టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తిరగబడుతున్న జనం

 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తిరగబడుతున్న జనం

రాష్ట్రంలో ఎమ్మెల్యే లకు ఎలక్షన్ ఫీవర్

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు అప్పుడే ఎలక్షన్ ఫీవర్ పట్టుకుంది. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో సార్వత్రిక ఎన్నికల వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే  చాలా మంది ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. ఏదో ఒక కార్యక్రమం పేరుతో నిత్యం జనాల్లో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్ని రోజులు తమపై ఉన్న వ్యతిరేకతను పూడ్చుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. 

దేశంలో అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా అందరి దృష్టిని ఆకర్షించిన మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సెగ రేపింది. మునుగోడులో హోరా హోరీగా సాగిన ప్రచారం.. పోలింగ్ తదితర పరిణామాలను ఆసక్తిగా గమనించిన తెలుగు రాష్ట్రాల ప్రజలు తమతమ ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మీరు రాజీనామా చేయండి.. మా ఊరు బాగుపడుతుందని ప్రశ్నించడం సాధారణమైపోయంది. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న తెలంగాణ ప్రజలు బాహాటంగానే తమ తమ ఎమ్మెల్యేలను నిలదీస్తున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. 

మరోవైపు ఎమ్మెల్యేల ఆలోచనా సరళిలోనూ మార్పు వచ్చింది. ఈ పరిణామాలు.. ఇలాంటి ఘటనలు తమకు ఎదురుకాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి తోడు గతంలో ఇచ్చిన హామీల అమలుపై సీఎం కేసీఆర్ రివ్యూ చేయడం, తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ నిర్వహించి.. మునుగోడు ఉప ఎన్నిక ఫలితంపై పోస్ట్ మార్టం చేసి..  ఇది ఒక అనుభవంగా తీసుకోవాలని సూచన చేయడంతో ఎమ్మెల్యేలందరూ ఎన్నికలకు టైం అయ్యిందనే భావనకు వచ్చారు. 

నెల రోజులపాటు మునుగోడులోనే ఉండి.. సొంత నియోజకవర్గాలకు దూరంగా ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు తమ తమ నియోజకవర్గాల్లో తిష్ట వేశారు. సాధారణ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరిగినా.. ఏడాది మాత్రమే గడువు ఉండడంతో ఎన్నికల వేడి రాజుకుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు కరోనా మహమ్మారికే సమయం  సరిపోయింది. ఆ తర్వాత నియోజకవర్గంలో తిరుగుదామన్నా నిధుల లేమి.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో నియోజకవర్గాలో అభివృద్ధి కుంటుపడింది. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు వంటి కనీస మౌళిక సదుపాయాలు చాలా గ్రామాల్లో  కొరవడ్డాయి.

నిత్యం జనంలోకి వెళ్తున్న ఎమ్మెల్యేలు

శుభోదయం, గుడ్ మార్నింగ్ పేరుతో ఎమ్మెల్యేలు నిత్యం జనాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. అభివృద్ధిపై స్థానికులు, ప్రజాప్రతినిధులను బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీపై నిలదీస్తున్నారు. ఈ మధ్య చేవేళ్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య, మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలను రోడ్ల నిర్మాణాలు చేపట్టాలంటూ ప్రజలు అడ్డుకున్నారు. దీంతో త్వరలో రోడ్లు వేస్తాం అని ముందుగానే చెప్పుకున్న తర్వాతే ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటనలు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తుండటంతో తమనెక్కడ బహిరంగంగా నిలదీస్తారోనని ఎమ్మెల్యేలు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. తమపై ఉన్న వ్యతిరేకత ఒకవైపు,  ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మరోవైపు ఎమ్మెల్యేల పర్యటనలకు ఆటంకాలుగా మారినట్లు కనిపిస్తోంది. గత రెండు ఎన్నికలు..  2014లో మళ్లీ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, మధ్య మధ్యలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు, సొంతంగా ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు.. ఇలా సగానికి పైగా నెరవేరలేదు. ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్, మూడు ఎకరాల భూమి, ఉద్యోగాల కల్పన, దళితబంధు లాంటి ముఖ్యమైన పథకాలు ఇవ్వకపోవడంతో గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. 

ఇప్పుడు మళ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో పాత హామీలన్నీ ముందేసుకొని వాటికి బడ్జెట్ కోసం ప్రభుత్వ పెద్దల వద్ద ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉండటంతో బడ్జెట్ రిలీజ్ కావడం కష్టం అవుతుందని కొంతమంది ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు.