హైదరాబాద్లో..2 లక్షల 32 వేల విగ్రహాల నిమజ్జనం..ట్యాంక్ బండ్ లో 50వేలపైనే

హైదరాబాద్లో..2 లక్షల 32 వేల విగ్రహాల నిమజ్జనం..ట్యాంక్ బండ్ లో 50వేలపైనే
  • గణపయ్యా..ఈసారికి సెలవయ్యా!
  • ఈసారికి సెలవయ్యా!
  • కిక్కిరిసిన హుస్సేన్ సాగర్ తీరం  
  • శనివారం రాత్రి 8 గంటల వరకు 2.50 లక్షల విగ్రహాల నిమజ్జనం 
  • సాగర్​లో 50 వేలకు పైనే..
  • మధ్యాహ్నం బడా గణేశ్​, 7 గంటల్లోపు బాలాపూర్​ గణనాథుడి నిమజ్జనం
  • సాయంత్రం నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వినాయకులు

హైదరాబాద్ సిటీ, వెలుగు : గ్రేటర్​హైదరాబాద్​లో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. హుస్సేన్ సాగర్ తో పాటు  20 పెద్ద చెరువులతో పాటు, జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసిన 74 ఆర్టిఫిషియల్​చెరువుల్లో నిమజ్జనం జరిగింది. 

నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ వద్ద 40  క్రేన్లను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పై 12, ఎన్టీఆర్ మార్గ్ లో 12, పీవీ మార్గ్ లోని  పీపుల్స్ ప్లాజాలో ఎనిమిది, ఇదే మార్గంలో రెండు బేబీ పాండ్స్ వద్ద నాలుగు క్రేన్లు, మరో రెండు మిగతా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్రేన్ల నిమజ్జనం జరిగింది. ఖైరతాబాద్ బడా గణేశ్​నిమజ్జనం పూర్తయ్యాకనే మిగతా విగ్రహాల శోభాయాత్ర ఊపందుకుంది.  

21 కిలోమీటర్ల సుదీర్ఘ యాత్ర చేసి వచ్చిన బాలాపూర్ గణేశుడు రాత్రి 7 గంటల వేళ అప్పర్​ట్యాంక్​బండ్​లోని క్రేన్​నంబర్​ 12 వద్ద నిమజ్జనమయ్యాడు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మధ్యాహ్నంలోపు ఖైరతాబాద్​గణేశుడు, రాత్రి 7 గంటల్లోపే బాలాపూర్​గణేశుడు నిమజ్జనం కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 

సాయంత్రం నుంచి తరలివచ్చిన గణనాథులు

హుస్సేన్​సాగర్ కు సాయంత్రం 6 గంటల తర్వాత భారీగా విగ్రహాలు తరలివచ్చాయి. నిమజ్జనం సందర్భంగా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు జనసందోహంతో నిండిపోయాయి. ట్యాంక్​బండ్​, ఎన్టీఆర్​మార్గ్, పీవీఆర్ మార్గ్ ప్రాంతాలు రద్దీగా మారాయి. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ లో 18 నుంచి 22 ఫీట్ల విగ్రహాల నిమజ్జనాలకు అనుమతించారు. అంతకు తక్కువ ఎత్తున్న విగ్రహాలను పీపుల్స్ ప్లాజా, పీవీ మార్గ్​బేబీ పాండ్స్ లో నిమజ్జనం చేశారు. 

జనం భారీగా ఉండడంతో ఎన్​టీఆర్​ మార్గ్​ వద్ద రాత్రి 10 గంటల తరువాత నిమజ్జనానికి అనుమతించారు. హుస్సేన్ సాగర్ తో పాటు జీడిమెట్ల ఫాక్స్ సాగర్, బహుదూర్ పురా మీరాలం చెరువు, సరూర్ నగర్ పెద్ద చెరువు, కాప్రా ఊర చెరువుల వద్ద కూడా సందడి నెలకొంది. బేబీ పాండ్స్ వద్ద కూడా భక్తులు ఎక్కువగా నిమజ్జనాలు చేస్తూ కనిపించారు.  

2 లక్షల 32 వేల విగ్రహాల నిమజ్జనం  

గ్రేటర్ లో 2 లక్షల 32 వేల విగ్రహాల నిమజ్జనం జరగ్గా అత్యధికంగా హుస్సేన్ సాగర్ లో 50 వేలకుపైగా విగ్రహాలను వేశారు. ఆదివారం మధ్యాహ్నం వరకు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 

అన్ని రోజులు కలిపి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు బల్దియా పరిధిలోని ఆరు జోన్లలో 2,07, 257 విగ్రహాలను నిమజ్జనం చేయగా, శనివారం సాయంత్రం ఆరు గంటల వరకు 2 లక్షల 32 వేల 520 గణేశ్​ప్రతిమల నిమజ్జనం జరిగింది. ఇందులో మూడు ఫీట్ల లోపు విగ్రహాలు 84,993 ఉండగా, మూడు ఫీట్లకి మించిన విగ్రహాలు 84,993 ఉన్నాయి.