హుజూరాబాద్ నుంచి మళ్లీ నేనే బరిలో ఉంటా..

హుజూరాబాద్ నుంచి మళ్లీ నేనే బరిలో ఉంటా..

కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గం నుంచి 100 శాతం తానే మళ్లీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటానని ఆ పార్టీ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తనకే మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇస్తారని చెప్పారు. అయితే... గెల్లు శ్రీనివాస్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే... నిన్నటి ప్రెస్ మీట్ లో టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. రాబోయే అసెంబ్లీలో ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి బరిలో ఉండే తనపై ఈటల రాజేందర్ పోటీ చేసి గెలవాలంటూ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం గెల్లు శ్రీనివాస్.. హుజురాబాద్ టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ చార్జీగా ఉన్నారు. 

బీజేపీపై గెల్లు శ్రీనివాస్ విమర్శలు
మరోవైపు బీజేపీ పార్టీపై గెల్లు శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయలేదన్నారు. కేంద్రం నుంచి ఒక్క ప్రాజెక్ట్ కూడా తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ.. యువతకు ఉద్యోగాలు రాకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ను గజ్వేల్ నియోజకవర్గంలో ఓడిస్తానని అనడానికి ఈటలకు నోరు ఎలా వచ్చిందని మండిపడ్డారు. ఈటల రాజేందర్ ను ఎమ్మెల్యే, మంత్రిగా చేసింది సీఎం కేసీఆరేనని అన్నారు. సీఎం కేసీఆర్ కు ఈటల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ కు నూకలు చెల్లాయంటూ మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో తాను గెలిచి ఉంటే ఇప్పటికే మెడికల్ కాలేజీని తీసుకొచ్చేవాడినని, దమ్ముంటే ఈటల రాజేందర్ నియోజకవర్గానికి కాలేజీ తీసుకురావాలని సవాల్ విసిరారు.