హైదరాబాద్‌ జీసీసీల అడ్డా.. 360కి పైగా ఆఫీసులతో టాప్‌

హైదరాబాద్‌ జీసీసీల అడ్డా.. 360కి పైగా ఆఫీసులతో టాప్‌
  • రెండో ప్లేసులో బెంగళూరు.. ఫెనో రిపోర్ట్ ​వెల్లడి

హైదరాబాద్, వెలుగు: మన దేశంలో గ్లోబల్​ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటు చేస్తున్న విదేశీ కంపెనీలకు హైదరాబాద్​ టాప్​ చాయిస్​గా మారిందని స్పెషలిస్ట్​ స్టాఫింగ్ సంస్థ  ఫెనో వెల్లడించింది.  దీని రిపోర్ట్ ప్రకారం, గత మూడేళ్లలో భారతదేశంలో స్థాపించిన కొత్త గ్రీన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ జీసీసీలలో 40 శాతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నాయి. ఇదే కాలంలో బెంగళూరు వాటా 33శాతం మాత్రమే ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 360కి పైగా జీసీసీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.  వీటిలో 3.1 లక్షల మందికిపైగా  పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం వైట్-కాలర్ వర్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌లో ఇది 14శాతం కంటే ఎక్కువ.

ఫెనో కో–ఫౌండర్​ కమల్ కరంథ్ మాట్లాడుతూ, దేశంలో ఏటా 100 వరకు జీసీసీలు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 47 లక్షలకు పైగా వైట్-కాలర్ ప్రొఫెషనల్స్​ఉన్నందున, హైవాల్యూ కేపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా మారిందని వివరించారు.  ఫెనో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫ్రాన్సిస్ పడమదన్ మాట్లాడుతూ,  భారీ టాలెంట్ పూల్, తక్కువ ఖర్చుల వల్ల తెలంగాణలో జీసీసీలు భారీగా పెరుగుతున్నాయని తెలిపారు. జీసీసీల్లో 59శాతం వాటాతో (1.82 లక్షలు) ఐటీ రంగం మొదటిస్థానంలో ఉంది. బీఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్ఐ, హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్, మాన్యుఫాక్చరింగ్ రంగాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి.