బీడీ కార్మికుల పోరాటం మహిళా శక్తిని చాటాలి

బీడీ కార్మికుల పోరాటం మహిళా శక్తిని చాటాలి

డిజిటలైజేషన్ తర్వాత కోల్పోయిన ఉద్యోగాల్లో మహిళలే అధిక భాగం ఉన్నారన్న విషయాన్ని విస్మరించి ‘డిజిటల్ రంగంలో లింగ సమానత్వాన్ని’ 2023 మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినం నినాదంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. వాస్తవంగా సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ కు 2019లో చేసిన సవరణల ద్వారా మొత్తం బీడి పరిశ్రమ రంగంపైనే వేటువేయచూస్తున్న కేంద్ర ప్రభుత్వ కార్పొరేటీకరణ విధానాల ముందు యూఎన్ వో పిలుపు హాస్యాస్పదంగా పరిణమిస్తుంది. బీడీ కార్మికులకు కనీస వేతనాలు అందిస్తూ, అర్హత గల బీడీ కార్మికులందరికీ జీవన భృతి అమలు పరుస్తూ, ప్రత్యామ్నాయ జీవనోపాధి లేకుండా బీడి పరిశ్రమ మూసివేయరాదని కోరుతూ సుదీర్ఘ కాలంగా బీడీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. బీడీ కార్మికుల ఉద్యమానికి సంఘీభావంగా మార్చి 8 నుంచి15 వరకు వివిధ జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ, మార్చి15 న హైదరాబాదులోని ఓంకార్ భవన్ లో బహిరంగ సభ నిర్వహిస్తున్నం. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం ‘బొంబాయి.. దుబాయి.. బొగ్గు బాయి’ అంటూ చర్చించిన విధంగా దాదాపు పది లక్షల మందితో విస్తరించిన బీడీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఏనాడూ దృష్టి కేంద్రీకరించలేకపొయింది. 

జీవో నిలిపివేత..

సమైక్యాంధ్ర ప్రభుత్వ హయాంలో 40 రోజులు సమ్మె చేసి 2012లో జీ.ఓ. ఎం. ఎస్.నెం. 41 ద్వారా కనీస వేతనాలు సాధించుకున్నారు. కానీ పరిశ్రమ రక్షణ కోసం కార్మికులపై, కార్మిక సంఘాలపై ఆధారపడుతున్న యాజమాన్యాలు పాలకులపై ఒత్తిడి తెచ్చి ఆ జీవోను నిలిపివేయించారు. పైగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న బీడీ కార్మికుల జీవన భృతికి కూడా 2014 ఫిబ్రవరి 28 నాటికి ప్రావిడెంట్ ఫండ్ కలిగి ఉన్న కార్మికులకే పరిమితం చేశారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బీడీ కార్మికులందరికీ జీవనభృతి అమలు చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్​ఇచ్చిన హామీని అమలు పరచాలని హైదరాబాదు తో పాటు రాష్ట్రమంతటా బీడీ కార్మికులు రోడ్ల మీదకి వచ్చారు. ఈ సమయంలో దశాబ్దాల తరబడి బీడీ కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ నాయకురాళ్లను కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. బలవంతపు వసూళ్ల కేసులు బనాయించారు. 2021 మార్చి మాసమంతా రాష్ట్రవ్యాప్తంగా జరిగినా ర్యాలీల్లో పాల్గొన్న ప్రజాగాయని విమలక్కను ఈ కేసులో ఇరికించారు.  జైల్లో ఉన్న జనశక్తి కూర రాజన్న, బయట ఉన్న అమర్, విద్యార్థి- ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక నాయకుడు సంతోష్, బొమ్మ నరసింహలపై కేసులు బనాయించారు. 

150 ఏండ్లుగా పోరాటం

ఎన్ని చట్టాలు వచ్చినా ఏ రంగంలో లేని విధంగా ముడిసరుకులైన తునికాకు, తంబాకు సరిపోకపోతే(తుట్టి వడితే) బీడీ కార్మికులే కొనుక్కునే పరిస్థితులు నేటికీ ఉన్నాయి. వ్యవసాయం, చేనేత వృత్తి దెబ్బతిన్న తర్వాత తెలంగాణలో బీడీ రంగం అతిపెద్ద ఉపాధిగా దిక్కవడంతో అక్రమ చార్టింగ్ లు, గుల్ల కట్ట, దేవుని కట్ట అంటూ ఎన్నో తీర్లుగా సేట్లు వేధించినా కార్మికులు మరో ప్రత్యామ్నాయం లేక భరిస్తూ వచ్చారు. ఒకవైపు చేతినిండా పనివ్వకుండా మరొకవైపు తక్కువ వేతనాలతో వర్డి బీడీలకు ఎగబడ్డా ప్రత్యామ్నాయం లేక బీడీ కార్మికులు తలొగ్గుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా150 సంవత్సరాలుగా పోరాడుతున్న మహిళా కార్మికులకు ఎక్కడా ఇలాంటి దుస్థితి లేదు. దీనికి తోడు బీడీ కార్మికులు టీబి, దగ్గు వెన్ను నొప్పి మెడ నొప్పులతో 50 సంవత్సరాలకే చేతగాని దుస్థితిలోకి వెళ్తున్నారు. అటు ఇంటి పని, వంట పని, పిల్లల పని, కొన్ని సందర్భాల్లో యాజమాన్యాల కోసం పని చేస్తూ ఉత్పత్తిలో భాగమవుతున్న కార్మికులు బహుముఖ ప్రజ్ఞావంతులు. మార్చి 8 సందర్భంగా వీరి సమస్యలను ఎత్తి పడుదాం. ప్రజల శ్రమ సంపదను టోకుగా కొల్లగొడుతూ ఆర్థిక, సామాజిక విధ్వంసానికి, నేరాలకు కారణంగా ఉన్న మద్యాన్ని ఆపడానికి పాలకుల దగ్గర ఏ మంత్రదండం లేదు. ఎందుకంటే ప్రజల్ని తాగిపించి ఓట్లు దండుకోవడానికి మద్యం రాజకీయ సాధనంగా ఉపయోగపడుతుంది గనుక. ప్రీతి, నిఖిత అనే తేడా లేకుండా విద్యావ్యవస్థలో బలవన్మరణాలన్ని వ్యవస్థీకృత హత్యలుగా కొనసాగుతున్నాయి. పార్లమెంటు మెట్లెక్కని మహిళా రిజర్వేషన్ బిల్లును వదిలి దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెట్టే పనిలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో పది లక్షల మంది, దేశవ్యాప్తంగా రెండు కోట్ల మంది బీడీ కార్మికులు, తునికాకు సేకరించే మహిళ కూలీల జీవితాలను, వారి పోరాటాలను ఎత్తి పడుతూ మార్చి 8 అంతర్జాతీయ మహిళా శ్రామిక పోరాటానికి నిజమైన వారసత్వాన్ని కొనసాగిద్దాం.

- ఎ. పద్మ, పీవోడబ్ల్యూ(స్త్రీ విముక్తి) శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్