మా ఇండ్లను కూల్చితే ఆత్మహత్య చేస్కుంటం : వివేకానంద నగర్ బస్తీ వాసులు

మా ఇండ్లను కూల్చితే ఆత్మహత్య చేస్కుంటం : వివేకానంద నగర్ బస్తీ వాసులు
  • బల్దియా అధికారులను హెచ్చరించిన స్వామి వివేకానంద నగర్ వాసులు
  •     కోర్టులో కేసు నడుస్తుంటే నోటీసులివ్వడమేంటని ఆగ్రహం

ముషీరాబాద్, వెలుగు :  మా ఇండ్లను కూల్చి వేస్తే సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని హైదరాబాద్​లోని గాంధీనగర్ డివిజన్ స్వామి వివేకానంద నగర్ బస్తీ వాసులు హెచ్చరించారు. 70 ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నామని.. ఇండ్లను కూల్చివేస్తే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. వివేకానందనగర్​లో ఏండ్ల కిందట బస్తీ వాసులు ఇండ్లు నిర్మించుకున్నారు.

అయితే, అది ప్రభుత్వ భూమి అని.. ఖాళీ చేయకపోతే మొత్తం 25  ఇండ్లను కూల్చివేస్తామంటూ జీహెచ్ఎంసీ అధికారులు కొంతకాలంగా నోటీసులు పంపిస్తున్నారు. తాము 70 ఏండ్లగా ఇక్కడ ఉంటున్నామని.. అన్ని ట్యాక్స్ లు కడుతున్నామని బస్తీ వాసులు హైకోర్టులో అధికారులకు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. అయితే గురువారం జీహెచ్ఎంసీ అధికారులు మరోసారి వివేకాందనగర్​లో బస్తీకి వచ్చి ఇండ్లను ఖాళీ చేయాలని చెప్పారు.

దీంతో అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ.. ఇండ్లను  కూల్చివేస్తామని బల్దియా అధికారులు నోటీసులివ్వడమేంటని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.