
Glottis IPO: చాలా కాలం తర్వాత అక్టోబరు నెలలో మళ్లీ ఐపీవోల రద్దీ మార్కెట్లలో కొనసాగుతోంది. అయితే సెప్టెంబర్ నుంచి ఐపీవోల మార్కెట్లోకి అడుగుపెట్టిన చాలా కంపెనీలు ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేయటంతో ప్రస్తుతం ఐపీవోలపై నిరాసక్తత కొనసాగుతోంది. అయితే మరోపక్క మార్కెట్లు ఆశాజనకంగా ఉన్నప్పటికీ కొన్ని కంపెనీల ఐపీవోలు నష్టాల లిస్టింగ్ నమోదు చేయటం రిటైల్ పెట్టుబడిదారులను షాక్ కి గురిచేస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఈరోజు మార్కెట్లోకి అడుగుపెట్టిన గ్లోటిస్ కంపెనీ ఐపీవో గురించే. కంపెనీ ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.307 కోట్లను సమీకరించింది. ఇందులో తాజా ఈక్విటీతో పాటు ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉంది. వాస్తవానికి కంపెనీ తన ఇష్యూ సమయంలో ఐపీవో షేరు ఇష్యూ రేటు రూ.129గా గరిష్ఠ ఆఫర్ రేటు ప్రకటించగా.. నేడు కంపెనీ షేర్లు 35 శాతం డిస్కౌంటెడ్ రేటు వద్ద ఒక్కో షేరు రూ.84కి ఎన్ఎస్ఈలో జాబితా అయ్యాయి. దీంతో పెట్టుబడిదారులకు తొలిరోజునే భారీ నష్టం మిగిలింది. లాభాలొస్తాయని లెక్కలు వేసుకున్న ఇన్వెస్టర్లకు ఇది పెద్ద షాక్.
►ALSO READ | Gold Rate: ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి గోల్డ్, సిల్వర్.. బ్రేకులు లేకుండా ర్యాలీ.. అందువల్లే..!
గ్లోటిస్ ఐపీవో సెప్టెంబర్ 29న ప్రారంభం కాగా అక్టోబర్ 1న ముగిసింది. ప్రధానంగా కంపెనీ షేర్లకు నాన్ ఇన్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి ఎక్కువగా పెట్టుబడులు వచ్చాయి. అయితే నష్టాల్లో లిస్ట్ అయినప్పటికీ కంపెనీ రానున్న కాలంలో మంచి రాబడులను తెచ్చిపెట్టగలదని, కంపెనీకి ఉన్న బిజినెస్ అడ్వాంటేజ్ అని తెలుస్తోంది. అయితే మరోపక్క రెన్యూవబుల్ ఎనర్జీ వ్యాపారంలో రావలసిన బకాయిలు పెరిగిపోవటం కొంత ఆందోళనకరమైన అంశంగా అనలిస్టులు చెబుతున్నారు.
కంపెనీ వ్యాపారం..
గ్లోటిస్ కంపెనీ లాజిస్టిక్స్ వ్యాపారంలో ఎండ్ టూ ఎండ్ రవాణా సేవలను ఆఫర్ చేస్తోంది. రోడ్లు, వాయు, సముద్ర మార్గాల్లో సేవలను అందిస్తోంది. భౌగోళికంగా అనేక ప్రాంతాల్లో లాజిస్టిక్ సేవలను ఆప్టిమైజ్ చేయడం ద్వారా విభిన్న పరిశ్రమలకు సేవలు అందిస్తుంది. కంపెనీ సముద్ర మార్గంలో కంటైనర్ లోడ్ కార్గో ఎగుమతి దిగుమతి, ఎయిర్ ఫార్వార్డింగ్, స్టోరేజ్, కార్గో నిర్వహణ, థర్డ్ పార్టీ లాజిస్టిక్స్, కస్టమ్స్ క్లియరెన్స్ వంటి ఇతర సేవలను కూడా ఆఫర్ చేస్తోంది. అలాగే లాజిస్టిక్స్ వ్యాపారంలో ఉన్న కంపెనీ రెన్యూవబుల్ ఎనర్జీ పరిశ్రమలో కూడా ఉంది.