మర్డర్, కబ్జా కేసులు ఉన్నోళ్లు పోటీ చేస్తామని వస్తున్నరు

మర్డర్, కబ్జా కేసులు ఉన్నోళ్లు పోటీ చేస్తామని వస్తున్నరు

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ కేసీఆర్ పాలనే రావాలని  మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.  ఒకసారి తప్పు చేస్తే 50 ఏళ్లు వెనక్కి పోతామని, కాంగ్రెస్, బీజేపీని నమ్మి ఓట్లేస్తే తెలంగాణను మళ్లీ గుడ్డిదీపం చేసే ప్రమాదముందన్నారు. మంగళవారం కరీంనగర్ సిటీలోని 3వ డివిజన్ కిసాన్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి పర్యటించారు. ఎంఏ గ్రాంట్స్ రూ.133 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు.  

అనంతరం నాకా చౌరస్తాలో బీటీ రోడ్డు రిపేర్​పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. ఎన్నికల వేళ వివిధ పార్టీల నుంచి కబ్జా, మర్డర్ కేసులు ఉన్నోళ్లు వస్తున్నారని, వారికి ఓటేస్తే చెరువులు, ప్రభుత్వ భూములతోపాటు ప్రజల భూములను కబ్జా చేస్తారని ఆరోపించారు. చివరికి మెడలో పుస్తెల తాళ్లు కూడా తెంపుకెళ్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.