిన స్టోరీ చాలా క్రేజీగా అనిపించింది. ఐదేళ్లు పడుతుందని అప్పుడే అనుకున్నా.  ఒకవేళ ఏడాదిలో  పూర్తి చేయాలంటే  వంద కోట్లకు పైగా బడ్జెట్‌‌‌‌ అవుతుంది. అప్పట్లో నేను చాలా మందికి తెలియకపోవడం, అలాగే వారణాసి, కుంభమేళాలో గొరిల్లా షూట్ ఎక్కువగా చేయడంతో బడ్జెట్‌‌‌‌ కంట్రోల్ అయ్యింది. సీజీ వర్క్‌‌‌‌కు ఎక్కువ టైమ్ పట్టింది. 

ఈ సినిమాతో నేను ఐదేళ్లు జర్నీ చేస్తే.. డైరెక్టర్ కార్తీక్ తొమ్మిదేళ్లుగా ఈ స్ర్కిప్ట్‌‌‌‌పైనే ఉన్నాడు. మొత్తం క్రెడిట్ తనకే దక్కుతుంది.  సమయమే ఈ సినిమాకు పెద్ద పెట్టుబడి. ఎప్పుడు చూసినా ఇది కొత్తగానే అనిపిస్తుంది. ఇందులో మాస్ డైలాగులు, విజిల్ కొట్టే ఫైట్స్, ఐటెం సాంగ్స్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు.  అలాంటి మైండ్ సెట్‌‌‌‌తో ఈ సినిమాను చూడకూడదు. ఇందులో అఘోరాగా కనిపిస్తా. వారణాసిలో లక్షల మంది అఘోరాలతో కలిసిపోయి షూటింగ్‌‌‌‌లో పాల్గొన్నా.  మానవస్పర్శ అందుకోలేని అరుదైన వ్యాధితో బాధపడే పాత్ర పోషించా. హిమాలయాల్లో మైనస్ డిగ్రీల్లో షూట్ చేయడం చాలెంజింగ్‌‌‌‌గా అనిపించింది. 

నా పాత్రకు డైలాగ్స్ చాలా తక్కువ. చాందిని చౌదరి చాలా కష్టపడింది. ఆమె పాత్ర అందర్నీ ఆకట్టుకుంటుంది. అభినయ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్‌‌‌‌. ప్రతి ఒక్కరి పాత్రలోనూ డెప్త్ ఉంటుంది.  కథతో పాటు విజువల్స్, సౌండ్, వీఎఫ్‌‌‌‌ఎక్స్‌‌‌‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. క్రౌడ్ ఫండింగ్‌‌‌‌తో ఈ చిత్రాన్ని నిర్మించాం. నేను రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు.   ఇక నా ఫిల్మోగ్రఫీలో డిఫరెంట్ జానర్స్ ఉండాలనుకుంటా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘లైలా’ మేలో షూటింగ్ మొదలవుతుంది. అలాగే సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఓ సినిమా 
ఉండబోతోంది’.