ప్రేమ వివాహం చేసుకున్న జంటపై..అమ్మాయి బంధువుల దాడి

ప్రేమ వివాహం చేసుకున్న జంటపై..అమ్మాయి బంధువుల దాడి

శాయంపేట, వెలుగు :  ప్రేమ వివాహం చేసుకున్న జంటతో పాటు, అబ్బాయి తల్లిదండ్రులపై అమ్మాయి తరఫు బంధువులు దాడి చేశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేటలో శనివారం జరిగింది. శాయంపేట గ్రామానికి చెందిన నాగరాజు, కరీంనగర్‌‌ జిల్లా సైదాపూర్‌‌ మండలం ఘనపురం గ్రామానికి చెందిన శ్రావణి ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా, అమ్మాయిని మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేందుకు యత్నించారు. దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన శ్రావణి ఈ నెల 12న ఓ గుడిలో నాగరాజును పెండ్లి చేసుకుంది. అనంతరం భర్త, అత్తమామలకు తన అమ్మనాన్న, బంధువులతో ప్రాణహాని ఉందని అదే రోజు శాయంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

దీంతో ఎస్సై దేవేందర్‌ అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులను పిలిచి అమ్మాయి మేజర్‌ అయినందున ఆమె జోలికి వెళ్లొద్దని హెచ్చరించారు. అప్పటి నుంచి శ్రావణి, నాగరాజు శాయంపేటలోనే ఉంటున్నారు. శనివారం శ్రావణి తల్లిదండ్రులు అల్లెపు రజిత, రాజు, అన్నయ్యతో పాటు సుమారు 30 మందితో కలిసి వచ్చి నాగరాజు ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి ఇద్దరిని కొట్టడమే కాకుండా, అడ్డువచ్చిన నాగరాజు తల్లిదండ్రులపై కూడా కర్రలతో దాడి చేశారు.  ఇంట్లో ఉన్న రూ. 10 వేలు, బంగారం ఎత్తుకెళ్లారు. 

అనంతరం శ్రావణి, నాగరాజును వెహికల్‌లో ఎక్కించి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. స్థానికులు 100కు డయల్‌ చేయడంతో వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం తమ కూతురిని తమతో పంపించాలంటూ నాగరాజు ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. వారిని స్టేషన్‌కు తరలించారు. ప్రేమజంట జోలికి వెళ్లమని అమ్మాయి తల్లిదండ్రులతో లెటర్‌ రాయించుకొని వదిలేశారు. ఈ విషయంపై సీఐ రంజిత్‌ మాట్లాడుతూ ప్రేమ జంటపై దాడి జరిగింది వాస్తవమేనని, అమ్మాయి కేసు పొట్టొద్దని కోరిందని చెప్పారు. కంప్లైంట్‌ ఇస్తే కేసు ఫైల్‌ చేస్తామని చెప్పారు.