చేతకాని సన్నాసుల చేతుల్లో జిహెచ్ఎంసి నలిగిపోతోంది

చేతకాని సన్నాసుల చేతుల్లో జిహెచ్ఎంసి నలిగిపోతోంది
  • స్కావెంజర్లు లేరన్నారు..మరి సాహెబ్ నగర్ లో ఇద్దరు ఎలా చనిపోయారు ?
  • లక్ష కోట్ల ఆధాయం వచ్చే చోట కనీసం నాలాలు బాగు చేయరా..?
  • శుభ్రం చేసే పనుల కాంట్రాక్టు విషయంలో కేటీఆర్ ఆడిన బంతి ఆట తోనే సమస్యలు 
  • ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్

హైదరాబాద్: జీహెచ్ఎంసీ యంత్రాంగం చేతకాని సన్నాసుల చేతుల్లో పడి నలిగిపోతోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో స్కావెంజర్లు లేరని మంత్రి కేటీఆర్ ఘనంగా చెప్పారు.. మరి సాహెబ్ నగర్ లో ఇద్దరు కార్మికులు ఎలా చనిపోయారు ? అని ఆయన ప్రశ్నించారు. గురువారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరం నుండి లక్ష కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే.. కనీసం నాలాలు బాగుచేయలేరా.. అని దాసోజు శ్రవణ్ అన్నారు. 
దళిత బంధు నెపంతో డబ్బులు పంచుతున్నారు 
రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు నెపంతో డబ్బులు పంచే కార్యక్రమాన్ని ప్రారంభించిందని దాసోజు శ్రవణ్ విమర్శించారు. 
సాహెబ్ నగర్ లో మ్యాన్ హోల్ లో పనిచేస్తూ ఇద్దరు పేదింటి వడ్డెర కులానికి చెందిన వ్యక్తులు బలి అయ్యారని ఆయన ఆందోలన వ్యక్తం చేశారు. కార్మికుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతూ వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. సైనికులు ఎంత ముఖ్యమో, పారిశుద్ధ్య కార్మికులు కూడా అంతే ముఖ్యం అన్నారు. హైద్రాబాద్ లో మ్యానువల్ స్కావెంజర్లు లేరు అని ఘనంగా మంత్రి కేటీఆర్ ప్రకటించింది నిజమే అయితే సాహెబ్ నగర్ లో ఇద్దరు ఎలా చనిపోయారు.. ? ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇద్దరు చనిపోయారని, వారి కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.  
మ్యానువల్ స్కావెంజర్స్ కి స్వస్తిపలికి టెక్నాలజీ ఉపయోగించాలి 
ప్రభుత్వం ఇప్పటికైనా మాన్యువల్ స్కావెంజర్స్ కి స్వస్తి పలకాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఎండాకాలంలో చేయాల్సిన పనులు చేయకపోవడంతోనే వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురౌతున్నాయని, శుభ్రం చేసే పనుల కాంట్రాక్టు విషయంలో కేటీఆర్ ఆడిన బంతి ఆట తోనే సమస్యలు వచ్చాయన్నారు. కాంట్రాక్టులకు డబ్బులు కూడా చెల్లించకపోవడంతోనే చెత్త పేరుకుపోయిందని, చేతకాని సన్నాసుల చేతులో జిహెచ్ఎంసి నలిగిపోతోందన్నారు. మ్యాన్యువల్ స్కావెంజర్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాలన్నారు. మురుగు నీటిని శుభ్రం చేసేది పేదింటోళ్లే కాబట్టి ప్రభుత్వం కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని.. సాహెబ్ నగర్ ఘటనకు బాధ్యులైన ఉద్యోగులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్ష కోట్ల ఆదాయం ఇచ్చే హైద్రాబాద్ లో నాలా ల అభివృద్ధి ఎందుకు చేయరు..? ప్రశ్నించినోళ్ళను కుక్కల్లా టీఆర్ఎస్ నేతలు దాడి చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. నాలాల్లో పడి సామాన్యులు, పరిశుద్ధ కార్మికులు చనిపోతున్నా  ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోదని ప్రశ్నించారు. పోలీసులను పాలెగాళ్లుగా మార్చుకొని కేసులు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు.  
పీపుల్స్ ఛార్జ్ షీట్ వేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల భాగోతాలను ప్రజల ముందుంచుతాం 
టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని.. టీఆరెస్ ఎమ్మెల్యేల భారతం పట్టేరోజు దగ్గర్లోనే ఉందని, త్వరలోనే పీపుల్స్ ఛార్జ్ షీట్ వేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల భాగోతాలను ప్రజల ముందు ఉంచుతామని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రకటించారు. భూ కబ్జాలు, వైన్ మాఫియా, ఇసుక మాఫియా, డ్రాగ్ మాఫియా ఇలా అన్ని వ్యవస్థల్లో మాఫియాగా ఏర్పడి దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. అధికారంలోకి రాక ముందు వారి ఆస్తులెంత.. ?  ఇప్పుడు వారి ఆస్తులెన్ని ? అని ఆయన ప్రశ్నించారు. రెండేళ్లు కష్టపడి ప్రజాస్వామ్య తెలంగాణ సాధిద్దామని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.