
హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా అనుముల మండలం అల్వాల్ క్రాస్ రోడ్స్ వద్ద గంజాయి అమ్ముతున్న ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశా రు. శుక్రవారం హాలియా పీఎస్ లో మీడియా సమావేశంలో డీఎస్పీ రాజశేఖరరాజు వివరాలు తెలిపారు. ఏపీలోని పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకి చెందిన వజ్రాల రాజశేఖర్, అనుముల మండలం పంగవానికుంట తండాకు చెందిన కుందాల వేణు, తిరుమలగిరి (సాగర్) మండలం అల్వాల్ కు చెందిన గురజాల మహేందర్ ముఠాగా ఏర్పడ్డారు. ఆంధ్రాలోని పల్నాడు జిల్లాకు చెందిన గడిగంటి అచ్చయ్య, తిరుమలకొండ యేసుబాబు వద్ద నుంచి గంజాయి కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. శుక్రవారం అనుముల మండలం అల్వాల్ క్రాస్ రోడ్స్ లోని పెట్రోల్ బంక్ వద్ద గంజాయి సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురి వద్ద 1.650 గ్రాముల గంజాయి, పల్సర్ బైక్, రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.