ఫ్లయిట్ నడుపుతాడు. యూట్యూబ్‌లో చక్కగా వ్లాగ్‌లు చేస్తుంటాడు. అంతేకాదు.. ఆయనొక సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. మల్టీ టాస్కింగ్ చేస్తూనే ఫిట్‌నెస్ ట్రైనర్‌గా కూడా సలహాలు ఇస్తుంటాడు గౌరవ్ తనేజా. ‘‘ఫ్లయింగ్ బీస్ట్” పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. అన్నింటిలో వచ్చినట్టే యూట్యూబ్‌లో కూడా సక్సెస్ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఛానెల్‌కు 7.87 మిలియన్ల సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు.
గౌరవ్ తనేజా జులై 9,1986న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. పైలట్‌గా తొమ్మిదేండ్లు పనిచేశాడు. కానీ.. ఒకసారి ప్రయాణికుల సేఫ్టీ గురించి కొన్ని విషయాలు గట్టిగా అడిగాడు. దాంతో ఆ విమానయాన సంస్థ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. గౌరవ్ గురించిన వివరాల్లోకి వెళ్తే... కాన్పూర్‌లోని డాక్టర్ వీరేంద్ర స్వరూప్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేశాడు. తర్వాత ఇంటర్మీడియెట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) పూర్తి చేశాడు. ఇంటర్ చదువుతున్నప్పుడే పైలట్ కావాలని కల కన్నాడు. కానీ.. అప్పుడు వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడం వల్ల తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. తర్వాత 2004లో జేఈఈ రాసి మొదటి ప్రయత్నంలోనే184వ ర్యాంక్ సాధించి, ఖరగ్‌పూర్ ఐఐటీలో చేరాడు. ఇంజనీరింగ్ చదువు తర్వాత బాడీ బిల్డింగ్ మీద దృష్టి పెట్టాడు. దాంతోపాటు గ్రాడ్యుయేషన్ తర్వాత పైలట్ కావాలనే తన చిన్ననాటి కలను సాకారం చేసుకోవాలి అనుకున్నాడు. కానీ.. అందుకు గౌరవ్ వాళ్ల నాన్న ఒప్పుకోలేదు. అయినా.. పట్టు వదలకుండా తండ్రిని కన్విన్స్ చేసి ఒప్పించాడు. 2011లో స్పెయిన్‌లోని ఫ్లయిట్ స్కూల్ సీఏఈలో పైలట్ ట్రైనింగ్ పూర్తి చేశాడు. 2014లో ఇండిగోలో కెప్టెన్‌గా చేరాడు. మే 2019లో ఎయిర్ ఏషియాలో చేరాడు. గౌరవ్ తనేజా ఆల్ఫా ఏవియేషన్ గ్రూప్‌లో ఫ్లయిట్ ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా కొన్నాళ్లు పనిచేశాడు.
బాడీబిల్డింగ్ కెరీర్
ఒక ఫ్రెండ్ పార్టిసిపేట్ చేసిన బాడీ బిల్డింగ్ కాంపిటీషన్‌ని చూడ్డానికి 2012లో ఢిల్లీకి వెళ్లాడు గౌరవ్. తన ఫ్రెండ్‌ని కలిసేందుకు వేలాది మంది రావడం చూసి... గౌరవ్ ఆశ్చర్యపోయాడు. ‘బాడీ బిల్డర్‌కు ఇంత క్రేజ్ ఉంటుందా?’ అనుకున్నాడు. దాంతో తను కూడా బాడీ బిల్డింగ్ పోటీల్లో పార్టిసిపేట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా ఏడాది తర్వాత సెప్టెంబర్ 2013లో మొట్టమొదటి బాడీ బిల్డింగ్ పోటీలో పాల్గొని గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. ఆ తర్వాత రెండేండ్లలో అనేక బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. ఎన్నో బంగారు పతకాలు గెలుచుకున్నాడు. ఒకపక్క పైలట్‌గా ఫుల్ టైమ్ పనిచేస్తూనే ఇదంతా చేశాడు. ఇవేకాకుండా పర్సనల్ ట్రైనర్, న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్‌గా కూడా పేరు ఉంది గౌరవ్‌కి.
సోషల్ మీడియా సెలబ్రిటీగా...
గౌరవ్ తనేజా జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు అతని ఫ్రెండ్ ఒకరు ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమ్ పెట్టాడు. ఆ వీడియో చాలామంది చూశారు. దాంతో గౌరవ్ కూడా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. వెంటనే ఫేస్‌బుక్ పేజీలో వీడియోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. 2016లో తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేయడానికి ‘ఫిట్ మజిల్ టీవీ’ అనే యూట్యూబ్ ఛానెల్ పెట్టాడు. కానీ.. అతను అనుకున్నంత సక్సెస్ రాలేదు. దాంతో వర్కవుట్ వీడియోలను పోస్ట్ చేయడం తగ్గించేశాడు. తర్వాత రెండో ఛానెల్ పెట్టి, అందులో వ్లాగ్స్ చేయాలి అనుకున్నాడు. అలా డిసెంబర్ 1, 2017న ‘ఫ్లయింగ్ బీస్ట్’ ఛానెల్ పెట్టాడు. ఆ తర్వాత జులై 8, 2020న ‘రాస్‌భారీ కే పాపా’ పేరుతో గేమింగ్ లైవ్ స్ట్రీమ్ ఛానెల్ కూడా పెట్టాడు. ప్రస్తుతం ఈ ఛానెల్‌కు1.25 మిలియన్ల సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఫిట్ మజిల్ టీవీ ఛానెల్‌కు 2.11 మిలియన్ల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు.
ఇండియా మ్యాప్
గౌరవ్ తనేజా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికా స్కై ఫ్లయిట్లో ఎగురుతూ ఇండియా మ్యాప్ గీశాడు. గౌరవ్ దాదాపు మూడు గంటల పాటు 350 కి.మీ. నింగిలో ప్రయాణించి ఈ మ్యాప్‌ని క్రియేట్ చేశాడు. ఈ కార్యక్రమానికి ‘ఆస్మాన్ మే భారత్’ అని పేరు పెట్టారు. ఫ్లయిట్ ట్రాకింగ్ సిస్టమ్ ఆయన నడిపిన రూట్‌ని మ్యాప్ చేసినప్పుడు చాలా పెద్ద ఇండియా మ్యాప్ కనిపించింది.
ఫ్యామిలీ
గౌరవ్ ఫ్యామిలీ న్యూఢిల్లీలో ఉంటోంది. గౌరవ్ తండ్రి యోగేంద్ర కుమార్ తనేజా రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్. తల్లి భారతి టీచర్. భార్య రీతు కూడా పైలట్‌గా పనిచేస్తోంది. గౌరవ్‌కు ఆమె పైలట్ ట్రైనింగ్ టైంలో పరిచయం అయింది. ఇద్దరూ ఒకే ఎయిర్‌లైన్ సంస్థలో పనిచేశారు. అక్కడే ఒకరినొకరు ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. పెండ్లికి ముందు కొన్నేండ్లు రిలేషన్షిప్లో ఉన్నారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు.