ఆఫీసర్లు ఉండట్లేదు!.. ఎన్నికల బిజీలో జీహెచ్ఎంసీ అధికారులు

ఆఫీసర్లు ఉండట్లేదు!.. ఎన్నికల బిజీలో జీహెచ్ఎంసీ అధికారులు
  • కమిషనర్ నుంచి  కిందిస్థాయి సిబ్బంది దాకా.. 
  • ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు
  • సర్కిల్​ ఆఫీసుల్లో మ్యుటేషన్లు కూడా చేయట్లేదు
  • పనులు చేయాలంటూ ఉన్నతాధికారులకు రిక్వెస్ట్

హైదరాబాద్, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికలు అయ్యేదాకా సిటీ వాసులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఏదైనా సమస్యపై బల్దియా వార్డు ఆఫీసుకి వెళితే అక్కడ అధికారులు ఉండటంలేదు. దీంతో వార్డుస్థాయిలో పనులు పెండింగ్ లో  ఉంటున్నాయి. చాలా సర్కిళ్ల లో మ్యుటేషన్ల అప్లికేషన్లు పేరుకుపోతున్నాయి. అధికారుల వద్దకు వెళ్లి అడిగినా  పనులు చేయకపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఎన్నికల డ్యూటీలతో పాటు ప్రజలకు కావాల్సిన పనులు వెంటనే  చేయించాలని పలువురు కోరుతున్నారు.  మరోవైపు ఎన్నికల ఏర్పాట్ల బిజీలో ఉన్నామని జీహెచ్ఎంసీ అధికారులు  చెబుతున్నారు. 

అధికారులను అడిగితే..

వార్డు స్థాయిలో వచ్చే తాగునీరు, సీవరేజ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ తదితర సమస్యలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి.  సిటిజన్ చార్ట్ ఆధారంగా నిర్ణీత సమయంలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. ఒక్కో వార్డు ఆఫీస్ లో అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్, ఇంజినీర్, టౌన్ ప్లానర్, ఎంటమాలజిస్ట్, శానిటరీ జవాన్,  అర్బన్ బయోడైవర్సిటీ సూపర్ వైజర్, వాటర్ బోర్డు అసిస్టెంట్, విద్యుత్ శాఖ లైన్ మెన్ లేదా లైన్ ఇన్ స్పెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్ తో పాటు రిసెప్షనిస్ట్  తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. అధికారులు ఉదయం తమ పరిధిలో వార్డులో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు మస్ట్ గా వార్డు ఆఫీసులో అందుబాటులో ఉండాలి. ఉదయం వచ్చిన ఫిర్యాదులకు  డేటా ఎంట్రీ చేసి సంబంధిత అధికారికి ఫార్వర్డ్ చేసి, సమస్య పరిష్కారానికి, ఆ తర్వాత ఫిర్యాదుదారుడికి వివరాలు తెలియజేయాలి. కానీ.. ప్రస్తుతం విజిటింగ్ సమయాల్లో కూడా అందుబాటులో ఉండటంలేదు. అధికారులు ఎందుకు రాలేదని అడిగితే ఎలక్షన్స్ డ్యూటీ బిజీలో ఉన్నట్లు సమాధానం చెబుతున్నారు.  

సోషల్ మీడియాలో రిక్వెస్ట్.. 

బల్దియా అధికారులు సకాలంలో పనులు చేయకపోతుండగా జనాలు సోషల్ మీడియాలో ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నారు. పనుల కాకపోతుండటంతో  కొందరు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో మాదిరిగా అధికారులు స్పందించడం లేదని, ఎప్పుడు వెళ్లినా కొందరు అందుబాటులో ఉండటం లేదని చెబుతున్నారు. దీనిపై ఇటీవల కమిషనర్ రోనాల్డ్ రాస్ సైతం అధికారులకు ఆదేశించారు. ఎక్కడ కూడా గ్రీవెన్స్ పెండింగ్​ లేకుండా పనులు చేయాలని, ఉన్నట్లు తమ దృష్టికి వస్తుందని అధికారులు సూచించారు. 

రెగ్యులర్​ పనులను  పక్కన పెట్టి..

ఎన్నికలు సమీపిస్తుండగా  హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్  స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏర్పాట్లను మరింత స్పీడప్ చేశారు. కమిషనర్ నుంచి బిల్ కలెక్టర్, ట్యాక్స్​ ఇన్ స్పెక్టర్లు .. ఇలా ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు బిజీగానే ఉన్నట్లు చెబుతున్నారు. కిందిస్థాయి అధికారులు, సిబ్బంది రెగ్యులర్ పనులు పక్కన పెట్టారు. ట్యాక్స్ కలెక్షన్ చేసే బిల్ కలెక్టర్లు, ట్యాక్స్​ ఇన్ స్పెక్టర్లు అయితే ట్యాక్స్​ కలెక్షన్ వదిలిపెట్టి ఎన్నికల ఏర్పాట్ల పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో మ్యుటేషన్లు, ఎంటమాలజీ ఫాగింగ్ తదితర పనులపై ఎఫెక్ట్ పడింది. పనులు సకాలంలో కాకపోతుండగా సిటిజన్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. హెడ్ ఆఫీసుతో పాటు సర్కిల్ ఆఫీసుల్లోనూ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి హడావుడి చేస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లకి సంబంధించి డైలీ అధికారులతో కమిషనర్ సమావేశమవు తున్నారు. వచ్చేనెలలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో బల్దియా అధికారు లు అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్న ప్పటికీ రెగ్యులర్ గా చేయాల్సిన పనులను పట్టించుకోకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.