బీసీ కులగణనకు బడ్జెట్​లో నిధులివ్వండి : మంత్రి పొన్నం

బీసీ కులగణనకు బడ్జెట్​లో నిధులివ్వండి : మంత్రి పొన్నం
  •     డిప్యూటీ సీఎం భట్టిని కోరిన బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం
  •     బీసీ గురుకులాలకు సొంత భవనాలు కట్టించాలి
  •     కల్యాణలక్ష్మికి అదనంగా నిధులివ్వండి
  •     సెక్రటేరియెట్​లో బీసీ సంక్షేమ శాఖ బడ్జెట్​పై మంత్రుల రివ్యూ

హైదరాబాద్, వెలుగు : బీసీ గురుకులాలకు సొంత భవనాలు కట్టించాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. బడ్జెట్​లో సరిపడా నిధులు కేటాయించాలని కోరారు. బీసీ కులగణన చేస్తామని హామీ ఇచ్చినందున.. దానికీ నిధులు పెట్టాలన్నారు. గత బడ్జెట్ కంటే ఎక్కువ ఫండ్స్ ఇచ్చేలా చూడాల్సిందిగా విన్నవించారు. మంగళవారం సెక్రటేరియెట్​లో బీసీ సంక్షేమ శాఖ, ట్రాన్స్​పోర్ట్ డిపార్ట్​మెంట్​ బడ్జెట్​పై భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. బీసీ గురుకులాలు, కల్యాణలక్ష్మి, బీసీ విద్యార్థుల స్కాలర్​షిప్​లకు సంబంధించిన నిధుల కేటాయింపులపై ప్రత్యేకంగా చర్చించారు.

ప్రస్తుతం ఏటా 300 మందికి ఓవర్సీస్ స్కాలర్​షిప్స్ ఇస్తున్నారని, మరింత మందికి ఆర్థిక సాయం అందేలా చూడాలని భట్టిని పొన్నం కోరారు. కాంగ్రెస్​ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కల్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం ఇవ్వాల్సి ఉంటుందని, దానికి అనుగుణంగా మరిన్ని నిధులు కేటాయించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బీసీ హాస్టళ్లను మరింత అభివృద్ధి చేసేందుకు నిధులు ఎక్కువ అవసరం అవుతాయన్నారు. పాత జిల్లాల పరంగా బీసీ స్టడీ సర్కిళ్లకు పక్కా భవనాలున్నాయని, కొత్త జిల్లాలకు అనుగుణంగా బిల్డింగ్​లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. 

విద్యను మరింత ముందుకు తీసుకెళ్లాలి

సావిత్రి బాయి అభ్యుదయ యోజన కింద బాలికల విద్యను మరింత ముందుకు తీసుకుపోవాల్సిందిగా అధికారులను మంత్రులు భట్టి, పొన్నం ఆదేశించారు. కులవృత్తుల్లో ఉన్నోళ్లు, చదువుకున్న వారు ఉద్యోగాల్లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించే కార్యక్రమాలపై అధ్యయనం చేయాలని సూచించారు. కల్లుగీత కార్మికులకు అధునాతన సేఫ్టీ మోకులు సబ్సిడీతో అందించేలా చూడాలని ఆదేశించారు.

కాగా, బీసీ డిక్లరేషన్​పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, దానికి అనుగుణంగా బడ్జెట్​లో నిధులను కేటాయించాల్సిన అవసరం ఉంటుందని భట్టి విక్రమార్క దృష్టికి పొన్నం ప్రభాకర్​ తీసుకొచ్చారు. కొత్త బస్సులు కొనుగోలుకు కూడా బడ్జెట్​లో నిధులు కేటాయించాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల పీఆర్సీలు, డీఏ, సీసీఎస్, పీఎఫ్ బకాయిలు, బ్యాంక్​ లోన్లు పెండింగ్​లో ఉన్నాయని, వీటిపై దృష్టి సారించాలన్నారు. ప్రతి నెలా ఒకటో తారీఖున ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీతో పాటు ట్రాన్స్​పోర్ట్ బిల్డింగ్స్​కి సోలార్ పవర్ ఏర్పాటుపై స్టడీ చేయాలని అధికారులను మంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ హరిత, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఆ శాఖ అడిషనల్​ సెక్రటరీ పద్మ, బీసీ గురుకుల సెక్రటరీ మల్లయ్య భట్టు, ట్రాన్స్​పోర్ట్ సెక్రటరీ శ్రీనివాస రాజు, కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.