‘చెత్త’ తీస్తలేరు..ముఖ్యమంత్రి చెప్పినా తీరు మారట్లే..మూడు కార్పొరేషన్ల లోనూ ఇదే పరిస్థితి

‘చెత్త’ తీస్తలేరు..ముఖ్యమంత్రి చెప్పినా తీరు మారట్లే..మూడు కార్పొరేషన్ల లోనూ ఇదే పరిస్థితి
  •  జీవీపీల వద్ద గుట్టలు గుట్టలుగా చెత్త 
  • చాలాచోట్ల తగలబెడుతున్నరు 
  • పొగతో జనాల ఉక్కిరిబిక్కిరి 
  • రాంకీ సంస్థ సరిగ్గా  పని చేయట్లేదని ఆరోపణలు 

హైదరాబాద్ సిటీ, వెలగు:  మూడు కార్పొరేషన్లలో చెత్త నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. రోడ్ల పక్కన చెత్త కనిపించకూడదని సాక్షాత్తు సీఎం వార్నింగ్​ఇచ్చినా లెక్క చేయడం లేదు. ఎక్కడికక్కడ చెత్త అక్కడే పేరుకుపోవడంతో కొందరు దాన్ని తగలబెడుతున్నారు. గార్బేజ్ వర్నలబుల్ పాయింట్లతో పాటు మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఎక్కువగా ఇది కనిపిస్తోంది. లంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్ పరిధిలో రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో పేరుకుపోతున్న చెత్తను కొందరు వ్యాపారులు రాత్రి వేళల్లో తగలబెడుతున్నారు. దీంతో చుట్టుపక్కల ఏరియాలు పొగతో నిండిపోతున్నాయి. 

దీంతో కండ్లు మండుతున్నాయని, ఆ వాసన పీల్చుకోలేక నిద్ర పట్టడం లేదంటున్నారు. రాంకీ సంస్థ సరిగ్గా పనిచేయకపోవడం, మూడు కార్పొరేషన్ల అధికారుల పర్యవేక్షణ లేకనే ఈ పరిస్థితి ఏర్పడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక విలీనమైన శివారు మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణ మరింత సమస్యాత్మకంగా మారింది. ఆయా ప్రాంతాల్లో చెత్త సేకరణ, తరలింపునకు సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడే చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోజుల తరబడి చెత్తను తొలగించడం లేదు. చెత్తను సేకరించి తరలించాల్సిన బాధ్యతను విస్మరించడంతోనే కొందరు ఇలా బహిరంగంగా కాల్చివేస్తున్నారనే ఆరోపణలున్నాయి. 

రెండు, మూడు సార్లు తరలించట్లే....

రోడ్లపై పేరుకుపోయిన చెత్తని రాంకీ సంస్థ తరలించాల్సి ఉంది. అయితే, గతంలో రోజూ ఉదయం, మధ్యాహ్నంతో పాటు సాయంత్రం వేళల్లో కూడా చెత్తని తరలిస్తున్నట్లు అధికారులు గొప్పలు చెప్పారు. కానీ, ఇప్పుడు కొన్నిచోట్ల పరిస్థితి చూస్తే కనీసం ఒక్కసారి కూడా తరలిస్తున్నట్టు కనిపించడం లేదు. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్తే చాలు కంపు కొడుతోంది. వాసన భరించలేక ముక్కు మూసుకుని పోవాల్సి వస్తున్నది. చెత్త తీయడం లేదని ప్రజల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు స్పెషల్ డ్రైవ్ అంటూ వేల టన్నుల చెత్తని తరలించామని చెప్తుండగా, అవి రోజుల తరబడి తీయని చెత్తకుప్పలే అని స్థానికులంటున్నారు.  ఇప్పటికైనా చెత్తను రోజూ తొలగించాలని, చెత్తను కాల్చే వారిని దొరకబట్టి చర్యలు తీసుకోవడంతో పాటు, చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై కూడా పర్యవేక్షణ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.