గాంధీజీ జీవితం ఎందరికో ఆదర్శం

గాంధీజీ జీవితం ఎందరికో ఆదర్శం

మోహన్‌దాస్‌ కరమ్‌ చంద్‌ గాంధీ... ఉన్నతమైన ఆలోచనలు, ఉత్తుంగతరంగ సంభాషణలు, అత్యున్నత జీవన విధానం, ఆరోగ్యకర ఆహారనియమాలు... ఒకటి కాదు రెండు కాదు... కొన్ని వందల సదాలోచనల ఆచరణ కారణంగా మహాత్ముడయ్యాడు. జాతి పిత అయ్యాడు. అందరిచేత ‘గాంధీజీ’ అని పిలిపించుకున్నాడు.

మానవజీవితంలో పొరపాట్లు చేయటం సర్వసాధారణం. చేసిన పొరపాట్లను దిద్దుకోవాలనుకోవటం ఉత్తముల లక్షణం. చేసిన తప్పులను నిర్భయంగా ఒప్పుకోవటం మహనీయుల లక్షణం. తన జీవితంలో చేసిన తప్పులు, తన మనసును కుదుట పరచిన పుస్తకాలు, తనకు సన్మార్గం చూపిన మహనీయులు... పలు అంశాలను ఏర్చికూర్చి సత్యశోధన చేసి పుస్తకాన్ని రచించిన బాపూజీ తన జీవన విధానం ద్వారా ఆదర్శంగా నిలిచారు. తన సత్యశోధనలో భగవద్గీత గురించి పలు అంశాలను ప్రస్తావించారు. 

భగవద్గీత కంఠస్థం చేయడం వల్ల తన నడవడికను చక్కదిద్దుకోవడా నికి ఒక కరదీపిక దొరికినట్లయిందన్నారు. ‘‘భగవద్గీత చదవడమంటే నాకు రోజూ చూసే నిఘంటువుగా మారింది. ఏవైనా ఆంగ్ల పదాలకు అర్థం తెలియకపోతే నిఘంటువు చూసి తెలుసుకుంటాం. నడవడికను సరిచేసుకోవాలంటే భగవద్గీతను చదువుతుండాలి. భగవద్గీత అనే నిఘంటువు నాకున్న ఈతి బాధల నుంచి ఉపశమనం పొందడానికి ఉపయోగపడింది. నాకు ఈ గ్రంథం మీద అత్యంత గౌరవం పెరిగింది’’ అని స్వయంగా రాసుకున్నారు గాంధీజీ. 

తనకు భగవద్గీత మీద నమ్మకం, అభిమానం చాలాకాలం నుండే ఉండేవని, కాని పలువురు మహనీయులతో కలిసి చదువుతూ, వారితో చర్చించిన తరవాత ఆ నమ్మకం మరింత బలపడిందని చెప్తారు గాంధీజీ.

‘‘ఇప్పుడు ఇంకొంచెం లోతుగా చదవాలనుకున్నా. స్నానం చేసే సమయాన్ని శ్లోకాలు చదవటం కోసం కేటాయించుకున్నా. శ్లోకాల్ని కాగితం మీద రాసుకుని, గోడ మీద అంటించుకుని వాటిని చదువుతూ కంఠస్థం చేస్తూ, సాన్నం పూర్తిచేసేవాడిని. అలా సుమారు పదమూడు అధ్యాయాలు చదువుకున్నట్లు గుర్తు. నేను చాలాకాలంగా కలలుగన్న ‘సత్యాగ్రహం’ అనే ఆయుధాన్ని ఆచరణలో పెట్టడానికి భగవద్గీత బాగా ఉపయోగపడింది’’ అని చెప్పుకున్నారు గాంధీజీ. భగవద్గీత గురించి చాలా విషయాలు చర్చించడమే కాకుండా, ఆ స్ఫూర్తి తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో చాలా సరళంగా వివరించారు. ‘‘ప్రతి హిందూ బాలుడు, బాలిక సంస్కృతం నేర్చుకోవడం అవసరమని గ్రహించాను’’ అని సంస్కృత భాష ఆవశ్యకతను తెలుసుకుని, అందరికీ తెలియచెప్పారు.
‘‘నీతికి సంబంధించిన ఒక ఛప్పయ్‌ ఛందం నా హృదయంలో చోటు చేసుకున్నది. ఆ పద్యంలో చెప్పబడిన – అపకారానికి ప్రతీకారం అపకారం కాదు, ఉపకారం సుమా! అను సూత్రం నా జీవితానికి మూలమైంది. ఆ సూత్రం నా మనసుపై రాజ్యం చేసింది. అపకారి మేలుకోరడం, మేలు చేయడం అంటే అనురాగం పెరిగింది’’ అని స్వయంగా పేర్కొన్నారు గాంధీజీ. ఈ మాటలు వింటుంటే తెలుగులో ‘ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ’’ అనే సుమతీ శతక పద్యం గుర్తుకు వస్తుంది. ఒక చెంప మీద దెబ్బ కొడితే, రెండో చెంప చూపించమన్నాడే కానీ, తిరిగి చెయ్యి చేసుకోమనలేదు గాంధీజీ. తను చదివిన దానిని ఆచరించడానికి కృషి చేసిన మహనీయుడు గాంధీజీ.
‘తన దోషాల్ని సరిచేసుకుంటే అతడు ఉత్తముడవుతాడు’ అనే శిలాక్షరాల వంటి మాటను కూడా గాంధీజీ ‘సత్యశోధన’ లో వివరించాడు. రామకృష్ణ పరమహంస వంటి మహనీయుడు తన దోషాలను సరిచేసుకున్న తరవాతే ఇతరులకు బోధించేవాడు.

మరోచోట ‘ఇతరుల్ని సంస్కరించటం కోసం మరీ లోతుకు పోకూడదని గ్రహించా. తెలివితేటల్ని ఉపయోగించి సరళ ప్రయోగాలు చేస్తూ కృషి చేస్తే ఏ విషయమైనా తప్పక బోధపడుతుంది’ అని చెప్తారు గాంధీజీ. మహాత్ముడి ‘సత్యశోధన’ లేక ‘ఆత్మకథ’ పుస్తకం ఎంతోమందికి వ్యక్తిత్వ వికాసానికి కరదీపికలా ఉపయోగపడుతుంది. గాంధీజీ మాటల్లో చెప్పాలంటే అదొక నిఘంటువు. చివరగా ‘శ్రవణుడంటే నాకు గురి. పితృసేవ అంటే నాకు ఆసక్తి’ అనే గాంధీజీ మాటలు సర్వదా ఆచరణీయం. తను చిన్ననాటి నుంచి శ్రవణకుమారుడి కథ విని, ఆ కథను మననం చేసుకుంటూ పెరిగినట్లు గాంధీజీ పలు సందర్భాలలో ప్రస్తావించారు. గాంధీజీ జీవితం ఎందరికో ఆదర్శం.

-  డా. వైజయంతి పురాణపండ 
ఫోన్: 80085 51232