సామాన్యుడికి సాయంగా జనరిక్ మందులు

సామాన్యుడికి సాయంగా జనరిక్ మందులు

మంచి లైఫ్ అంటే బాగా పైసలుండటం కాదు. హెల్దీగా ఉండటం. ఈ విషయం కరోనా వచ్చాకే అందరికీ అర్థమైంది. కానీ, కరోనా రాకముందే ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది కేంద్ర సర్కార్. ‘ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన’ (పీఎమ్​ బీజేపీ) స్కీమ్ ద్వారా జనానికి అతి తక్కువ ధరలకే  మందులు అందిస్తోంది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో జన ఔషధి జనరిక్ మెడికల్ స్టోర్లు ఏర్పాటైతే మన రాష్ట్రంలో దాదాపు 115 స్టోర్లు ఉన్నాయి. అందులో 20 షాపుల వరకూ రిటైర్డ్ ఆర్మీ ఎక్స్ సర్వీస్‌‌మెన్, సోషల్ వర్కర్  గోపు రమణా రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మిగతా మెడికల్ షాపులకు, ఈ జనరిక్ షాపులకు తేడా ఏంటి? ఈ షాపుల్లో ఎంత తక్కువ రేటులో మందులు దొరుకుతాయి? అనే విషయాలపై గోపు రమణా రెడ్డితో ఇంటర్వ్యూ.

రూ.130లు విలువ చేసే మందులు 10 లేదా 15 రూపాయలకు  అందించడంతో జనరిక్ మెడికల్ షాపులు ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. లాక్ డౌన్‌‌లో కూడా వాట్సాప్, ఈ మెయిల్, ఫోన్స్ ద్వారా ఆర్డర్లు తీసుకోవడంతో ఈ స్టోర్స్‌‌కు క్రేజ్​ పెరిగింది. దాంతోపాటు దేశంలో  కోట్ల టర్నోవర్ సాధిస్తోంది జన ఔషధి సంస్థ. దీంతో నిరుద్యోగులు ఈ కేంద్రాలను పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

జనం ఆదరణ పొందుతున్న పీఎమ్ బీజేపీ స్కీం లక్ష్యం ఏంటి?

ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన (పీఎమ్​ బీజేపీ) ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీం’. ‘మినిస్టరీ ఆఫ్ కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్’, ‘డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్’ ఆధ్వర్యంలో ఈ స్కీం నడుస్తోంది. అయితే, ‘బ్యూరో ఆఫ్ ఫార్మా పీఎస్ యుఎస్(బిపిపిఎ) ’ఈ స్కీం అందుకున్న తర్వాత దీనికి ‘ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్ర’ అని పేరు పెట్టారు. దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు ఏర్పాటు చేసి, ప్రజలకు అతి తక్కువ ధరలకు మందులు అందించాలన్నదే ఈ స్కీం లక్ష్యం.

ఈ స్కీం వల్ల ప్రజలకు ఎలాంటి లాభం ఉంటుంది?

ఏ మందులైనా చాలా తక్కువ ధరల్లో ప్రజలకు అందాలి. ఆ ఉద్దేశంతోనే కేంద్ర సర్కార్ ఈ స్కీంను ప్రవేశపెట్టింది. కొన్ని మందులు మార్కెట్ ధరల కన్నా 90 శాతం వరకు తక్కువగా దొరుకుతాయి. అంటే ఉదాహరణకు130 రూపాయలు ఉన్న మందులు 10 లేదా 15 రూపాయలకే అక్కడ దొరుకుతాయి. తలనొప్పి, జలుబు, జ్వరం దగ్గర నుంచి షుగర్, క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్ వరకు ఏ జబ్బులకైనా ఇక్కడ మందులు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఎన్ని స్టోర్స్ ఉన్నాయి? మన రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి?

మొదట‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా’ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే, 120 నుంచి 150 వరకు షాపులు మాత్రమే ఏర్పాటయ్యాయి. కానీ, ప్రధాని నరేంద్ర మోడి చొరవతో దేశవ్యాప్తంగా 7, 500 షాపులు పెరిగాయి. మరో 5,000 షాపులు పెట్టే ఆలోచనలో ఉన్నారు. మన రాష్ట్రంలో దాదాపు 115 జన ఔషధి స్టోర్స్ ఉన్నాయి. అందులో 20 షాపుల వరకూ నేను నిర్వహిస్తున్నా. మరో 150 షాపుల వరకు రాష్ట్రమంతటా పెట్టాలన్న ప్లానింగ్‌‌లో ఉన్నా.

ఈ షాపుల్లో అన్ని రకాల మందులు దొరకడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి?ఎందుకు?

అవన్నీ అనుమానాలు. అన్ని స్పెషాలిటీ మందులు ఈ షాప్స్ లో అందుబాటులో ఉంటాయి. ఒకవేళ ఆ సమయంలో ఆ మందులు అందుబాటులో లేకపోతే ఆర్డర్ ఇస్తే తెచ్చి ఇస్తారు. ప్రిస్క్రిప్షన్ చూపించినా లేదా మందుల స్ట్రిప్ ఇచ్చినా కావాల్సిన మందులు ఇస్తారు.

మామూలు మెడికల్ షాపులకు, ఈ షాపులకు రేట్లలో ఎంత తేడా ఉంటుంది?

మామూలు మెడికల్ షాపుల్లో బ్రాండెడ్ మందులు అమ్ముతారు. ఎమ్ఆర్‌‌‌‌పి మీదే వాటిని అమ్ముతారు.  కానీ, జనరిక్ షాపుల్లోని మందులు స్కీం ద్వారా ఇస్తారు. కాబట్టే చాలా తక్కువ రేటుకు మందులు దొరుకుతాయి. మిగతా షాపుల్లో మందులకు నెలకు ఐదు వేల రూపాయలైతే.. ఈ షాపుల్లో వెయ్యి రూపాయల లోపులోనే అవుతుంది. అంటే మామూలు షాపుల్లో ఒక నెలకు కొన్న మెడిసిన్ పైసలతో నాలుగైదు నెలలు జనరిక్ షాపుల్లో మందులు కొనుక్కోవచ్చు.

ఈ షాపుల్లో మందులు కొనాలంటే ఏమైనా ఫార్మాలిటీస్ ఉన్నాయా?

ఈ స్కీం మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. ప్రతి వ్యక్తి ఈ షాపుల్లో మందులు కొనుక్కోవచ్చు. మందులు కొనడానికి ఏ ఐడెంటిటీ కార్డ్ అవసరం లేదు. ఎవరైనా ఈ మందులు కొనుక్కోవచ్చు. షాపుకు వచ్చి మందులు కొనడం కుదరని వాళ్లకు హోమ్ డెలివరీ చేసే ఫెసిలిటీ ఉంది. ఈ మధ్య హోమ్ డెలివరీలే ఎక్కువగా చేస్తున్నాం.

ఎవరైనా ఈ మెడికల్ స్టోర్స్ పెట్టాలనుకుంటే?ప్రాసెస్ ఏంటి?

మెడికల్ సెంటర్ పెట్టాలనుకుంటే రు. 2.5 లక్షల పెట్టుబడి అవసరం ఉంటుంది. మిగిలిన ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది. నిరుద్యోగ ఫార్మాసిస్టులు, డాక్టర్ లేదా గుర్తింపు పొందిన మెడికల్ ప్రాక్టీషనర్‌‌‌‌లు దీనికి ఎలిజబుల్. ట్రస్ట్ లు, ఎన్జీవోలు, ప్రైవేట్ హాస్పిటల్స్, సొసైటీలు కూడా ఈ స్టోర్స్  పెట్టొచ్చు. అలాగే.. రాష్ట్ర సర్కార్ నామినేట్ చేసిన ఏజెన్సీలకు కూడా అవకాశం ఉంది. అయితే 120 చదరపు అడుగుల్లో షాపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 50,000 విలువైన మందులను అడ్వాన్స్‌‌గా ఇస్తారు.

ఎలా అప్లై చేయాలి?

జన ఔషధి కేంద్రం పేరుతో అభ్యర్ధి రిటైల్ డ్రగ్ లైసెన్స్ తీసుకోవాలి. janaushadhi.gov.in వెబ్ సైట్ నుంచి ఫామ్ డౌన్‌‌లోడ్ చేయాలి. దాన్ని నింపి ‘బ్యూరో ఆఫ్ ఫార్మా పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ జనరల్ మేనేజర్‌‌’ ‌‌కి పంపాలి.  ఆ వివరాలన్నీ వెబ్ సైట్‌‌లో ఉంటాయి. అప్లికేషన్ తో పాటు ఆధార్ కార్డ్, పాన్ నెంబర్ కూడా ఇవ్వాలి.

మీరు ఈ ఫార్మా సైడ్ రావడానికి కారణం ఏంటి?

నేను ఎక్స్  సర్వీస్‌‌మెన్​ని. ఆర్మీలో 20 ఏళ్లు పనిచేశాను. దేశ సేవ చేశా. ప్రజా సేవ కూడా చేయాలనే ఉద్దేశంతో ‘ఆర్గనైజేషన్ ఫర్ పూర్ అండ్ ఎకనామికల్ నీడ్స్’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశా. ఇది 1999లో ప్రారంభమైంది. అప్పటి నుంచీ మెడికల్ క్యాంపులు, అవేర్‌‌‌‌నెస్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నాను. దానికితోడు,  నేను ఫార్మసీ చదవడంతో ఈ మెడికల్ ఫీల్డ్‌‌ను ఎంచుకున్నా.

మన రాష్ట్రంలో ఈ షాప్స్ ఇంకా ఎక్కడెక్కడ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు?

నిరుపేదలకు ఈ మందులు అందాలి. పైసల్లేక, మందులు కొనలేక వాళ్లు ఇబ్బంది పడకూడదు. అలా జనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే గవర్నమెంట్ హాస్పిటల్స్‌‌లో కూడా జన ఔషధి షాపులు పెట్టాలి. ఆ అవకాశం వస్తే అక్కడ కూడా ఈ మెడికల్ షాపులు పెట్టాలని ఉంది. కనీసం 120‌‌‌‌ చదరపు అడుగుల స్థలం ఇచ్చినా మెడికల్ స్టోర్ పెట్టొచ్చు. పేదవాడిని ఆదుకోవచ్చు.

ఇది చాలా మంచి సర్వీస్

నేను జనరిక్ మెడిసిన్స్‌‌కు రెగ్యులర్ కస్టమర్‌‌‌‌ని. మా హజ్బెండ్ ఈ మధ్యే చనిపోయారు. అంతకుముందు ఆయన లుకేమియాతో బాధపడేవారు. నెలకు నాలుగు నుంచి ఐదువేల వరకూ మందులకు ఖర్చు అయ్యేది. కానీ, జనరిక్ మెడికల్ స్టోర్స్‌‌లో మందులు కొంటే 1,200 రూపాయలు మాత్రమే అయ్యేవి. తక్కువ రేటులో అక్కడ మందులు దొరికేవి. ఇప్పుడు కూడా నా కోసం, మా అక్క కోసం డయాబెటిక్, మోకాళ్ల నొప్పులకు సంబంధించిన మందులు అక్కడే కొంటున్నాం. ఇది చాలా మంచి సర్వీస్ అని ఎప్పుడూ అనుకుంటాం.

 – శోభానాయుడు, గృహిణి, హైదరాబాద్​

క్వాలిటీ ఏం మారదు

మా వైఫ్‌‌కు డయాబెటిస్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెలకు ఐదు వేల వరకూ ఖర్చు అయ్యేది. అదే జనరిక్ మెడికల్ స్టోర్స్‌‌లో కొంటే 1,700 రూపాయలు మాత్రమే అవుతుంది. నాకు హెల్త్ బాలేకపోయినా కూడా మందులు అక్కడే కొంటా. చాలా తక్కువకు మందులు దొరుకుతాయి. 330 రూపాయల మెడిసిన్ అయితే 43 రూపాయలు తీసుకుంటారు. క్వాలిటీ కూడా ఏం మారదు. ఒక వేళ మందులు అక్కడ లేకపోతే తెప్పించి ఇస్తారు. ఈ ఫెసిలిటీ కూడా ఉండడంతో రెగ్యులర్‌‌‌‌గా అక్కడే కొంటున్నా.

   – కాశీనాథ్ రాచర్ల, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయి, హైదరాబాద్‌