- గాంధీ ఆసుపత్రికి బాధితుల తరలింపు
- సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులో ఘటన
చేర్యాల, వెలుగు: గ్యాస్ సిలిండర్ పేలి సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో ఆరుగురికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం తెల్లవారుజామున గ్రామానికి చెందిన శెట్టె భాస్కర్ టీ పెట్టేందుకు స్టవ్ అంటించగా, సిలిండర్ లీకై ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న భాస్కర్ తో పాటు తండ్రి అయ్యాలం, భార్య కావ్య, కూతుళ్లు ప్రణవి, కృతిక, హర్షిణికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇల్లు దగ్ధమైంది. బాధితులను 108లో చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి సిద్దిపేట ఏరియా ఆసుపత్రి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇంటితో పాటు విలువైన వస్తువులు, సామగ్రి, డబ్బులు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.10 లక్షల నష్టం వాటిల్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని చేర్యాల సీఐ ఎల్ శ్రీను, ఎస్సై వి. నవీన్ పరిశీలించారు.
