విశాఖ నుంచి కామారెడ్డికి గంజాయ్​​

విశాఖ నుంచి కామారెడ్డికి గంజాయ్​​
  •     లిక్విడ్​ రూపంలో సప్లయ్​
  •     యువతే టార్గెట్​గా అమ్మకాలు
  •     స్థానికంగా ఏజెంట్లను నియమించుకొని సెల్లింగ్​
  •     మత్తుకు బానిసవుతున్న జిల్లా యూత్​ 

కామారెడ్డి, వెలుగు:  జిల్లాలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. యువతే లక్ష్యంగా చేసుకొని మత్తులోకి దించుతున్నారు. ఏపీలోని విశాఖ కేంద్రంగా కామారెడ్డికి గంజాయి​సప్లయ్ ​అవుతున్నట్లు తెలుస్తోంది. పొడి రూపంలో కాకుండా లిక్విడ్ గా ఉన్న గాంజాను సప్లయ్​ చేస్తున్నారు. గతంలో జిల్లాలో జోరుగా గంజాయి సాగు చేసేవారు. పండించిన గంజాయిని వివిధ ఏరియాలకు సప్లయ్​ చేసేవారు.

కొన్నాళ్లుగా గంజాయి పండించే, సప్లయ్​ చేసే వారిపై జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరించడంతో గంజాయి సాగు ఆగింది. కొంతకాలంగా మళ్లీ ఇక్కడికి ఏపీలోని విశాఖ ఏరియా నుంచి సప్లయ్​అవుతోంది. జిల్లాకు సమీపంలో ఉన్న మహరాష్ట్రకు కూడా సప్లయ్​ చేస్తున్నారు. జిల్లాకేంద్రం రాష్ట్ర రాజధాని హైదరాబాద్​కు సమీపంలో ఉండడం, రైల్వే లైన్లు, హైవేల కారణంగా రవాణా సులభమవుతోంది.

ఈ పరిస్థితుల్లో విశాఖ జిల్లాతో పాటు, హైదరాబాద్​కు చెందిన పలువురు గంజాయి  వ్యాపారులు కామారెడ్డిపై ఫోకస్ పెట్టారు. స్థానికంగా ఏజెంట్లను అపాయింట్​ చేసుకొని వారి ద్వారా జోరుగా గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారు.

శివారు ఏరియాలు అడ్డగా..

జిల్లా కేంద్రంతో పాటు, శివారు ఏరియాలను అడ్డాలుగా చేసుకొని గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. ఒకరి ద్వారా మరొకరికి నమ్మకంగా గంజాయి మార్కెట్​ను పెంచుకుంటున్నారు. చిన్నచిన్న ప్యాకెట్ల రూపంలో అమ్మకాలు ​చేస్తున్నారు. టౌన్​లో టీ స్టాల్స్,​ హోటళ్లలో యువకులు అధికంగా ఉండే ఏరియాల్లో విక్రయాలు జరుపుతున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని భిక్కనూరు, దోమకొండ, మాచారెడ్డి, సదాశివ్​నగర్, రామారెడ్డి తదితర ఏరియాల్లో పలువురు ఫామ్​హౌజ్​లు కట్టుకున్నారు. ఈ ప్రాంతాల్లో నిఘా లేకపోవడం, జనసంచారం తక్కువగా ఉండడంతో ఫామ్​హౌజ్​లే కేంద్రాలుగా కొందరు గంజాయి తాగుతున్నారు.

లిక్విడ్ ​రూపంలో..

కామారెడ్డికి గంజాయి పొడితో పాటు లిక్విడ్​రూపంలో సప్లయ్​ అవుతోంది. ఎవరికీ అనుమానం రాకుండా లిక్విడ్​గా మార్చి చిన్న సీసాల్లో నింపి అమ్ముతున్నారు. కామారెడ్డి మండలం క్యాసంపల్లి శివారులో ఇటీవల ఏడుగురు యువకులు గంజాయి తాగుతూ దేవునిపల్లి పోలీసులకు పట్టుబడ్డారు. వీరంతా 26 నుంచి 30 ఏండ్ల మధ్య ఉన్న వారే. వీరిలో టౌన్​కు చెందిన ప్రముఖులు, వ్యాపారుల పిల్లలు ఉన్నారు. వీరి నుంచి 190 గ్రాముల లిక్విడ్​గంజాయి దొరికింది. దీని విలువ రూ.97,500  ఉంటుందని పోలీసులు వెల్లడించారు. పోలీస్, ఎక్సైజ్ ​యంత్రాంగం ప్రత్యేక నిఘా పెట్టి మత్తు పదార్థాల రవాణాను అరికట్టాల్సిన అవసరముంది.