మంత్రి ట్వీట్​చేసే దాకా బల్దియా ఆఫీసర్లు పట్టించుకోవట్లేదు

మంత్రి ట్వీట్​చేసే దాకా బల్దియా ఆఫీసర్లు పట్టించుకోవట్లేదు

స్థానిక సమస్యలను ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్​కు విన్నవించుకుంటున్న సిటిజన్లు‘‘హస్తినాపురం డివిజన్​లో స్ట్రీట్​లైట్ల ప్రాబ్లమ్ ఉందని తరుణ్ రెడ్డి అనే సిటిజన్ ఈ నెల13న మంత్రి కేటీఆర్​కి ట్వీట్​ చేశాడు. సాయంత్రం 6.30 గంటల తర్వాత మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నాడు. ట్వీట్​కు స్పందించిన మంత్రి సమస్యను పరిష్కరించాలని ఎల్​ బీనగర్ జోనల్ కమిషనర్​ని ఆదేశించారు.’’ 

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​లో ఎలాంటి సమస్య పరిష్కారం కావాలన్నా మంత్రి కేటీఆర్ ఆదేశించాల్సిన పరిస్థితి నెలకొంది. మేయర్ సహా బల్దియా ఆఫీసర్లు మంత్రి ట్వీట్​చేసే దాకా పట్టించుకోవట్లేదు. ఇక కార్పొరేటర్లు కేవలం పాలకమండలి సమావేశాలకే పరిమితం అవుతున్నారు. పార్కులు, చెరువులు, చెత్త, స్ట్రీట్ లైట్లు, నాలాలు, రోడ్లు ఇలా ప్రతీ సమస్య కేటీఆర్ ట్విట్టర్​లో ఆదేశిస్తేనే పరిష్కారం అవుతోంది. అదే సమస్యను ముందుగా జీహెచ్ఎంసీ ఆఫీసర్లకు చెప్పుకున్నా పట్టించుకోవడం లేదు. దీంతో సిటిజన్స్ వాళ్ల ఏరియాలో ఫేస్​చేస్తున్న ప్రాబ్లమ్స్​ను నేరుగా ట్విట్టర్ ద్వారా మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఫొటోలు పోస్ట్​చేసి స్పందించాలని కోరుతున్నారు. కొన్నింటిపై స్పందిస్తున్న కేటీఆర్.. మేయర్, కార్పొరేటర్లు, బల్దియా ఆఫీసర్లను ట్యాగ్​చేసి సాల్వ్​చేయాలని ఆదేశిస్తున్నారు. ఇటీవల లంగర్ హౌస్ లోని హుడాపార్కు, చెరువులో చెత్త పేరుకుపోయిందని మహ్మద్​నవీద్​అనే సిటిజన్ మంత్రికి ట్వీట్​పెట్టాడు. స్పందించిన కేటీఆర్ సమస్యను పరిష్కరించమని ఈ నెల 13న మేయర్ గద్వాల్ విజయలక్షిని ట్యాగ్​చేసి ఆదేశించారు. 17న పార్కుని విజిట్​చేసి పార్కుతో పాటు చెరువు బ్యూటిఫికేషన్ చేపడుతున్నట్లు మేయర్​ట్విట్టర్​ద్వారా కేటీఆర్​కు తెలిపారు. ఇదే అంశంపై ఈనెల 27న ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. మంత్రి కేటీఆర్​సమస్యలపై ట్వీట్​చేస్తే తప్ప పరిష్కరించాలనే సోయి ఉండట్లేదని జనం విమర్శిస్తున్నారు. 

మరింత పెరిగినయ్

ఇలా గ్రేటర్​లోని సమస్యలపై మంత్రి కేటీఆర్​కి రోజురోజుకు ట్వీట్లు పెరుగుతున్నాయి. లోకల్​గా పరిష్కారం లభించకపోవడంతో ప్రతిదాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నారు. కిందిస్థాయి ఆఫీసర్లు చేసే పనులు మంత్రి దాకా పోతున్నా ఆఫీసర్లలో చలనం ఉండట్లేదు. గ్రీవెన్స్ సెల్​కి వస్తున్న సమస్యలపై పెద్దగా ఫోకస్​పెట్టడం లేదు. ఎప్పటికప్పుడు10 వేలకు పైగా కంప్లయింట్స్​పెండింగ్​లోనే ఉంటున్నాయి. వాటిపై ఫోకస్ పెడితే కేటీఆర్​కి సగం ట్వీట్లు తగ్గే అవకాశం ఉంది.

‘‘ఫతేనగర్​లో ఓ మహిళ ఫుట్​పాత్​పై ఉంటోందని ఓ ఫౌండేషన్ వారు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్​కి చెప్పగా ఆయన స్పందించారు. కూకట్ పల్లి జోనల్ కమిషనర్​కి ట్యాగ్ చేస్తూ రీట్వీట్ చేశారు. దగ్గరలోని షెల్టర్ హోంకి మహిళని తరలించాలని ఆదేశించారు. స్పందించిన ఆఫీసర్లు ఆమెను షెల్టర్​కు తరలించారు. జోనల్​ కమిషనర్ ఆ విషయాన్ని మంత్రి కేటీఆర్​కు తెలియజేస్తూ ఫొటోలు తీసి ట్వీట్​చేశారు.’’ 

ట్విట్టర్ లోనే పాలన

మంత్రి కేటీఆర్ కి ట్వీట్ చేస్తే తప్ప సిటీలో పనులు జరగట్లేదు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మంత్రి, ఆఫీసర్లు ఆలోచించుకోవాలి. చెత్త తరలింపు, స్ట్రీట్ లైట్లు నిర్వహణ, నాలాలు క్లీనింగ్ ​ఇలా ప్రతీది కేటీఆర్ ఆదేశిస్తేనే జరుగుతున్నట్లు కనిపిస్తుంది. పాలన అంతా ట్విట్టర్ ద్వారానే కొనసాగుతోంది. సామాన్యులు ట్విట్టర్ యూజ్ చేయరని మంత్రి గుర్తించాలి. సిటీలోని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి. 
– తోకల శ్రీనివాస్ రెడ్డి, మైలార్​ దేవ్ పల్లి కార్పొరేటర్