- జీహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనానికి కేబినెట్ ఓకే
- కొత్తగా మరో డిస్కమ్.. 3 వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు టెండర్లు
- 10 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్లకు అనుమతులు
- పరిశ్రమలే సొంతంగా కరెంట్ తయారు చేసుకునే వెసులుబాటు
- హైదరాబాద్‌లో రూ.14,725 కోట్లతో అండర్ గ్రౌండ్ కేబులింగ్
- రామగుండంలో నిర్మించే 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్
- నిర్మాణ బాధ్యతలు ఎన్టీపీసీకి అప్పగింత
- కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు
- కేబినెట్ మరికొన్ని నిర్ణయాలివీ..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబెల్లిలో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ (ఎస్సీ, ఎస్టీ, బీసీ) నిర్మాణానికి 20.28 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు.ములుగు జిల్లా జగ్గన్నపేటలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు 40 ఎకరాల భూమిని కేటాయించారు.జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొత్తగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు కొత్తగా మరో 6 ఐటీఐలలో కూడా ఏటీసీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
హైదరాబాద్, వెలుగు:గ్రేటర్ హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న ప్రభుత్వం.. ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిని విస్తరించాలని నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) లోపల, బయట, అలాగే దానికి ఆనుకుని ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డెసిషన్ తీసుకుంది. దీనికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ విలీన ప్రక్రియకు అనుగుణంగా జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ చట్టాల్లో అవసరమైన సవరణలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న ఎన్‌పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్‌పై భారం తగ్గించేందుకు కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ కొత్త డిస్కం పరిధిలోకి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ, మంచినీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్, సీవరేజ్ బోర్డుకు సంబంధించిన పవర్ కనెక్షన్లన్నీ వస్తాయి.
మంగళవారం సెక్రటేరియెట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. 5 గంటలకు పైగా జరిగిన ఈ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
వచ్చే ఏడాది జీహెచ్ఎంసీ పాలకవర్గాల గడువు ముగుస్తుండటం.. ఇప్పటికే ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గ్రేటర్‌లో విలీనం చేయాలని భావించడంతో అందుకు తగ్గట్టుగా కేబినెట్ ఆమోదం తీసుకున్నారు. మీటింగ్ అనంతరం కేబినెట్ నిర్ణయాలను డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్, జూపల్లి, శ్రీహరి, లక్ష్మణ్ మీడియాకు వెల్లడించారు.
కేబినెట్ మీటింగ్‌లో విద్యుత్ శాఖపై చర్చ జరిగింది. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లోనూ విద్యుత్ సరఫరా కోసం అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3 వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు కోసం వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించింది.
ఐదేండ్ల కాలపరిమితి ఒప్పందంతో ఈ టెండర్లు ఉండనున్నాయి. అలాగే సోలార్ పవర్ తరహాలోనే 2వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ కొనుగోలుకు కూడా ఐదేండ్ల కాలపరిమితితో టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికితోడు రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని డెసిషన్ తీసుకుంది. ఇందుకోసం ముందుకొచ్చే కంపెనీలకు ప్రభుత్వమే భూమి, నీళ్లు సమకూరుస్తుంది. అయితే ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ముందుగా రాష్ట్ర డిస్కమ్‌లకే అమ్మాలనే షరతుతో అనుమతులు ఇవ్వనుంది.
ఇకపై అండర్ గ్రౌండ్ కేబుల్స్..
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, రాబోయే పదేండ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టిపెట్టినట్టు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రానికి కొత్తగా వచ్చే పరిశ్రమలకు విద్యుత్ విషయంలో వెసులుబాటు కల్పించినట్టు చెప్పారు. ‘‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ’ పాలసీలో భాగంగా కొత్త పరిశ్రమలు వాటికి కావాల్సిన విద్యుత్‌ను అవే సొంతంగా ఉత్పత్తి (క్యాప్టివ్ పవర్ జనరేషన్) చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం.
దీనికి ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. అప్లై చేసుకున్న వెంటనే అనుమతులు ఇవ్వాలని నిర్ణయించాం. పాత పరిశ్రమలకు మాత్రం ప్రస్తుత విధానమే కొనసాగుతుంది” అని వెల్లడించారు. ‘‘బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లోనూ విద్యుత్ సరఫరా కోసం అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయించాం. ఈ ప్రాజె క్టుకు దాదాపు రూ.14,725 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశాం. నగరాన్ని మూడు విభాగాలుగా విభజించి ఈ పనులు చేపడతాం.
విద్యుత్ తీగలతో పాటే టీ-ఫైబర్, ఇతర కేబుల్స్ అన్నీ భూగర్భంలోనే ఉండేలా ప్రణాళిక రచిస్తున్నాం” అని తెలిపారు. ‘‘రామగుండం థర్మల్ పవర్ స్టేషన్‌లో కొత్తగా నిర్మించతలపెట్టిన 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణ బాధ్యతలను ఎన్టీపీసీకి అప్పగించాలని నిర్ణయించాం. పాల్వంచ, మక్తల్‌లోనూ ప్లాంట్ల ఏర్పాటు అవకాశాలను ఎన్టీపీసీ ద్వారా పరిశీలించనున్నాం. జెన్‌కోతో పోలిస్తే ఎన్టీపీసీ ద్వారా నిర్మాణం చేపడితే యూనిట్ ధర ఎంత తగ్గుతుందనే దానిపై అంచనాలు వేయనున్నాం” అని చెప్పారు.
లీకులపై సీఎం సీరియస్..
కేబినెట్ మీటింగ్‌లో తీసుకుంటున్న నిర్ణయాలు బయటకు లీక్ అవుతుండడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. హెచ్‌ఐఎల్‌టీ పాలసీపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్న తెల్లారే.. ఆ సమాచారం మొత్తం ఎలా లీకైందంటూ సీఎస్‌ను ఆయన నిలదీసినట్టు సమాచారం. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన అంశాలు బయటి వ్యక్తులకు, ప్రతిపక్షాలకు ఎవరు చేరవేస్తున్నారంటూ అధికారుల తీరుపై సీఎం మండిపడ్డారు. పాలసీ పరమైన విషయాలు అధికారికంగా ప్రకటించకముందే బయటకు రావడం వెనుక ఉన్నదెవరని ప్రశ్నించినట్టు తెలిసింది. ఆఫీసర్లు జాగ్రత్తగా పని చేసుకోవాలని హెచ్చరించారు.
