
- రైతులకు పరిహారం ఖరారు
- బండ్ నిర్మాణం కోసం సాయల్ టెస్టింగ్
- నిర్వాసితులకు రూ.27 కోట్లు ప్రపోజ్
- రైతుల నుంచి డాక్యుమెంట్లు, బ్యాంకు డిటైల్స్ సేకరణ
యాదాద్రి, వెలుగు : గంధమల్ల రిజర్వాయర్‌కు సంబంధించి సర్వే పనులు స్పీడ్‌గా సాగుతున్నాయి. ఒకవైపు సర్వే కొనసాగుతుండగానే మరోవైపు బండ్ నిర్మించే ప్రాంతంలో 'సాయిల్' టెస్ట్ చేస్తున్నారు. బండ్ నిర్మించే ప్రాంతంలో భూములు కోల్పోతున్న రైతులకు ఈ వారంలోనే పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆలేరు నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు చేపట్టే గంధమల్ల రిజర్వాయర్‌పై ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. 1.4 టీఎంసీల సామర్థ్యంతో రూ.575 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ రిజర్వాయర్‌కోసం 2,500 మంది రైతులకు సంబంధించిన 994.37 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఇందులో మూడు కిలోమీటర్ల బండ్ నిర్మాణంలో 112 ఎకరాలు మునిగిపోతున్నాయి.
మిగిలిన భూమి రిజర్వాయర్ కారణంగా ముంపునకు గురవుతుంది. ఈ భూమిని సేకరించడానికి 2,500 మంది రైతులతో ఆఫీసర్లు పలుమార్లు చర్చలు జరిపి 2013 భూ సేకరణ చట్టంలో పేర్కొన్నదాని కంటే ఎక్కువగా పరిహారం అందించేందుకు ఒప్పుకున్నారు. ఈ చట్టం ప్రకారం గరిష్టంగా ఎకరానికి రూ.11.75 లక్షలు చెల్లించాల్సి ఉంది. కానీ ఎకరానికి రూ.24.50 లక్షలు ఇస్తామని రైతులకు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. దీంతో రైతులు కూడా ముందుకొచ్చారు. ఈ పరిహారంతోపాటు భూముల్లోని స్ట్రక్చర్స్‌కు అదనంగా పరిహారం అందించనున్నారు.
స్పీడ్‌గా సర్వే..
రిజర్వాయర్నిర్మాణం వల్ల మునిగే భూమిని ఆఫీసర్లు సర్వే చేస్తున్నారు. ఇప్పటికే బండ్నిర్మాణంలో మునిగే 112 ఎకరాల సర్వే ముగిసింది. ఈ భూమిలో బోర్లు, బావులు, చెట్లు కలిపి మొత్తంగా 246 స్ట్రక్చర్స్ఉన్నాయని గుర్తించారు. ఇప్పుడు 600 ఎకరాలను ఆఫీసర్లు సర్వే చేస్తున్నారు. సర్వేలో భాగంగా ఆ భూములకు సంబంధించిన రైతుల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. భూముల్లోని చెట్లు, బోర్లు తదితర స్ట్రక్చర్స్‌ను గుర్తిస్తున్నారు. మిగిలిన భూమిని వచ్చే నెలలో సర్వే చేయనున్నారు.
బండ్ నిర్వాసితులకు రూ.27.44 కోట్లు..
బండ్ నిర్మాణంలో 300 మందికి పైగా రైతులకు సంబంధించిన 112 ఎకరాలు మునిగిపోతోంది. ఈ భూమికి పరిహారం కోసం ఆఫీసర్లు ఇప్పటికే ప్రపోజల్స్ పంపించారు. ఎకరానికి రూ.24.50 లక్షల చొప్పున మొత్తంగా రూ.27.44 కోట్లు అందించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని ఈ వారంలోనే నిర్వాసితులకు అందిస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. సేకరించే భూముల కోసం మొత్తంగా రూ.244 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంటుంది.
బండ్కోసం సాయిల్ టెస్టింగ్..
రిజర్వాయర్‌కోసం చుట్టూరా 3 కిలోమీటర్ల బండ్ నిర్మించాల్సి ఉంది. దీని కోసం ఆఫీసర్లు సాయిల్ టెస్టింగ్ చేస్తున్నారు. ఈ టెస్టింగ్ఆధారంగా బండ్ నిర్మాణం విషయంలో ఇంజినీర్లు నిర్ణయాలు తీసుకుంటారు.
రైతుల నుంచి డాక్యుమెంట్లు సేకరణ..
రిజర్వాయర్ కోసం భూములు కోల్పోతున్న రైతులకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించడం కోసం తుర్కపల్లి తహసీల్దార్ ఆఫీసులో అధికారులు క్యాంపు ఏర్పాటు చేశారు. రైతులకు చెందిన భూముల విస్తీర్ణం, వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, టైటిల్ వెరిఫికేషన్ తీసుకుంటున్నారు.
రూ.27 కోట్ల కోసం ప్రపోజల్స్
గంధమల్ల రిజర్వాయర్‌కు సంబంధించిన సర్వే స్పీడ్‌గా జరుగుతోంది. బండ్ నిర్మాణం కోసం సేకరించే 112 ఎకరాల భూమికి సంబంధించిన పరిహారం రూ.27.44 కోట్ల కోసం ప్రతిపాదనలు పంపించాం. ఈ వారంలోనే రైతులకు అందిస్తాం.
గొట్టే జయశ్రీ, ఎస్జీడీసీ, యాదాద్రి