ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఘనంగా గణేశ్ నిమజ్జనం..అర్థరాత్రి వరకు కొనసాగిన సంబురాలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఘనంగా గణేశ్ నిమజ్జనం..అర్థరాత్రి వరకు కొనసాగిన సంబురాలు
  • బై బై .. గణేశా
  • అర్థరాత్రి వరకు కొనసాగిన సంబురాలు 
  • డప్పు చప్పుళ్లతో, యువకుల కేరింతలతో వేడుకలు
  • ఖమ్మంలో శోభాయాత్రను ప్రారంభించిన మంత్రి తుమ్మల

ఖమ్మం/భద్రాచలం/నెట్​వర్క్, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శనివారం గణేశ్​నిమజ్జనాలు ఘనంగా జరిగాయి. 11 రోజుల పాటు పూజలందుకున్న వినాయకులకు భక్తులు సంబురంగా వీడ్కోలు పలికారు. డప్పు చప్పుళ్లు, మేళతాళాలు, పటాకుల పేలుళ్లతో డ్యాన్సులు వేసుకుంటూ గణపయ్యకు బై బై చెప్పారు. ఖమ్మం నగరంలోని గాంధీ చౌక్​ లో స్తంభాద్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్రను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు.

 ఈ కార్యక్రమంలో కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి, ఖమ్మం మేయర్​ పునుకొల్లు నీరజ, సీపీ సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్​ అభిషేక్​ అగస్త్య, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్​ చైర్మన్​ రాయల నాగేశ్వరరావు, సాదు రమేశ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 600 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు, బారీకేడ్లు ఏర్పాటు చేశారు. విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్లను ఏర్పాటు చేశారు. అర్థరాత్రి వరకు నిమజ్జనాలు కొనసాగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేశారు. ప్రకాశ్​నగర్, బొక్కలగడ్డ, నయాబజార్, నాయుడుపేట దగ్గర మున్నేరులో నిమజ్జనం పాయింట్ లను పోలీసులు ఏర్పాటు చేశారు. ఖమ్మం రూరల్ మండలంలోని విగ్రహాలను తీర్థాల దగ్గర మున్నేరులో నిమజ్జనం చేశారు.  భద్రాచలం వద్ద గోదావరి నదిలో గణనాథుల విగ్రహాల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న విగ్రహాలతో శనివారం రాత్రి గోదావరి తీరం పోటెత్తింది. 

1200కు పైగా విగ్రహాలను నిమజ్జనం చేశారు. సుజాతనగర్​ నుంచి 24 అడుగుల పెద్ద విగ్రహం భద్రాచలం చేరుకుంది. నది వద్ద ప్రమాదాలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీ క్రేన్లతో విగ్రహాలను లాంచీల పైకి ఎక్కించారు. విగ్రహాలు తీసుకెళ్లే లాంచీకి చుట్టూ ఎన్డీఆర్​ఎఫ్​, ఎస్డీఆర్​ఎఫ్​ టీంలు స్పీడ్​ బోట్లతో పహారా కాస్తున్నారు. భద్రాచలంలో ఎస్పీ రోహిత్​ రాజ్​, చర్ల మండలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్​ పొదెం వీరయ్య శోభాయాత్రలను ప్రారంభించారు. పలుచోట్ల గణేశుడి లడ్డూను ముస్లింలు  వేలంపాడి దక్కించుకున్నారు.