వాటర్​ సప్లైపై GHMC ఫోకస్ .. గ్రేటర్​లో సమ్మర్ యాక్షన్​ ప్లాన్​

వాటర్​ సప్లైపై GHMC ఫోకస్ .. గ్రేటర్​లో సమ్మర్ యాక్షన్​ ప్లాన్​
  • పైపులైన్ లీకేజీల రిపేర్లకు సిబ్బందికి ఆదేశాలు 
  • సమస్యాత్మక ప్రాంతాలకు ట్యాంకర్లతో సరఫరా 
  • అత్యవసర సేవలకు టోల్​ ఫ్రీ 72079 08583 ఏర్పాటు 

హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ పరిధిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా బల్దియా ప్రత్యేక చర్యలపై దృష్టి పెట్టింది. భూగర్భజలాలు అడుగంటి రాష్ట్రంలో కొన్నిచోట్ల సమస్యలు ఏర్పడుతుండటంతో జీడబ్ల్యూఎంసీ సమ్మర్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. నగర తాగునీటి అవసరాలను తీర్చే ధర్మసాగర్ రిజర్వాయర్, వడ్డేపల్లి చెరువుల్లో సరిపడా నీళ్లుండగా, క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తకుండా బల్దియా అధికారులు చర్యలు చేపడుతున్నారు. 

ప్రధానంగా పైపులైన్ లీకేజీలపై దృష్టి పెట్టి రిపేర్లు చేయిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం వ్యవసాయశాఖ డైరెక్టర్​ డాక్టర్​ బి.గోపిని ఉమ్మడి వరంగల్​జిల్లా వాటర్ సప్లై స్పెషల్ ఆఫీసర్ గా నియమించగా, ఆయన ఎప్పటికప్పుడు ఆఫీసర్లతో రివ్యూ చేస్తున్నారు. గ్రేటర్ ఆఫీసర్లు మాత్రం సమస్యాత్మక ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేయడంతో పాటు తాగునీటి సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. 

మైక్రో ప్లాన్​తో ముందుకు..

గ్రేటర్​ వరంగల్​ జిల్లా వాటర్​ సప్లై ఆఫీసర్లు డివిజన్లవారీగా మైక్రో ప్లాన్ తయారు చేసి, ఎక్కడ ఇబ్బందులు తలెత్తినా వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 66 డివిజన్లలో దాదాపు 2.25 లక్షల ఇండ్లు ఉండగా, 1.81 లక్షల నల్లా కనెక్షన్లున్నాయి. నగర జనాభా 11లక్షల వరకు ఉండగా, ధర్మసాగర్, వడ్డేపల్లి చెరువులతో పాటు కరీంనగర్ ఎల్ఎండీ నీటిని ధర్మసాగర్, వడ్డేపల్లి, కేయూసీ, దేశాయిపేటలోని నాలుగు ఫిల్టర్ల బెడ్ల ద్వారా శుద్ధి చేసి పంపిణీ చేస్తున్నారు. 

నగర అవసరాలకు ప్రతిరోజూ 172.30 మిలియన్​ లీటర్ల (ఎంఎల్​డీ) నీళ్లు సరఫరా చేయాల్సి ఉండగా, లీకేజీలు ప్రధాన సమస్యగా మారాయి. చాలాచోట్ల పాత లైన్లు, నీటి ప్రెజర్ ను తట్టుకోలేని పైపుల కారణంగా లీకేజీలు ఏర్పడుతున్నాయి. మరికొన్నిచోట్ల తక్కువ లోతులో వేసిన పైపులు, వాల్వ్ ల్లో సమస్యలు, వివిధ అవసరాల కోసం ఇష్టారీతిన తవ్వడం వల్ల పైపులు పగిలి లీకవుతున్నాయి. 

సిటీతోపాటు విలీన గ్రామాల్లోనూ ఇదే సమస్య ఉండగా, గతంలో ఆఫీసర్లు 5 వేలకు పైగా లీకేజీలు అరికట్టారు. నగర వ్యాప్తంగా ఇంకో ఆరేడు వందల వరకు లీకేజీలు ఉండగా, వాటి ద్వారా నిత్యం 30 ఎంఎల్​డీ వరకు నీళ్లు వృథా అవుతున్నాయి. దీంతో మున్సిపల్ అధికారులు ఈసారి లీకేజీలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. గ్రేటర్ ఇంజినీరింగ్ అధికారులు ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ఎప్పటికప్పుడు లీకేజీలు, పైపులైన్ రిపేర్ల పనులు చేపట్టి నీటి వృథాను అరికట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

సమస్యలపై ఫోకస్​..

ఉమ్మడి వరంగల్​ జిల్లా తాగునీటి సరఫరా ప్రత్యేక అధికారి డాక్టర్​ బి.గోపి ఈ నెల 6న హనుమకొండ, వరంగల్, గ్రేటర్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించి ఇక్కడి సమస్యలన్నింటిపై చర్చించారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. బోర్లు, చేతి పంపులు, పైపులైన్ల రిపేర్లు యుద్ధప్రాతిపదికన చేయించాలని, అవసరమైన చోట్ల వ్యవసాయ బావుల నుంచైనా తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 దీంతో గ్రేటర్ అధికారులు డివిజన్లవారీగా మైక్రోప్లాన్ రెడీ చేశారు. ఎక్కడెక్కడ నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయో క్షేత్రస్థాయి సిబ్బంది పరిశీలించి ప్రత్యామ్నాయ చర్యలపై ఫోకస్ పెడుతున్నారు. మిషన్ భగీరథ కనెక్షన్లు లేని ఏరియాల్లో చేతి పంపులు, బోర్లు రిపేర్లు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. నగరంలో కొన్ని స్లమ్ ఏరియాల్లో వివిధ సమస్యల కారణంగా నీటి సరఫరా జరగని ప్రాంతాల్లో బల్దియా వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. నగరానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే జనాలకు కూడా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రేటర్ సిటీలో హనుమకొండ పరిధిలో 25, వరంగల్ పరిధిలో మరో 25 చోట్ల చలివేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. 

తాగునీటి సమస్యలకూ టోల్​ ఫ్రీ నెంబర్.. 

బల్దియా పరిధిలో పైపులైన్ల రిపేర్లు, ఇతర సమస్యల కారణంగా కొన్నిచోట్లా రెండు రోజులకోసారి నీటిని వదులుతున్నా, ఇంకొన్ని చోట్లా లీకేజీలతో పాటు ఇతర సమస్యలున్నా క్షేత్రస్థాయి సిబ్బంది పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతోనే గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తాజాగా బల్దియాలో ఓ టోల్​ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొచ్చారు.72079 08583 కి కాల్ చేస్తే నీటి సరఫరాలో సందేహాలను నివృత్తి చేసుకోవడంతోపాటు తాగునీటికి సంబంధించిన సమస్యలు విన్నవించినా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.