- మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ
కోల్‌బెల్ట్, వెలుగు : మందమర్రి ఏరియాలోని అండర్ గ్రౌండ్, ఓపెన్‌కాస్ట్ గనుల్లో క్రమేణా బొగ్గు ఉత్పత్తి, ఉత్పాకదత పెరుగుతుందని ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ తెలిపారు. శుక్రవారం మందమర్రి జీఎం ఆఫీస్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో అక్టోబర్‌కు సంబంధించిన బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను జీఎం మీడియాకు వెల్లడించారు.
ఏరియాలోని బొగ్గు గనుల్లో అక్టోబర్‌లో 2,45,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 65 శాతంతో 1,58,037 టన్నులు సాధించాయన్నారు. కేకే–-5 గనిలో 86 శాతం ఉత్పత్తి జరిగిందన్నారు. 20 వేల టన్నులకుగాను 17,242 టన్నులు బొగ్గు ఉత్పత్తి అయ్యిందని చెప్పారు. కాసీపేట-–2 గనిలో 78 శాతం, శాంతిఖని గనిలో 68 శాతం, కాసీపేట–1 గనిలో 66 శాతం, కేకే ఓసీపీలో 61 శాతంతో 1,09,001 టన్నుల బొగ్గు ఉత్పత్తి అయ్యిందని వివరించారు.
ఆర్థిక సంవత్సరం ఏడు నెలల్లో మందమర్రి ఏరియా గనులు 75 శాతం బొగ్గు ఉత్పత్తితో సాగుతున్నాయని, అందులో కేకే–5 యూజీ మైన్ 98 శాతం ఉత్పత్తితో కొనసాగడం అభినందనీయమన్నారు. నిరంతరాయంగా కురిసిన వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలిగిందన్నారు. కళ్యాణిఖని ఓపెన్‌కాస్ట్ గనిలో కొత్తగా ఓవర్‌బర్డెన్(మట్టి) ఆఫ్‌లోడింగ్ ప్రిపరేషన్ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయని తెలిపారు.
నాలుగేండ్ల కాలపరిమితితో 'ఎక్స్‌ప్రెస్ వే' అనే ఓబీ సంస్థకు ఆఫ్‌లోడింగ్ పనుల కాంట్రాక్ట్ దక్కిందన్నారు. నాలుగేండ్లలో సదరు కంపెనీ 1100 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికితీస్తారని చెప్పారు. 20 షావల్స్,90 టిప్పర్లతో పనులు జరుగుతాయని తెలిపారు. సింగరేణి సంస్థ కూడా 1,1ఏ సీముల్లో సొంతగా డిపార్ట్మెంట్ ద్వారా ఓబీ, బొగ్గు ఉత్పత్తి కొనసాగిస్తామన్నారు.
కేకే ఓసీపీలో ఆఫ్‌లోడింగ్ కొత్త కాంట్రాక్ట్‌తో బొగ్గు ఉత్పత్తి క్రమేణా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో ఏజీఎం ప్రసాద్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ భూశంకరయ్య, పర్సనల్ మేనేజర్శ్యాంసుందర్, ఐఈడీ ఎస్ఈ కిరణ్ణకుమార్, డీజీఎం సురేశ్, సీనియర్పీవో శంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
